fruits export
-
సముద్ర మార్గంలో పండ్లు, కూరగాయల ఎగుమతులు
న్యూఢిల్లీ: సముద్ర మార్గంలో తాజా పండ్లు, కూరగాయల ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా నియమావళిని (ప్రొటోకాల్) కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ ప్రకటించారు. అరటి, మామిడి, దానిమ్మ, జాక్‌ఫ్రూట్ తదితర ఉత్పత్తులను ప్రస్తుతం విమాన రవాణా ద్వారా పంపిస్తున్నారు. ఎగుమతుల పరిమాణం తక్కువగా ఉండడం, పండ్లు పక్వానికి వచ్చే కాలం వేర్వేరుగా ఉండడమే ఇందుకు కారణం. సముద్ర రవాణా ప్రోటోకాల్‌లో భాగంగా, పండ్లు పరిపక్వానికి వచ్చే నిర్ధిష్ట కాల వ్యవధి, ఒక్కో ఉత్పత్తి శాస్త్రీయంగా ఎన్ని రోజులకు పండుతుంది? నిర్దేశిత సమయంలో వాటిని సాగు చేయడం, రైతులకు శిక్షణ ఇవ్వడం వంటివి భాగంగా ఉంటాయి. ఒక్కో పండు, కూరగాయకు ఇది వేర్వేరుగా ఉంటుంది. సముద్ర మార్గంలో రవాణాతో తక్కువ వ్యయానికి, ఎక్కువ మొత్తంలో పంపించుకోవచ్చని రాజేష్ అగర్వాల్ తెలిపారు. ‘‘ఇప్పటి వరకు వీటిని వాయు మార్గంలోనే ఎగుమతి చేస్తున్నాం. అగ్రి ఉత్పత్తుల ఎగుమతులకు సముద్ర రవాణాను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చన్నది పరీక్షించి చూస్తున్నాం. అందుకే సముద్ర ప్రొటోకాల్‌ను అభివృద్ధి చేస్తున్నాం’’అని రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం విమానయానం ద్వారా పంపిస్తుండడంతో, ధరల పరంగా పోటీ ఇచ్చే సానుకూలత ఉండడం లేదన్నారు. అపెడా, ఇతర భాగస్వాములతో కలసి అరటి పండ్ల ఎగుమతులకు సంబంధించిన ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ‘‘ఖాళీ కంటెయినర్లో పరీక్షించి చూశాం. ప్రత్యక్ష పరిశీలనలో భాగంగా రోటెర్డ్యామ్కు మొదటి షిప్పింగ్‌ను పంపించాం. ఇది విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. ఒక్కసారి ఇది పూర్తయితే దిగుమతిదారులు ఆమోదించడం మొదలవుతుంది. అప్పుడు పెద్ద మొత్తంలో ఎగుమతులకు వీలు కలుగుతుంది’’అని అగర్వాల్ వివరించారు. అరటి సాగులో నంబర్ 1 ప్రపంచంలో అరటి తయారీలో భారత్ మొదటి స్థానంలో ఉంది. అయినా కానీ, ప్రపంచ అరటి ఎగుమతుల్లో భారత్ వాటా కేవలం 1% మించి లేదు. ప్రపంచ అరటి ఉత్పత్తిలో భారత్ వాటా 26. 45 శాతంగా ఉంది. ఇది 35.36 మిలియన్ మెట్రిక్ టన్నులకు సమానం. గత ఆర్థిక సంవత్సరం (2022–23) మొత్తం మీద చేసిన అరటి ఎగుమతులు ఏ మాత్రం మార్పు లేకుండా 176 మిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–ఆగస్ట్ వరకు మామిడి ఎగుమతులు 19% పెరిగి 48 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మన దేశం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతులు 13% వృద్ధితో 2 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఎంపీ తలారి లేఖకు స్పందించిన కేంద్రం
సాక్షి, అమరావతి: రాయలసీమకు ప్రత్యేకించి అనంతపురం నుంచి పండ్లు, కూరగాయల ఎగుమతికి కిసాన్ రైలు నడపాలన్న పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య వినతికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తలారి వినతిని పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రైల్వే బోర్డు.. దక్షిణ మధ్య రైల్వే వాణిజ్య విభాగం ముఖ్య అధికారిని ఆదేశించింది. రైల్వే అధికారులు సోమవారం అనంతపురం వెళ్లి ఉద్యాన శాఖాధికారులతో చర్చలు జరిపి సానుకూలత వ్యక్తం చేశారు. వచ్చే అక్టోబర్ లేదా నవంబర్ నుంచి కిసాన్ రైలు అనంతపురం–ఢిల్లీ మధ్య నడవనుంది. (టీడీపీ ఇన్చార్జ్పై కలెక్టర్ సీరియస్) ► అనంతపురం జిల్లా నుంచి పండ్లు, కూరగాయలు ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని మార్కెట్లకు రవాణా అవుతుంటాయి. ► రోడ్డు మార్గం ద్వారా ఢిల్లీ చేరాలంటే ఐదారు రోజులు పడుతుంది. దీంతో చాలా ఉత్పత్తులు చెడిపోతున్నాయి. ► అనంత ఎంపీ రంగయ్య.. సీఎం జగన్ సూచనతో కిసాన్ రైలును కేటాయించాలని ఇటీవల ప్రధాని, రైల్వే మంత్రికి లేఖ రాశారు. -
అరటి, దానిమ్మ ఎగుమతికి ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్ : అరటి, దానిమ్మ ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి సారించినట్లు ఉద్యానశాఖ కమిషనర్ కె.చిరంజీవ్ చౌదరి తెలిపారు. ఇందుకు గాను ముంబయికి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ, ఐఎన్ఐ ఫార్మ్ సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ‘ఫ్యూచర్ గ్రూప్ అండ్ ఐఎన్ఐ ఫార్మ్స్ ఆన్ వాల్యూ ఛైన్ డెవలప్మెంట్ బనానా అండ్ పొమగ్రనేట్’ అనే అంశంపై అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఉద్యానశాఖ డీడీ, ఏడీలు, కొందరు రైతులతో బుధవారం స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు జిల్లాల పరిధిలో విస్తీర్ణ పరంగా ఉద్యానతోటలు భారీగానే ఉన్నాయని, పంటల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి అవసరమైన ఇన్పుట్స్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌లో పేరున్న కార్పొరేట్ కంపెనీలతో అంగీకారం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగు జిల్లాల పరిధిలో అరటి, దానిమ్మ పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించునున్నట్లు చెప్పారు. 10 వేల ఎకరాల్లో అరటి, 600 ఎకరాల దానిమ్మ తోటలను గుర్తించి సదరు రైతులకు సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంతో పాటు పండిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారన్నారు. భవిష్యత్తులో బొప్పాయి, క్యాప్సికం, బ్రిటిష్ కుకుంబర్ (దోస), మిరప లాంటి మరికొన్ని పంటలకు మరికొన్ని కంపెనీల ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ లోపం, విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీకి చెందిన సీజీఎం ఫంకజ్‌ఖండేల్‌వాల్, సుమిత్, అజిత్‌కుమార్ పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, కమిషనరేట్ డీడీలు హనుమంతరావు, అశోక్‌కుమార్, పద్మావతి, నాలుగు జిల్లాకు చెందిన అధికారులు వైవీఎస్ ప్రసాద్, జి.సతీష్, జి.చంద్రశేఖర్, బీవీ రమణ, సుహాసిని, రఘునాథరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.