అనంతపురం అగ్రికల్చర్ : అరటి, దానిమ్మ ఉత్పత్తుల ఎగుమతిపై దృష్టి సారించినట్లు ఉద్యానశాఖ కమిషనర్ కె.చిరంజీవ్ చౌదరి తెలిపారు. ఇందుకు గాను ముంబయికి చెందిన ఫ్యూచర్ గ్రూప్ కంపెనీ, ఐఎన్‌ఐ ఫార్మ్ సహకారంతో మార్కెటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ‘ఫ్యూచర్ గ్రూప్ అండ్ ఐఎన్‌ఐ ఫార్మ్స్ ఆన్ వాల్యూ ఛైన్ డెవలప్‌మెంట్ బనానా అండ్ పొమగ్రనేట్’ అనే అంశంపై అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు చెందిన ఉద్యానశాఖ డీడీ, ఏడీలు, కొందరు రైతులతో బుధవారం స్థానిక ఏఎఫ్ ఎకాలజీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాలుగు జిల్లాల పరిధిలో విస్తీర్ణ పరంగా ఉద్యానతోటలు భారీగానే ఉన్నాయని, పంటల వారీగా రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి అవసరమైన ఇన్‌పుట్స్, మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఉద్యాన ఉత్పత్తుల మార్కెటింగ్‌లో పేరున్న కార్పొరేట్ కంపెనీలతో అంగీకారం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది నాలుగు జిల్లాల పరిధిలో అరటి, దానిమ్మ పంట ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించునున్నట్లు చెప్పారు. 10 వేల ఎకరాల్లో అరటి, 600 ఎకరాల దానిమ్మ తోటలను గుర్తించి సదరు రైతులకు సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందజేయడంతో పాటు పండిన ఉత్పత్తులను కొనుగోలు చేస్తారన్నారు.
భవిష్యత్తులో బొప్పాయి, క్యాప్సికం, బ్రిటిష్ కుకుంబర్ (దోస), మిరప లాంటి మరికొన్ని పంటలకు మరికొన్ని కంపెనీల ద్వారా మార్కెటింగ్ సదుపాయం కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పర్యవేక్షణ లోపం, విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఫ్యూచర్ గ్రూప్ కంపెనీకి చెందిన సీజీఎం ఫంకజ్‌ఖండేల్‌వాల్, సుమిత్, అజిత్‌కుమార్ పాల్గొన్నారు. ఏపీఎంఐపీ పీడీ ఎం.వెంకటేశ్వర్లు, కమిషనరేట్ డీడీలు హనుమంతరావు, అశోక్‌కుమార్, పద్మావతి, నాలుగు జిల్లాకు చెందిన అధికారులు వైవీఎస్ ప్రసాద్, జి.సతీష్, జి.చంద్రశేఖర్, బీవీ రమణ, సుహాసిని, రఘునాథరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, ఉద్యాన పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
అరటి, దానిమ్మ ఎగుమతికి ప్రోత్సాహం
Published Wed, Jul 19 2017 10:47 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement