జయలలిత పార్టీపై విరుచుకుపడ్డ శశికళ
న్యూఢిల్లీ: అన్నాడీఎంకే నుంచి బహిష్కణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సొంత పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అన్నాడీఎంకే పార్టీని బానిసల గుంపు(స్లేవ్ గ్యాంగ్)గా వర్ణించారు. బానిసల గుంపులో భాగం కావాలనుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు. తనను వేధిస్తే నాడార్ సామాజిక వర్గం ప్రతిఘటిస్తుందని ఆమె హెచ్చరించారు. 'నేను నాడార్ కులానికి చెందిన దాన్ని. భయపడేది లేదు. ప్రజలు ఇదంతా చూస్తున్నారు. నాకు అండగా నా కులం నిలుస్తుంది. తమిళనాడులోని దక్షిణాది జిల్లాల్లోని బలమైన కమ్యునిటీల్లో నాడార్ కులం ఒకట'ని పుష్ప అన్నారు.
మరోవైపు అమ్మ ఆజ్ఞను ధిక్కరించిన శశికళ పుష్ప మెడకు ఉచ్చు బిగుస్తున్నది. ఆమెను ఉక్కిరి బిక్కిరిచేస్తూ ఫిర్యాదులు హోరెత్తుతున్నాయి. గతంలో శశికళ పుష్ప ఇంట్లో పనిచేస్తున్న ఏడుగురు వేర్వేరు కారణాలతో మరణించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులు హోరెత్తుతుండడంతో ఆత్మరక్షణలో పడ్డ శశికళ పుష్ప, ఇక తమిళనాట న్యాయం జరగదని భావించి ముందస్తు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.