Gaali Sampath Movie
-
పాపం 'గాలి సంపత్' అప్పుడే ఓటీటీ బాట!
కొత్త కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం గాలి సంపత్. ఫి..ఫి..ఫీ అంటూ గాలి భాషను పరిచయం చేసిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్‌గా మాత్రం హిట్టవలేదు. పైగా బాక్సాఫీస్ దగ్గర జాతి రత్నాలు పోటీని తట్టుకుని నిలబడలేక కుప్పకూలిపోయింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా అప్పుడే ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో మార్చి 19న రిలీజ్ కానుంది. ఇందుకోసం ఆహా టీమ్ చిత్రయూనిట్‌తో మంచి డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. కాగా 'గాలి సంపత్'లో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించారు. అనీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్. కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్లు రాబట్టడంలో ఘోరంగా విఫలమైంది. దీంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు మొగ్గు చూపారు. ఫలితంగా సినిమా రిలీజై పట్టుమని పది రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వస్తుండటం టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: 'గాలి సంపత్' మూవీ రివ్యూ విలన్ గా నన్ను చూడరేమో!: శ్రీ విష్ణు -
ఆ అభినందనలను ఎప్పటికీ మర్చిపోలేను: రాజేంద్ర ప్రసాద్
‘‘నా కెరీర్లో చేసిన సరికొత్త ప్రయత్నం ‘గాలి సంపత్’. ‘అన్నయ్యా.. ఈ చిత్రంలో ఆస్కార్ అంత పర్ఫార్మెన్స్ చేశావు’ అనే అభినందనలను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.. నా గుండెల్లో ఉంచుకుంటాను’’ అని నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు. శ్రీవిష్ణు, లవ్లీ సింగ్ జంటగా అనీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గాలి సంపత్’. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఎస్.కృష్ణ నిర్మించిన ఈ సినిమా గురువారం విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ– ‘‘ఫిలిం స్కూల్లో ఉన్నప్పుడు నాకు మైమ్ పర్‌ఫార్మెన్స్‌లోనే గోల్డ్ మెడల్ వచ్చింది. ఇన్ని సంవత్సరాలకు ఆ డ్రెస్ వేసుకుని స్టేజ్ మీదకు రావడానికి మా మైమ్ మధునే కారణం’’ అన్నారు. ‘‘మా సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారని గ్యారెంటీగా చెప్పగలను’’ అన్నారు ఎస్.కృష్ణ. ‘‘మీ పిల్లలు, కుటుంబంతో సినిమా చూస్తే మరింత ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు శ్రీవిష్ణు. ‘‘మైమ్ ముఖ అభినయాన్ని సినిమాలో పెట్టాలంటే దమ్ముండాలి. ఎస్.కృష్ణగారి ఆలోచనకి హ్యాట్సాఫ్’’ అన్నారు మైమ్ మధు. ఈ కార్యక్రమంలో కమెడియన్ సత్య, హీరోయిన్ లవ్లీ సింగ్ మాట్లాడారు. చదవండి: పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన ఎన్టీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న జాతిరత్నం నవీన్ పొలిశెట్టి -
'గాలి సంపత్' మూవీ రివ్యూ
చిత్రం: ‘గాలి సంపత్’; తారాగణం: రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు, లవ్లీ సింగ్, సత్య, తనికెళ్ళ భరణి, శ్రీకాంత్ అయ్యంగార్, అనీశ్ కురువిల్లా; కథ: ఎస్. కృష్ణ; సంగీతం: అచ్చు రాజమణి; కెమేరా: సాయి శ్రీరామ్; ఎడిటింగ్: బి. తమ్మిరాజు; నిర్మాతలు: ఎస్. కృష్ణ, హరీశ్ పెద్ది, సాహూ గారపాటి; సమర్పణ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి; దర్శకత్వం: అనీశ్ కృష్ణ; నిడివి: 119 నిమిషాలు; రిలీజ్: మార్చి 11 కొన్ని కాన్సెప్టులు వినడానికి చాలా బాగుంటాయి. ఉద్విగ్నతకు గురిచేస్తాయి. అయితే, ఆ కాన్సెప్టును సరైన రీతిలో కథగా డెవలప్ చేసుకొని, ఆసక్తికర సన్నివేశాలతో అల్లుకున్నప్పుడే పూర్తిస్థాయి సినిమా స్క్రిప్టు అవుతుంది. లేదంటే, మంచి కాన్సెప్టు సైతం మెచ్చుకొనే రీతిలో తయారు కాలేదని పెదవి విరవాల్సి వస్తుంది. ‘గాలి సంపత్’ చూశాక ఇలాంటి ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతాయి. ప్రకృతి దైవం లాంటిది. అప్పుడప్పుడు కొంత హాని చేసినట్టనిపించినా, దాని స్వభావం మనల్ని రక్షించడమే అనే పాయింట్ చెప్పేందుకు ఈ 2 గంటల చిన్న సినిమాలో ప్రయత్నించారు. కథేమిటంటే..: అరకులో ట్రక్కు డ్రైవర్ సూరి (శ్రీవిష్ణు). తల్లి లేని అతనికి తండ్రి సంపత్ (రాజేంద్రప్రసాద్) ఒక్కడే ఉంటాడు. నోట మాట పోవడంతో, ‘‘ఫి... ఫి... ఫీ’’ అంటూ గాలితో మాట్లాడుతుంటాడు కాబట్టి, ఆ తండ్రి పేరు గాలి సంపత్. గొప్ప నటుడిగా పేరు తెచ్చుకోవాలని నాటక పోటీలలో పాల్గొంటూ, ఉంటాడు గాలి సంపత్. ఆ ఊరి సర్పంచ్ కూతురు (లవ్లీ సింగ్)ను ప్రేమిస్తాడు సూరి. అప్పులు తీర్చేసి, ఎలాగైనా ఓ ట్రక్కు కొనుక్కొని, ఆమెను పెళ్ళాడాలని మనోడి ప్లాన్. ఓ బ్యాంకు మేనేజర్‌ను మొహమాటపెట్టి, 5 లక్షలు తెస్తాడు. తీరా నాటక పోటీల కోసం ఆ డబ్బు అతని తండ్రి తీస్తాడు. దాంతో, కంటికి కనిపించకుండా పొమ్మని కొడుకు అంటాడు. ఆ క్రమంలో హోరున కురుస్తున్న వర్షంలో ఇంటి వెనకే లోతైన పెద్ద గోతిలో పడిపోతాడు తండ్రి. పైకి మాట్లాడలేని, అరవలేని ఆ మనిషి ఆ గోతిలో పడ్డ సంగతి ఎవరూ గమనించరు. అతనికై వెతుకులాట సాగుతుంది. తండ్రిని ద్వేషిస్తున్న కొడుకుకు తన కోసం చిన్నప్పుడు తండ్రి చేసిన త్యాగం లాంటివన్నీ సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్‌లో వస్తాయి. చివరకు ప్రకృతిని ద్వేషించిన తండ్రికి ఆ ప్రకృతే ఎలా సహకరించింది, అతని అభినయ ప్రతిభ ఎలా బయటపడిందన్నది అక్కడక్కడ మెరుపులతో సాగే మిగతా కథ. ఎలా చేశారంటే..: లేటు వయసులో ఘాటు పాత్ర దక్కడం ఏ నటుడికైనా వరం. నాలుగు దశాబ్దాల పైచిలుకు తరువాత నటుడు రాజేంద్రప్రసాద్ కు ఇప్పుడు అలాంటి వరం మరోసారి దక్కింది. ఈ సినిమా టైటిల్ రోల్ ఆయనదే. ఇంకా చెప్పాలంటే, కథ అంతా ఆయన చుట్టూరానే తిరుగుతుంది.ఆయన తన నట విశ్వరూపం చూపెట్టారు. శ్రీవిష్ణు బాగా చేశారు. మహారాష్ట్ర మోడలింగ్ అమ్మాయి లవ్లీ సింగ్ ఈ సినిమాలో అందానికీ, అభినయానికీ కూడా తక్కువే. మిగిలిన పాత్రల్లో గోదావరి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ గా శ్రీకాంత్ అయ్యంగార్, ఆడిటింగ్ ఆఫీసర్ గా అనీశ్ కురువిల్లా లాంటి వారి కామెడీ అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, అతిగా సాగదీసే సరికి ఉసూరుమనిపిస్తుంది. ఎలా తీశారంటే..: వరుస హిట్లతో జోరు మీదున్న దర్శకుడు అనిల్ రావిపూడి. ఆయన ఈసారి ఈ చిన్న కథ, తెలుగు తెరపై కొత్త ప్రయత్నంతో సినీ నిర్మాణంలోకీ వచ్చారు. తానే మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అరకులో చిత్రీకరించిన ఈ సినిమాలో ప్రధానమైనది తండ్రీ కొడుకుల సెంటిమెంట్. అది అక్కడక్కడా పండింది. కానీ, కొడుకు ఎవరిని ప్రేమిస్తున్నాడో తండ్రికి తెలియకపోవడం, సాక్షాత్తూ కొడుకు పెళ్ళినే అతను చెడగొట్టడం అంత కన్విన్సింగ్‌గా లేదు. ఫ్లాష్‌బ్యాక్ బాగున్నా, తన చిన్నప్పుడు ఏం జరిగిందో కళ్ళారా చూసిన కొడుకుకు ఇంకొకరు చెప్పేవరకు అసలేం జరిగిందో తెలియదనడమూ పెద్దగా అతకలేదు. తీసుకున్న పాయింట్ బాగున్నా, కథారచనలో ఇలాంటి ఇబ్బందులున్నాయి. సహజ పరిణామ క్రమంగా కాక, అనుకున్నట్టల్లా సంఘటనలు జరిగిపోయే సినిమాటిక్ లిబర్టీలూ బోలెడు. ఫస్టాఫ్‌లో చాలా భాగం అసలు కథకు రంగం సిద్ధం చేయడంతోనే సరిపోతుంది. రాజేంద్రప్రసాద్ మూకాభినయ (మైమ్) ప్రదర్శన దగ్గర నుంచి కాస్తంత ఊపు వస్తుంది. గోతిలో పడడ మనే పాయింట్ చుట్టూరానే కథ నడిస్తే బాగుండేది. కానీ, తీసుకున్న పాయింట్ చిన్నది కావడంతో కామెడీని జొప్పించే ప్రయత్నం చేశారు. అది అసలు కథా గమనానికి అడ్డమై కూర్చుంది. సెంటిమెంట్ పండుతున్న చాలా సందర్భాల్లో అనవసరపు హాస్యం అడ్డం పడినట్టు అనిపిస్తుంది. మరింత బలమైన సన్నివేశాలు రాసుకొని ఉంటే బాగుండేది. కొన్ని డైలాగులు మనసుకు హత్తుకుంటాయి. డైలాగులు లేని మైమ్ ప్రదర్శన, క్లైమాక్స్ గోతి సీన్ లాంటి చోట్ల అచ్చు రాజమణి నేపథ్య సంగీతాన్ని ప్రత్యేకించి ప్రస్తావించి తీరాలి. ఇవన్నీ సినిమాలో మంచి జీడిపలుకులు. కానీ, ఓవరాల్ గా వంటకంలోనే తీపి తగ్గింది. కొసమెరుపు: కథ తక్కువ! గాలి ఎక్కువ!! బలాలు: ►రాజేంద్రప్రసాద్ విశ్వరూపం, శ్రీవిష్ణు నటన ►అక్కడక్కడ మెరిసిన డైలాగ్స్, సెంటిమెంట్ ►కీలక సందర్భాల్లో నేపథ్య సంగీతం బలహీనతలు: ∙నిదానంగా సాగే ఫస్టాఫ్ ►కథను పక్కదోవ పట్టించే అనవసరపు ట్రాక్‌లు ►సాగదీసిన గ్రామీణ బ్యాంక్ కామెడీ ►రచయిత అనుకున్నట్టల్లా నడిచే సినిమాటిక్ సంఘటనలు రివ్యూ: రెంటాల జయదేవ -
విలన్ గా నన్ను చూడరేమో!
‘‘ఒకప్పుడు కథల కోసం నేను పరుగులు పెట్టాను. ఇప్పుడు మంచి కథలు నా దగ్గరకు వస్తున్నాయి. నేను విభిన్నమైన సినిమాలను ఎంచుకోవడం వల్ల కాదు.. నేను ఎంచుకున్న కథలను ప్రేక్షకులు ఆదరించడం వల్ల ఈ స్థాయిలో ఉన్నాను’’ అన్నారు శ్రీవిష్ణు. అనీష్ దర్శకత్వంలో శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘గాలి సంపత్’. అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్. కృష్ణ, సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. శ్రీ విష్ణు మాట్లాడుతూ – ‘‘గతంలో వచ్చిన నా సినిమాలు కొన్నింటికి అనిల్ రావిపూడిగారు సపోర్ట్ చేశారు. ఓ సందర్భంలో ‘గాలిసంపత్’ కథ చెప్పారు. కథ నచ్చింది. ఈ కథను ఎస్.కృష్ణ రాశారని, అనీష్ డైరెక్ట్ చేస్తారని చెప్పారు. అలాగే నా తండ్రి పాత్రలో రాజేంద్రప్రసాద్‌గారు ఉంటారని తెలిసింది. సాధారణంగా తండ్రి బాధ్యతగా ఉంటే... కొడుకు జులాయిగా ఉంటాడు. కానీ ఈ సినిమాలో కొడుకు బాధ్యతగా ఉంటే.. తండ్రి జులాయి అన్నమాట. రాజేంద్రప్రసాద్ గారితో వర్క్ చేయడం ఫుల్ హ్యాపీ. నెగటివ్ పాత్రల గురించిన ఆలోచన ఉంది. కానీ విలన్ గా నన్ను చూడరేమోనని అనుకుంటున్నాను’’ అన్నారు. -
సాయిపల్లవితో ఓ సినిమా చేద్దామనుకున్నాను.. కానీ!
‘‘దర్శకుడిగా చేస్తున్నప్పుడు హ్యాపీగా ఉన్నాను. ‘గాలి సంపత్’ చిత్రానికి సమర్పకుడిగా బాధ్యతలు తీసుకున్నాక నిర్మాతల కష్టాలు తెలిశాయి. ఈ సినిమాకి సాహు, హరీష్ వెన్నెముకలా నిలిచారు. తక్కువ బడ్జెట్లోనే పూర్తి చేశాం. నిర్మాతలు సేఫ్’’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. ఎస్. కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణ చేసిన అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘నా ఫ్రెండ్ ఎస్. కృష్ణ నా సినిమాలకు రైటర్‌గా చేశాడు. నిర్మాతగా లాంచ్ అవ్వాలని తనే ‘గాలి సంపత్’ కథ రాసుకున్నాడు. టైటిల్ వినగానే గాలికి తిరిగే వ్యక్తి కథేమో అనుకున్నాను. కానీ నోట్లో నుంచి మాట రాకుండా కేవలం గాలి మాత్రమే వచ్చేలా గాలి సంపత్ క్యారెక్టర్ ఉంటుందనగానే ఆసక్తిగా అనిపించింది. మాటలు రాని వ్యక్తి గోతిలో పడ్డాక ఎలా పైకి వస్తాడన్న కాన్సెప్ట్ నన్ను ఎగ్జయిట్ చేయడంతో ఈ టీమ్‌తో కలిశాను. తండ్రి రాజేంద్రప్రసాద్ వల్ల ఇబ్బందులు పడే కొడుకు పాత్రలో శ్రీవిష్ణు బాగా నటించాడు. ఈ సినిమాలో వర్షం కూడా ఓ విలన్ లా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు కూడా ‘గాలి సంపత్’ చూసి థ్రిల్ అవుతారు. నేను స్టార్ట్ అయ్యిందే చిన్న సినిమాల నుంచి కాబట్టి కథ బాగుంటే అలాంటి చిత్రాలను ప్రోత్సహిస్తా. సమయం వచ్చినప్పుడు నేను కూడా చిన్న చిత్రాలు చేస్తా. ‘ఎఫ్3’ షూటింగ్ 22 డేస్ చేశాం. సాహూతో త్వరలో ఓ సినిమా చేస్తా. హీరో రామ్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. బాలకృష్ణతో సినిమా ఇంకా ఖరారు కాలేదు. మహేశ్‌బాబుతో మరో సినిమా గురించి చర్చలు జరుగుతు న్నాయి. సాయిపల్లవితో ఓ లేడీ ఓరియంటెడ్ స్పోర్ట్స్ ఫిల్మ్ చేద్దామనుకున్నాను కానీ కుదర్లేదు. నా సినిమాలను బాలీవుడ్లో రీమేక్ చేయాలనుకుంటే ‘పటాస్’ను హృతిక్ రోషన్ తో చేయాలని ఉంది’’ అన్నారు. చదవండి: ఏం సక్కగున్నావ్రో.. అందరి కళ్లు బన్నీ పైనే! ఆమె పేరు వింటే శత్రువులకి దడ ఖరీదైన బంగ్లా కొనుగోలు చేసిన టాలీవుడ్ టాప్ డైరెక్టర్! -
‘గాలి సంపత్’ ప్రీ రిలీజ్ వేడుక
-
ఆయనకి జాతీయ అవార్డు రావాలి
‘‘మా స్రవంతి మూవీస్ బ్యానర్ స్టార్ట్ అయిందే రాజేంద్రప్రసాద్‌గారి ‘లేడీస్ టైలర్’ సినిమాతో. ఆయన పేరు ముందు ఏ బిరుదు పెట్టినా అది చిన్నదే అవుతుంది. ‘గాలి సంపత్’ సినిమాతో ఆయనకు జాతీయ అవార్డు రావాలి.. వస్తుందనుకుంటున్నా’’ అని హీరో రామ్ అన్నారు. శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గాలి సంపత్’. అనీష్ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి సమర్పణలో ఎస్.కృష్ణ, హరీశ్ పెద్ది, సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో రామ్ మాట్లాడుతూ–‘‘గాలి సంపత్’ ట్రైలర్ చూశాక రాజ్‌కుమార్ హిరాణీ చిత్రంలా అనిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కమర్షియల్ డైరెక్టర్ అనిల్’’ అన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘జీవితంలో నన్ను నటుడిగా నిలబెట్టిన మొదటి సినిమా ‘లేడీస్ టైలర్’ స్రవంతి మూవీస్‌దే.. ఆ సినిమా లేకుంటే ఇవాళ నేను ఇక్కడ లేను. ‘గాలి సంపత్’ నా జీవితంలో ఒక ఆణిముత్యం’’ అన్నారు. ‘‘ఈ సినిమా కథ ఆసక్తిగా అనిపించింది’’ అన్నారు నిర్మాత ‘దిల్’ రాజు. ‘‘తండ్రీ కొడుకుల మధ్య సాగే ఫన్ అండ్ ఎమోషన్ జర్నీ ‘గాలి సంపత్’’ అన్నారు అనీష్. ‘‘మా ‘గాలి సంపత్’ చూస్తున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు’’ అన్నారు నిర్మాతల్లో ఒకరైన రామ్. ‘‘హీరో రామ్‌గారితో పాటు సాహు, హరీష్గార్లతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నేనెప్పుడూ నా క్యారెక్టర్ చూసి సినిమాలు చేయను.. కథ చూసి చేస్తా’’ అన్నారు శ్రీవిష్ణు. ఈ కార్యక్రమంలో లవ్లీ సింగ్, కెమెరామెన్ సాయి శ్రీరామ్, సంగీత దర్శకుడు అచ్చురాజమణి, దర్శకులు గోపీచంద్ మలినేని, బీవీఎస్ రవి, శివ నిర్వాణ పాల్గొన్నారు. -
గాలి సంపత్ ట్రైలర్: నవ్విస్తూనే ఏడిపించిన నట కిరీటి
ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లేతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న చిత్రం ‘గాలి సంపత్’. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ టైటిల్ రోల్లో, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది, ఎస్. క్రిష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్‌తో ఈ సినిమాపై ఆసక్తిని పెంచిన చిత్ర యూనిట్ తాజాగా.. మూవి ట్రైలర్‌ని విడుదల చేసింది. దర్శక ధీరుడు రాజమౌళి విడుదల చేసిన ఈ ట్రైలర్ ఆద్యంతం ఎమోషన్‌తో పాటు కామెడీని కూడా పంచడం విశేషం. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు చాలా ఓపికగా ఆ తప్పులను కరెక్ట్ చేస్తారు. అదేంటో కాస్త మీసాలు వచ్చేసరికి పెద్దోళ్ళు ఏమి చేసినా ఊరికే చిరాకులొచ్చేస్తాయి.. కోపాలు వచ్చేస్తాయి.. నేను కూడా మా నాన్నని కాస్త ఓపికగా ప్రేమగా అడగాల్సింది’ అంటూ శ్రీ విష్ణు చెప్పే డైలాగ్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. మాటలు రాని రాజేంద్ర ప్రసాద్‌కు హీరో కావాలని ఉంటుంది. కానీ ఆయన నిర్ణయం కొడుకు (శ్రీ విష్ణు)కు నచ్చదు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వివాదం జరిగినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ప్రతి అమ్మాయికీ డబ్బున్నోడే కావాలి.. లేకపోతే ఫారినోడు కావాలి.. డబ్బున్నోడు ఏం ఇస్తాడండీ? డబ్బే ఇస్తాడు. టైమ్ ఎక్కడి నుంచి ఇస్తాడు' అంటూ హీరోయిన్‌తో హీరో చెప్పే డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తానికి 'గాలి సంపత్' సినిమాలో కామెడీతోపాటు తండ్రికొడుకుల ఎమోషన్ని కూడా చూపించబోతున్నారని ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. చదవండి : ‘పుష్ప’ అప్డేట్.. లీక్ చేసిన జానీ మాస్టర్ ఎన్టీఆర్ ధరించిన మాస్క్ ధరెంతో తెలుసా?