Gabbar singh -2
-
స్క్రిప్టులో తలమునకలుగా... గబ్బర్‌సింగ్-2
కొన్ని సినిమాలు కథాచర్చల సమయం నుంచే వార్తల్లో నిలుస్తాయి. కానీ, షూటింగ్‌కు వెళ్ళకుండా స్క్రిప్టు రూపకల్పన దశలోనే నెలలకొద్దీ ఒక సినిమా వార్తల్లో ఉండడం, దాని కోసం అభిమానులు ఆసక్తిగా చర్చించుకోవడం అరుదైన విషయమే. పవన్ కల్యాణ్ సూపర్‌హిట్ ‘గబ్బర్‌సింగ్’కు కొనసాగింపు ‘గబ్బర్‌సింగ్ 2’కు ఇటీవల ఆ ఘనత దక్కింది. రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్ళకుండానే ఇప్పటికి చాలారోజులుగా వార్తల్లో నిలిచిన ఈ సినిమా గురించి రోజుకో వార్త హల్చల్ చేస్తూ వస్తోంది. పవన్ కల్యాణ్ మిత్రుడైన శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఒకరిద్దరి తరువాత ఇప్పుడు ‘బలుపు’ ఫేమ్ బాబీ (కె.ఎస్. రవీంద్ర) సారథ్యంలో సాగుతోంది. అయితే, ఈ సినిమా ప్రతిపాదన దాదాపు ఆగిపోయినట్లేనంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివరాల కోసం ప్రయత్నించినప్పుడు ఆసక్తికరమైన సంగతులు తెలిశాయి. ఈ ‘గబ్బర్‌సింగ్ 2’ స్క్రిప్టు విషయంలో పవన్ కల్యాణ్ పూర్తిగా లీనమైపోయారట. దర్శకుడికి సలహాలు, సూచనలిస్తూ స్క్రిప్టు పకడ్బందీగా రావడానికి సాయపడుతున్నారట. ‘‘స్క్రిప్టు పని జరుగుతోంది. భారీ సినిమా కాబట్టి, కావలసిన అంశాలను పక్కాగా ఖరారు చేసుకుంటున్నాం. దర్శకుడు బాబీ స్క్రిప్టుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. అంతా సిద్ధం కాగానే షూటింగ్ ప్రారంభ తేదీ అధికారికంగా ప్రకటిస్తాం’’ అని శరత్‌మరార్ వివరించారు. నిజానికి, మీడియాలోని వార్తల నేపథ్యంలో ముందుగా షూటింగ్ మొదలుపెట్టి, కొద్ది రోజులు జరిపి, ఊహాగానాలకు తెర దించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ, పవన్ మాత్రం అలా వద్దనీ, పూర్తి స్క్రిప్టుతో, లొకేషన్లను కూడా పక్కాగా నిర్ణయించుకొని ఏకధాటిగా షూటింగ్ జరుపుదామనీ దర్శక, నిర్మాతలకు నచ్చజెప్పినట్లు అభిజ్ఞవర్గాల కథనం. కాగా, డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తానంటూ పవన్ చెప్పిన మాట నిజమే కానీ, దానికీ ఈ ‘గబ్బర్ సింగ్2’కూ సంబంధం లేదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మొత్తానికి, ‘గబ్బర్ సింగ్2’ అటకెక్కినట్లేననీ, ‘గోపాల గోపాల...’ దర్శకుడు డాలీని స్క్రిప్టుతో రమ్మనమని కోరింది ఈ సినిమాకేననీ వస్తున్న వార్తలు తప్పని తేలింది. అంటే... ‘గబ్బర్ సింగ్2’ బాబీతో ఉన్నట్లే! కానీ, చిత్ర ప్రారంభం కోసం మాత్రం మరికొద్ది కాలం వేచి చూడక తప్పదు. -
మెగా బ్రదర్స్ మెగాఫోన్ పడుతున్నారా?
ఒకేసారి రెండు ఆసక్తికరమైన వార్తలు.చిరంజీవి తన 150వ సినిమా కోసం మెగాఫోన్ పట్టనున్నారట. అలాగే ఎన్నాళ్లనుంచో ఊరిస్తూ వస్తున్న ‘గబ్బర్ సింగ్-2’ను పవన్ కల్యాణ్ తనే సొంతంగా డెరైక్ట్ చేసుకోబోతున్నారట. ఈ రెండు వార్తలూ ప్రస్తుతం ఫిలిమ్నగర్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ఇంతకూ ఈ వార్తలు నిజమేనా? మొదట చిరంజీవి సినిమా విషయానికొద్దాం. ‘శంకర్‌దాదా జిందాబాద్’ తర్వాత చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేయడం, దాంతో సినిమాలకు ఏడేళ్లు ఆయన దూరం కావడం, మళ్లీ ఇటీవలే ఆయన తన 150వ సినిమాకు సంబంధించి ప్రయత్నాలు మొదలుపెట్టడం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి దృష్టి అంతా ఈ 150వ సినిమా మీదే. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. మునుపటి స్థాయిలో తన శరీరాన్ని తీర్చిదిద్దుకుని సన్నబడ్డారు కూడా. మరో పక్క కథల వేటలో నిమగ్నమయ్యారు. అయితే ఇంతవరకూ ఏదీ ఓకే కాలేదట. చారిత్రక నేపథ్యం ఉన్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చేస్తారని ప్రచారం జరిగినా, చిరంజీవి మనసులో మాత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ చేయాలనే ఉంది. ఆ మధ్య బర్త్‌డే స్పెషల్ ఇంటర్వ్యూల్లో కూడా ఈ విషయాన్ని చిరంజీవి స్పష్టం చేశారు. 2015లో తాను మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోవడం ఖాయమని చెప్పారు. ఈ 150వ సినిమాను వీవీ వినాయక్ డెరైక్ట్ చేస్తారని చాలా కాలంగా వార్త వినిపిస్తోంది. మధ్య మధ్యలో కృష్ణవంశీ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజాగా వినవచ్చిన వార్త ఏమిటంటే - చిరంజీవి తానే సొంతంగా ఈ సినిమా డెరైక్ట్ చేయనున్నారట. అయితే ఇది ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తే తప్ప, ఇంతవరకూ అధికారిక సమాచారం లేదు. తీయబోయే సినిమాకు ఇప్పటికీ కథ ఓకే కాలేదు... కథ నిర్ణయం కాకుండా చిరంజీవి డెరైక్షన్ చేస్తారని చెప్పడం తొందరపాటే అవుతుందని కొంతమంది సినీ పెద్దలు చెబుతున్నారు. అయితే డిసెంబరు నాటికి ఈ సినిమా ప్రాజెక్ట్ విషయంలో ఓ స్పష్టత వస్తుందంటున్నారు. ఇక పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్-2’ విషయానికొస్తే - ‘రచ్చ’ ఫేమ్ సంపత్ నంది దర్శకత్వంలో ఈ చిత్రం చాలా నెలల క్రితమే ప్రారంభోత్సవం జరుపుకుంది. అయితే పవన్‌కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడం, ఈలోగా హిందీ ‘ఓ మై గాడ్’ రీమేక్‌గా రూపొందుతోన్న ‘గోపాల... గోపాల’కు పవన్ కమిట్ కావడంతో ‘గబ్బర్‌సింగ్-2’ వెనక్కు వెళ్లిపోయింది. త్వరలోనే ప్రారంభం అని ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నాయి కానీ, ఇంతవరకూ షూటింగ్ మొదలు కానే కాలేదు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌ని తానే డెరైక్ట్ చేయాలని పవన్‌కల్యాణ్ నిశ్చయించుకున్నట్టు ఫిలిమ్‌నగర్ సమాచారం. పవన్ ఇంతకుముందు ‘జానీ’ సినిమా డెరైక్ట్ చేశారు. ఆ సినిమా వాణిజ్యపరంగా విఫలమైనా, పవన్‌లో మంచి దర్శకుడు ఉన్నాడని నిరూపించింది. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ మెగా ఫోన్ పట్టనున్నారన్న వార్త తెలుగు చిత్రపరిశ్రమలో హల్చల్ చేస్తోంది. అయితే ఇందులో నిజానిజాల గురించి తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే. అప్పటి వరకూ ఈ సస్పెన్స్ తప్పదు! -
అక్టోబర్‌లో గుర్రం ఎక్కుతాడు
పవన్‌కల్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీ. తన కెరీర్లో ఇప్పటివరకూ పోషించనటువంటి ఓ కొత్త డైమన్షన్ ఉన్న పాత్రను ఆయన ‘గోపాల గోపాల’ చిత్రంలో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆ పాత్రపైనే ప్రస్తుతం పవర్‌స్టార్ దృష్టి అంతా. ఆహార్యం, వాచకం, హావభావాలు... ఇలా అన్నీ కృష్ణునికి తగ్గట్టు పెక్యులర్‌గా ఉండేలా చూసుకుంటున్నారాయన. అందుకే... ఓ రెండు నెలల పాటు మరో సినిమా గురించి ఆలోచించే పరిస్థితిలో పవన్‌కల్యాణ్ లేరు. అయితే... మరి ‘గబ్బర్‌సింగ్-2’ పరిస్థితేంటి? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ సినిమా అటకెక్కినట్టే అని కొన్ని రూమర్లు కూడా వెబ్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే... వాటన్నింటినీ చెక్ పెడుతూ... అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్-2’ను సెట్స్‌కి తీసుకురానున్నారు పవన్‌కల్యాణ్. ‘గోపాల గోపాల’ చిత్రానికి సంబంధించిన తన వర్క్ త్వరితగతిన పూర్తి చేసి, అక్టోబర్‌లో ‘గబ్బర్‌సింగ్’ అవతారం ఎత్తనున్నారాయన. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పవన్‌కల్యాణే పర్యవేక్షిస్తున్నట్టు సమాచారమ్. అంటే... రానున్న రోజుల్లో పవర్‌స్టార్‌ని రెండు భిన్నమైన కోణాల్లో అభిమానులు చూడబోతున్నారన్నమాట. -
‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్ కాదు!
‘అత్తారింటికి దారేది’ విడుదలై దాదాపు ఐదు నెలలవుతోంది.. ఇంకా పవన్‌కల్యాణ్ కొత్త సినిమా ప్రారంభం కాలేదని, ‘గబ్బర్‌సింగ్ 2’కి ఎప్పుడు ముహూర్తం పెట్టుకున్నారో తెలియడంలేదని ఈ మధ్యకాలంలో ఫిల్మ్‌నగర్‌లో జోరుగానే చర్చించుకున్నారు. ఇక, ఆ చర్చకు ఫుల్స్టాప్ పెట్టేయొచ్చు. శుక్రవారం ఫిల్మ్‌నగర్ దేవాలయంలో ‘గబ్బర్‌సింగ్ 2’ పూజా కార్యక్రమాలు జరిగాయి. వెంకటేశ్వర స్వామిపై చిత్రీకరించిన తొలి దృశ్యానికి సీనియర్ ప్రొడక్షన్ చీఫ్ ప్రకాశ్ కెమెరా స్విచాన్గా చేయగా, చిత్రనిర్మాత శరత్ మరార్ తండ్రి జీకే మరార్ క్లాప్ ఇచ్చారు. న్యాయవాది ప్రమోద్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సంపత్ నంది దర్శకత్వంలో నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. చిత్రం విశేషాలను శరత్ మరార్ చెబుతూ -‘‘ఇది ‘గబ్బర్‌సింగ్’కి సీక్వెల్ కాదు. ఓ కొత్త కథాంశంతో రూపొందిస్తున్నాం. కథ, రచన పవన్‌కల్యాణ్ పర్యవేక్షణలో జరుగుతోంది. మేలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, దసరాకి సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చెప్పారు. డి. సురేష్‌బాబు, కేఎల్ఎన్ రాజు, పి. కిరణ్ తదితరులు పాల్గొని, యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ చిత్రానికి రచనా పర్యవేక్షణ: సత్యానంద్, క్రియేటివ్ హెడ్: హరీష్ పాయ్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, కిశోర్ గోపు, కెమెరా: జయనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: ఆనంద్‌సాయి. -
76 సినిమాల్లో నటించా
భీమవరం : తాను ఇప్పటివరకు 76 సినిమాల్లో నటించానని నటుడు పృధ్వీరాజ్ అన్నారు. భీమవరంలో ప్రభు డాన్స్ స్కూల్‌ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం గబ్బర్‌సింగ్-2, ఆగడు, రభస చిత్రాల్లో నటిస్తున్నా. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో అందరికీ మంచి అవకాశాలు వస్తున్నాయి. కొత్త దర్శకులు బాగానే వస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా నాకు మంచి పేరు వచ్చింది. కళాకారులకు నిరాశ ఉండదు.. ఎంత కష్టపడితే అంత గుర్తించి వస్తుంది. భీమవరం బుల్లోడు సినిమాలో నా క్యారెక్టర్ హీరో సునీల్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆప్తులు శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపును కోల్పోవడం బాధగా ఉంది. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయకేతనం ఎగురవేయడం ఖాయం. మహానేత వైఎస్‌పై అభిమానంతో వైసీపీలో చేరా. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లా ల్లో పార్టీ ప్రచార బాధ్యతలు తీసుకున్నా. నాకెలాంటి పదవులు వద్దు. పార్టీ విజయానికి శాయశక్తులా కృషిచేస్తా.’ అన్నారు. వైసీపీ నాయకులు రేవూరి గోగురాజు, పేరిచర్ల సత్యనారాయణరాజు, గుంటి ప్రభు ఆయన వెంట ఉన్నారు.