జనంనెత్తిన కుచ్చుటోపీ
గజ్వేల్,
గజ్వేల్ కేంద్రంగా అక్రమ ‘దందా’కు తెరలేచింది. ‘వాయిదాల పద్ధ తి’ స్కీమ్‌ల పేరుతో దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. ఎలాంటి అనుమతులు లేకున్నా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
నా ణ్యత లేని పరికరాలను జనాలకు అంటగడుతూ చేతులు దులుపుకుంటున్నారు. కోట్లల్లో ఈ వ్యాపారం సాగుతుందంటే అతిశయోక్తి కాదు. వివరాలు ఇలా ఉన్నాయి. బంగారం, వెండి, బైక్, ల్యాప్‌టాప్, ఫ్రిజ్ తదితర వస్తువులు కలగా మారిన సామాన్యులు మా స్కీమ్‌లో చేరి మీ కలలను నిజం చేసుకోండంటూ.. కొందరు అక్రమార్కులు జనానికి కుచ్చుటోపీ పెడుతున్నారు.
గజ్వేల్ కేంద్రంగా వారం ‘వాయిదా పద్ధతి’ స్కీమ్‌లను నడుపుతూ సామాన్యుల అమాయకత్వమే పెట్టుబడిగా అందిన కాడికి దండుకుంటున్నారు. కొన్ని నెలలుగా ఈ దందా జోరుగా సాగుతోంది. సుమారు 25కుపైగా ఇలాంటి సంస్థలు ఇక్కడ నడుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా ఒక్కో స్కీమ్‌లో 1,500 నుంచి 2,000 మందిని చేర్చుకుంటున్నారు. సభ్యుల వద్ద ముందస్తుగా పేరు నమోదు చేసుకోవడానికి రూ.100 వసూలు చేస్తున్నారు. ఆ తర్వాత వారానికి రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు.
ఈ లెక్కన ఒక్కో స్కీమ్ నిర్వాహకులు వారానికి రూ.3 లక్షల నుంచి 4 లక్షల వసూళ్లకు పాల్పడుతున్నారు. పది వారాలపాటు కొనసాగే ఈ స్కీమ్ పేరిట రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు జమ చేసుకుంటున్నారు. ప్రతి వారం 5 నుంచి 8 బహుమతులను డ్రాలో ప్రకటిస్తారు. తొమ్మిది వారాల్లో మొత్తం మీద 45 నుంచి 72 మందికి మాత్రమే బహుమతులు వస్తాయి. మిగిలిన వేలాదిమంది పదో వారంలో... వారు చెల్లించే డబ్బులకు సగం కూడా ఖరీదు చేయని నాణ్యతలేని పరికరాలను అంటగడుతున్నారు.
పది వారాలపాటుకొనసాగే ఈ స్కీమ్‌లో ఏదైనా కారణంచేత రెండు వారాలకు మించి డబ్బులు చెల్లించకపోతే ఎలాంటి సమాచారం లేకుండానే సదరు సభ్యుడి పేరు తొలగిస్తారు. పైగా డబ్బులు సైతం చె ల్లించరు. ఈ విధంగా ప్రస్తుతం గజ్వేల్‌లో 25 సంస్థల వరకు జనానికి కుచ్చుటోపీ పెడుతున్నాయి. ఏడేళ్ల క్రితం ఇక్కడ ఇలాంటిదే ఓ సంస్థ ఘనకార్యం వివాదాస్పదం కాగా చాలాకాలం వరకు ఈ స్కీమ్‌లు నడవలేదు. తాజాగా మళ్లీ పుట్టుకురావడం వెనుక అధికారుల అండదండలున్నాయనే ఆరోపణలు వినవస్తున్నాయి.