'కరెన్సీ నోట్లపై ఇక గాంధీ ఉండకపోవచ్చు'
కరెన్సీ నోట్ల మీద ఉండే గాంధీ బొమ్మ క్రమంగా పోతుందని హరియాణాకు చెందిన బీజేపీ మంత్రి అనిల్ విజ్ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై తీవ్ర దుమారం రేగడం, సొంత పార్టీ నుంచి కూడా చీవాట్లు రావడంతో ఆ తర్వాత ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. గాంధీ కంటే మోదీ పెద్ద బ్రాండ్ నేమ్ అని.. అందువల్ల గాంధీ బొమ్మ ఇక నోట్లపై ఎన్నాళ్లో ఉండకపోవచ్చని విజ్ తెలిపారు. రూపాయి మీద గాంధీ బొమ్మ వచ్చినప్పటి నుంచి దాని విలువ తగ్గిపోవడం మొదలైందని, క్రమంగా నోట్ల మీద కూడా ఆ బొమ్మ తీసేస్తారని వ్యాఖ్యానించారు.
ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ కేలండర్, డైరీల మీద చరఖాతో నూలు వడుకుతున్న గాంధీ బొమ్మకు బదులు అలా నూలు వడుకుతున్న మోదీ ఫొటో రావడంతో అసలు వివాదం మొదలైంది. అంబాలాలో జరిగిన ఓ బహిరంగ సభలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే అనిల్ విజ్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఖాదీ దుస్తులకు మోదీ బ్రాండింగ్ ఇచ్చిన తర్వాత వాటి అమ్మకాల్లో 14 శాతం పెరుగుదల కనిపించిందని.. అందువల్ల ఖాదీకి మహాత్మాగాంధీ కంటే మోదీయే పెద్ద బ్రాండ్ అని ఆయన అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలతో పాటు బీజేపీ కూడా మండిపడింది. అవి ఆయన సొంత అభిప్రాయాలే తప్ప పార్టీకి ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది. స్వయంగా హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కూడా విజ్ వ్యాఖ్యలను ఖండించారు. దాంతో తాను చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసిన తర్వాత ఆయన నాలుక కరుచుకుని, తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.