దుండిగల్‌లో రూ.50వేలు చోరీ!
దుండిగల్: రైలు టికెట్లు ఆన్లైన్లో బుక్ చేయాలంటూ హడావుడి చేసి రూ. 50వేలు ఎత్తుకెళ్లిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. గండిమైసమ్మ చౌరస్తాలో పుష్ఫక్ కమ్యూనికేషన్స్ పేరుతో ఆన్లైన్ సర్వీస్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో ఆన్లైన్ సర్వీసులతో పాటు రైలు, బస్ టిక్కెట్లను బుక్ చేస్తారు. సూరారం కాలనీ రాజీవ్‌గహకల్పకు చెందిన గొల్లమండల విజయలక్ష్మి అనే యువతి కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తోంది. అయితే శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు కార్యాలయంలో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఆన్లైన్ లో రైలు టికెట్లు బుక్ చేయాలని చెప్పారు. అనంతరం తమ వద్ద వంద నోట్లు ఉన్నాయని, వాటికి బదులు 500 నోట్లు కావాలని చెప్పి 10 వంద నోట్లు ఇచ్చారు. వాటిని తీసుకున్న విజయలక్ష్మి వారికి రెండు 500 నోట్లు ఇచ్చింది.
అయితే ఆ రెండు నోట్లు బాగాలేవని వేరేవి ఇవ్వాలని చెప్పగా క్యాష్ పెట్టెలో ఉన్న నోట్లను చూపించిన విజయలక్ష్మి అన్నీ అదే విధంగా ఉన్నాయని వారితో చెప్పింది. అదే సమయంలో అందులోనే ఉన్న మరో వ్యక్తి విజిటింగ్ కార్డులు చూపిస్తు త్వరగా బుక్ చేయాలని హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో రైలు టికెట్లు బుక్ చేయకుండా వెళ్లిపోయారు. అనుమానం వచ్చిన విజయలక్ష్మి క్యాష్‌బాక్స్ చూడగా అందులో ఉంచిన రూ.50వేల బండిల్ కనిపించలేదు. వెంటనే ఆమె దుండిగల్ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై రమేష్ కార్యాలయంలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించారు. విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.