అనుమతి తప్పనిసరి
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో ఇకమీదట బోరు బావులను తవ్వాలంటే విధిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్ తెలిపారు. నగరంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15లోగా రాష్ట్ర వ్యాప్తంగా విఫలమైన బోర్లను పూడ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ నెలాఖరులోగా పూడ్చి వేయాలని గడువు విధించామని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఈ బోర్లను మూసి వేసే పనులు సాగుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 13,509 నిరుపయోగ బోరు బావులుండగా, ఇప్పటికే 12,385 బావులను పూడ్చి వేశారని వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కడైనా విఫలమైన బోర్లను అలాగే వదిలేసి ఉంటే టోల్‌ఫ్రీ నంబరు 18004258666కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. సమాచారం అందినవెంటనే స్థానిక అధికారులు అలాంటి బోర్లను మూసి వేయిస్తారని తెలిపారు. ఇకమీదట బోర్లు విఫలమైతే, అప్పటికప్పుడు బోరు బండ్ల యజమానులే వాటిని పూడ్చి వేయాల్సి ఉంటుందని చెప్పారు. కాగా కేపీఎస్సీ-11 ఎంపిక జాబితాను తిరస్కరించాలని మంత్రి వర్గం ఏకగ్రీవంగా తీర్మానించిందని తెలిపారు. దీనిపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ రాజకీయాలకు పాల్పడకూడదని ఆయన హితవు పలికారు. మూడు స్థానాలకు జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఎన్నికల పరిశీలకుడుగా వ్యవహరిస్తున్న బెల్గాం జిల్లా చిక్కోడిలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్ హుక్కేరి 70 వేల ఓట్ల తేడాతో విజయం సాధిస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు.