ganjam
-
దేశాభివృద్ధిలో మహిళల శకం: ముర్ము
బెర్హంపూర్: దేశాభివృద్ధిలో మహిళల శకం మొదలైందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. జాతి నిర్మాణంలో నేడు బాలికలు అన్ని రంగాల్లో కీలకంగా మారారని, ఈ పరిణామం ఎంతో ప్రోత్సాహకరమైందని పేర్కొన్నారు. గంజాం జిల్లాలోని బెర్హంపూర్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. సాహిత్యం, సంస్కృతి, సంగీతం వంటి రంగాల్లో మహిళ భాగస్వామ్యం ప్రశంసనీయమని తెలిపారు. ‘సైన్స్, టెక్నాలజీ మొదలుకొని పోలీసు, ఆర్మీ వరకు ప్రతి రంగంలోనూ మన కుమార్తెల సామర్థ్యం కనిపిస్తోంది. ఇప్పుడు మనం మహిళాభివృద్ధి దశ నుంచి మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు పయనిస్తున్నాం’అని రాష్ట్రపతి తెలిపారు. -
వినోదం..యాక్షన్
త్రిగుణ్ హీరోగా సురేష్ కుమార్ ఆకిరి దర్శకత్వం వహించిన చిత్రం ‘గంజామ్’. ప్రణమ్ దేవరాజ్, హ్రితికా శ్రీనివాస్, విస్మయ, దేవరాజ్, రఘు కుంచె, అనితా చౌదరి ముఖ్య పాత్రలు పోషించారు. ఏవీఆర్ ఆర్ట్స్, ఏయు–ఐ బ్యానర్స్‌పై రత్నాజీ నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా త్రిగుణ్ మాట్లాడుతూ– ‘‘నేను చేసున్న 23వ సినిమా ‘గంజామ్’. ఎప్పుడూ నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తున్న తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. మా సినిమాకు మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు. ‘‘వినోదం, యాక్షన్‌తో పాటు సామాజిక స్పృహ కలిగిన సినిమా ‘గంజామ్’. నాకు అవకాశం ఇచ్చిన రత్నాజీగారికి ధన్యవాదాలు. త్రిగుణ్‌కి ఈ సినిమా మరో మంచి హిట్‌గా నిలుస్తుంది’’ అన్నారు సురేష్ కుమార్ ఆకిరి. ‘‘ఒక మంచి ప్రయత్నం మా ‘గంజామ్’. ఈ సినిమా అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటుంది’’ అన్నారు రత్నాజీ. ‘‘కథా బలం ఉన్న ‘గంజామ్’ విజయం సాధిస్తుంది’’ అన్నారు చిత్ర సంగీతదర్శకుడు, నటుడు రఘు కుంచె. ఈ చిత్రానికి కెమెరా: ‘గరుడవేగ’ అంజి. -
అడవి పంపిన బిడ్డ
తప్పిపోయిన కొడుకు తిరిగొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కుంతల కుమారికి ఇప్పుడు అంతకు మించిన సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం అరణ్యంలో కనిపించిన అడవి పంది కూనను ఇంటికి తెచ్చి పెంచుకుందామె. వారం క్రితం అటవీ అధికారులు వచ్చి ఆ పందిని అలా పెంచుకోకూడదని అడవిలో వదిలి వచ్చారు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఏడ్చింది. ఆ బిడ్డ ఆ తల్లిని వెతుక్కుంటూ బయలుదేరింది. రోమాంచితమైన ఈ అనురాగబంధపు కథ ఒడిసాలో జరిగి ప్రచారంలో ఉంది. మీడియాకు భావోద్వేగాలు ఉండవు అని అంటారుగాని కుంతల కుమారి కోసం మీడియా కూడా కన్నీరు పెట్టినంత పని చేసింది. వారం క్రితం ఒడిసాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్ అనే చిన్న పల్లెలో నివసించే కుంతల కుమారి ఆక్రందనలు విని మీడియా కూడా అక్కడకు చేరుకుంది. ‘నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నాకు న్యాయం చేయండి’ అని వారి ముందు ఏడ్చింది కుంతల కుమారి. ఆ బిడ్డ పేరు ‘ధుడ’ (పాలు). అది ఒక అడవి పంది. ‘నా సొంతబిడ్డ కంటే దానిని ఎక్కువ సాక్కున్నాను’ అని చెప్పింది కుంతల కుమారి. దేవుడు పంపిన కొడుకు రెండేళ్ల క్రితం కుంతల కుమారి కూతురు జబ్బు చేసి చనిపోయింది. అడవిలో ఆ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేసి విషాదంతో తిరిగి వస్తున్న కుంతల కుమారికి తల్లి నుంచి తప్పిపోయి భీతిల్లి తిరుగుతున్న రోజుల వయసున్న అడవి పంది పిల్ల కనిపించింది. ‘అది నన్ను చూడగానే నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. దానిని చూసి నేను నా కూతురు చనిపోయిందని బాధ పడాలా... ఈ పంది పిల్ల నా దగ్గరకు వచ్చిందని ఆనంద పడాలా తెలియలేదు. మొత్తం మీద ఆ కూన నాకు దేవుడు పంపిన కొడుకు అనుకున్నాను’ అంటుంది కుంతల కుమారి. ఆమెకు ఇంకో కూతురు కూడా ఉంది. తల్లీ కూతుళ్లు కలిసి ఆ పంది పిల్లకు ‘ధుడ’ అని పేరు పెట్టి పెంచసాగారు. అప్పటినుంచి ఆ అడవి పంది ఇంటి పందిగా మారిపోయింది. కుంతల కుమారి పిలిస్తే పరిగెత్తుకుని వస్తుంది. ఇంటి ముందే ఉంటుంది. అడవి పందితో ఆడుకుంటున్న కుంతలకుమారి కుమార్తె అటవీ అధికారుల ప్రవేశం అయితే ఒడిసా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందిని పెంచుకోవడం నేరం. అందువల్ల అటవీ అధికారుల ఇన్నాళ్లు ఊరికే ఉండి వారం క్రితం కుంతల కుమారి ఇంటికి వచ్చి ఆమెను హెచ్చరించి ‘ధుడ’ను అడవిలో విడుస్తామని తీసుకెళ్లి విడిచి వచ్చారు. పురుషోత్తం పూర్‌కు దగ్గరలోనే టెల్కొయ్ అభయారణ్యం ఉంది. అధికారులు దానిని తీసుకెళ్లి ఆ అరణ్యంలో విడిచి పెట్టారు. ఇది జరిగిన వెంటనే కుంతల కుమారి లబలబమని నోరుకొట్టుకొని తీవ్రంగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సమాచారం అందుకున్న మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. సోషల్ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘అటవీ అధికారులు చేసింది తప్పు’ అని అందరూ తిట్టిపోశారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడవి లో ధుడా తప్పిపోయింది. దాని ఆహారం ఎలా? ‘ధుడా ఇంటి తిండికి అలవాటు పడింది. అది అడవిలో బతకలేదు’ అని కుంతల కుమారి అంటే ‘అడవి పందులకు తాము అడవిలో ఎలా బతకాలో తెలుసు’ అని అధికారులు అన్నారు. కాని అది నిజం కాదు. అడవిలో పడ్డ ధుడా తిండి లేక నీరసించింది. అడవి కొత్త కావడంతో భీతిల్లిపోయింది. ‘ధుడా’ అని పేరు పిలుస్తూ వెతుక్కుంటూ తిరుగుతున్న కుంతలను చూసి గ్రామస్తులు కూడా ధుడాను వెతికారు. చివరకు అది 25 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెంటనే కుంతల ఆగమేఘాల మీద వెళ్లి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర సేదదీరింది. కుంతల, కుంతల కుమార్తె ధుడాను ఇంటికి తెచ్చుకున్నారు. ‘అది అడవిలో తిండి సంపాదించుకోలేకపోయింది. దాని సంగతి ఆలోచిస్తాం’ అని అటవీ అధికారులు ఇప్పుడు నత్తులు కొడుతున్నారు. వారం రోజుల ఎడబాటు వల్ల భీతిల్లిపోయిన ధుడా, కుంతల ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు. ‘పడుకో నాన్నా.. కళ్లు మూసుకొని పడుకో’ అని కుంతల దాని ముట్టె మీద చేయి వేసి ఊరడిస్తే అది కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోవడం వీడియో లో చూసి ఆశ్చర్యపోయేవారు వారిద్దరికీ అభిమానులుగా మారారు. బహుశా వీళ్లను ఇక మీదట ఎవరూ విడదీయకపోవచ్చు. – సాక్షి ఫ్యామిలీ -
ఈమె పిలిస్తే నెమళ్లు వస్తాయి
ఒరిస్సాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న గంజాం జిల్లాలో ప్రమీలా బిసోయిని ‘దేవ మాత’ అని పిలుస్తారు. దానికి కారణం ఆమెకు మహిమలు ఉండటం కాదు. మహిమల కంటే ఎక్కువ అనదగ్గ పర్యావరణ స్పృహ ఉండటం. 71 ఏళ్ల ప్రమీలా బిసోయి గంజాం జిల్లాలో ‘పాకిడి’ గిరిశ్రేణుల్లోని విస్తారమైన అటవీ సంపదకు చౌకీదారు. గత పద్దెనిమిదేళ్లుగా ఒరిస్సా ప్రభుత్వం అక్కడి స్త్రీల స్వయం సమృద్ధికి మొదలెట్టిన ‘స్త్రీశక్తి’ అనే కార్యక్రమంలో ఉత్సాహంగా దూకిన బిసోయి నెమ్మదిగా ఆ స్త్రీలను తరలిపోయిన అడవిని తిరిగి పిలవడానికి ఉద్యుక్త పరిచింది. ‘నేను ఈ ప్రాంతానికి నవవధువుగా వచ్చినప్పుడు అడవి ఎంతో పచ్చగా ఉండేది. ఝరులు సంవత్సరం మొత్తం పారేవి. పక్షులు కిలకిలలాడేవి. దాదాపు ముప్పై నలభై ఏళ్ల కాలంలో చెట్లు నరికేయడం వల్ల అంతా పోయింది. మళ్లీ ఆ అడవిని చూడాలని నిశ్చయించున్నాను’ అంటుంది ప్రమీలా. మొత్తం 1970 హెక్టార్లలో అటవీ శాఖ ఆధీనంలో ఉన్న ఆ అడవిలో బిసోయి చేసిన మొదటి పని స్త్రీశక్తి పథకంలో ఉన్న స్త్రీలను చాలామందిని అడవిని ఒక కంట కనిపెట్టి ఉండమని చెప్పడం. వీరు ఎప్పుడైతే కాపలాకు నిలిచారో కలప దొంగలు ఆ వైపు చూడటానికి భయపడసాగారు. ఇక ఈ స్త్రీలే రంగంలో దిగి తిరిగి చెట్లు నాటారు. రాళ్లను తవ్వుకొని పోవడంతో ఏర్పడ్డ గుంతలను పూడ్చారు. డొంకల్లో పూడికలు తీశారు. కొద్ది సంవత్సరాల్లోనే అడవి పెరిగింది. అప్పుడు వచ్చిన తొలి అతిథే– నెమలి. అడవి తరగడంతో మాయమైపోయిన నెమలి ఎప్పుడైతే అడవి పెరిగిందో తిరిగి వచ్చింది. ఆడనెమళ్లు సాధారణంగా వెదురుపొదల్లో గుడ్లు పెడతాయి. అందుకని బిసోయి అడవిలో విస్తారంగా వెదురు నాటించింది. ఆ వెదురు ఇంత నుంచి అంత పెరిగింది. ఒక నెమలి రెండు నెమళ్ల నుంచి ఇవాళ పాకిడి అడవిలో రెండు వేల నెమళ్లు తమ తావు ఏర్పరుచుకున్నాయి. భారతదేశంలో ఇంత పెద్ద నెమళ్ల శాంక్చరీ మరొకటి లేదు. ‘నెమళ్ల వల్ల ఒక్కోసారి పంటలు దెబ్బ తింటాయి. అయినా మేము వాటిని ఏమీ అనం. అవి మాలో భాగం అనుకుంటాము’ అంటుంది బిసోయి. బిసోయి చేసిన ఈ కృషి ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు తెలిసింది. ఆయన ఏకంగా ఆమెకు అదే ప్రాంతానికి చెందిన ‘అస్కా’ పార్లమెంట్ సీట్ ఇచ్చారు. ఆమె ఘనవిజయం సాధించి ఎం.పి అయ్యింది. తను ఎలా ఉందో అలాగే ఆ గిరిజన ఆహార్యంలోనే పార్లమెంట్‌కు హాజరయ్యింది. ఒరిస్సా భాషలో అక్కడ మాట్లాడి కరతాళధ్వనులు అందుకుంది. ఇటువంటి స్త్రీలు ఒక వందమంది ఉంటే చాలు ఈ దేశం వనసందోహం తప్పక అయి తీరుతుంది. -
కామెంట్ చేసినందుకు, గుండ్లు గీసి...
బరంపురం: తమ ఊరి యువతులను కామెంట్ చేసిన ఇద్దరు యువకులకు గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అంతే కాకుండా వారిద్దరికీ గుండ్లు కూడా గీయించారు. ఈ సంఘటనతో ఒక్కసారిగా గంజాం జిల్లాలో సంచలనం రేగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఒడిస్సా గంజాం జిల్లాలోని కవిసూర్యనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో హిండల గ్రామానికి శనివారం సాయంత్రం బయట ప్రాంతం నుంచి వచ్చిన ఇద్దరు యువకులు ఆ గ్రామ యువతులను కామెంట్ చేయడంతో గ్రామస్తులు అగ్రహానికి గురయ్యారు. దీంతో గ్రామస్తులు యువకులను వెంబడించి పట్టుకుని అందరూ చూస్తుండగా గుండ్లు గీయించి విద్యుత్ స్తంభానికి కట్టి సుమారు రెండుగంటల పాటు చితగ్గొట్టారు. సమాచారం అందుకున్న కవిసూర్యనగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత యువకులను రక్షిస్తున్న సమయంలో గ్రామస్తులు తిరగబడ్డారు. ఈ నేపథ్యంలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం గొడవ సద్దుమణిగిన తరువాత పోలీసులు ఇద్దరు యువకులను విడిపించి పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. అయితే వచ్చిన ఇద్దరు యువకులు వారి వివరాలను తెలపడం లేదు. జరిగిన సంఘటనపై ఇంతవరకు ఎవరూ ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.