రాబడి చక్రాలపై రయ్ రయ్
ఏపీఎస్ఆర్టీసీకి వరంగా మారిన ఎంట్రీ ట్యాక్స్
30 శాతాన్ని దాటిన ఆక్యుపెన్సీ
ప్రైవేటు బస్సుల జోరుకు కళ్లెం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీ ట్యాక్స్ (ప్రవేశ పన్ను)... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్సార్టీసీ)కి వరంగా మారింది. మూడు రోజులుగా రాబడి పెరిగింది. ఎంట్రీ ట్యాక్సుతో స్టేజి క్యారియర్లుగా తిరుగుతున్న ప్రైవేటు బస్సుల జోరు కూడా తగ్గింది. దీంతో అత్యధికశాతం మంది ప్రయాణికులు ఆర్టీసీని ఆశ్రయిస్తున్నారు. ఈ కారణంగా ఆక్యుపెన్సీ రేటు 30 శాతాన్ని మించుతోంది. ఇదిలాగే కొనసాగితే ఏపీ నుంచి హైదరాబాద్కు ఆర్టీసీ నడిపే సూపర్ డీలక్స్, హైటెక్, ఇంద్ర, గరుడ, గరుడ ప్లస్, వెన్నెల బస్సుల వల్ల ఆర్టీసీ ఆదాయం రూ.కోటి దాటుతుందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అదనపు బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సన్నద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రతిరోజూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఆర్టీసీ... హైదరాబాద్ నగరానికి సుమారు 800 బస్సులను నడుపుతోంది. మరోవైపు అన్ని ప్రాంతాల నుంచి దాదాపు వెయ్యి బస్సులను ప్రైవేటు ఆపరేటర్లు నడుపుతున్నారు. గతంలో ప్రైవేటు బస్సులు పెద్దసంఖ్యలో ప్రమాదాలకు గురైనపుడు...ముఖ్యంగా షిర్టీ సమీపంలో ప్రమాదం జరిగిన సందర్భంలో నిబంధనలకు విరుద్ధంగా స్టేజి క్యారియర్లుగా తిప్పుతున్న ప్రైవేటు బస్సుల్ని రవాణా శాఖ అధికారులు కట్టడి చేశారు. దీంతో అప్పట్లో ఆర్టీసీకి ఆదాయం గణనీయంగా పెరిగింది. మళ్లీ ప్రైవేటు బస్సులపై ఎంట్రీ ట్యాక్స్ ప్రభావం కారణంగా ఆ పరిస్థితి పునరావృతమైంది.
నిబంధనలు గాలికి: ప్రైవేటు ఆపరేటర్లు నిబంధనలను పట్టించుకోవడం లేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిరగాల్సిన ప్రైవేటు బస్సులను ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకుంటూ స్టేజి క్యారియర్లుగా నడుపుతున్నారు. ప్రైవేటు ఆపరేటర్లలో ఎక్కువమంది టీడీపీ నేతలే ఉండడంతో రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ వ్యవహారాన్ని కాగ్ తప్పు పట్టినా ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రైవేటు బస్సుల విషయమై రవాణా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిపైనా ఫిర్యాదులొచ్చిన సంగతి తెలిసిందే. నిబంధనల మేరకు ప్రైవేటు బస్సులను నడుపుకునే అనుమతి ఇవ్వాలని, అప్పుడే ఆర్టీసీకి మనుగడ ఉంటుందని యూనియన్ నేతలు కోరుతున్నారు.