రాజ్యసభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో తొమ్మిది లక్షల 29 వేల ఇళ్ళకు పైప్లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా చేయడానికి ప్రభుత్వంతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) ఒప్పందం కుదుర్చుకున్నట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో వెల్లడించారు.
వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బుధవారం ఈ మేరకు రాతపూర్వకంగా జవాబిచ్చారు. పైపు లైన్ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్ సరఫరా చేసే ఈ ప్రాజెక్ట్ కోసం ఐఓసీఎల్ 211 కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. నిర్దేశించిన ప్రాంతాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్(సీజీడీ)ను అభివృద్ధి చేసే అధికారం పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ అథారిటీ (పీఎన్జీఆర్బీ)కి ఉన్నట్లు ఆయన తెలిపారు. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ హక్కుల కోసం జరిగిన 9వ రౌండ్ వేలంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ను అభివృద్ధి చేసి దానిని ఆపరేట్ చేసే హక్కు ఐఓసీఎల్ దక్కించుకున్నట్లు మంత్రి వివరించారు. అందులో భాగంగానే ఇప్పటికే ఐఓసీఎల్ హుక్-అప్ ఫెసిలిటీస్, సిటీ గ్యాస్ స్టేషన్, పైప్డ్ గ్యాస్ నెట్వర్క్ డిజైన్ పనులను పూర్తి చేసినట్లు ఆయన చెప్పారు.