Gautam Budh Nagar
-
ఈసారి కొడితే హ్యాట్రిక్..!
గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ లోక్‌సభ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌పై బీజేపీ కన్నేసింది. జీబీ నగర్‌లోని నోయిడా, జేవార్, దాద్రీ, బులంద్‌షహర్‌లోని సికింద్రాబాద్, ఖుర్జాలతో కూడిన మొత్తం ఐదు సెగ్మెంట్లలో గౌతమ్ బుద్ధ్ నగర్ నియోజకవర్గంలో 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నకల్లోనూ అవే ఫలితాలను అంచనా వేస్తోంది. ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్పీ, కాంగ్రెస్, ఎస్పీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇవే బీజేపీ బలాలు తమ ప్రభుత్వం చేపట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, దాద్రీ, బోడకిలో రవాణా సౌకర్యాలు, రైలు, మెట్రో విస్తరణ కారిడార్లు, సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక కేంద్రాలతో పాటు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన డాక్టర్ మహేష్ శర్మపై బీజేపీ విశ్వాసంతో ఉంది. గౌతమ్ బుద్ధ నగర్ రాజకీయ చరిత్రలో డాక్టర్ మహేష్ శర్మ విజయ పరంపర దశాబ్దం క్రితమే మొదలైంది. 2014 ఎన్నికలలో డాక్టర్ శర్మ 5,99,702 ఓట్లు, 50 శాతం ఓట్లతో మొదటిసారి విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నరేంద్ర భాటిని 2,80,212 ఓట్ల తేడాతో ఓడించారు. తరువాత, 2019 ఎన్నికలలో 8,30,812 ఓట్లు, 59.64 శాతం ఓట్లతో మరోసారి గెలుపొందారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నోయిడా పేరుతో ప్రసిద్ధి చెందిన గౌతమ్ బుద్ధ్ నగర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో ఉత్తరప్రదేశ్‌లోని ఇతర నియోజకవర్గాలతో పాటు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్లో 2,302,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,268,324 మంది పురుషులు, 1,034,503 మంది మహిళలు కాగా 133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు. ఇక నియోజకవర్గంలో 3,297 పోస్టల్ ఓట్లు, 5,482 సర్వీస్ ఓటర్లు ఉన్నారు. -
సోదరులు ఫుల్లుగా తాగి.. పట్టాలపై పడుకుని!
గ్రేటర్ నోయిడా: వరుసకు అన్నదమ్ములయ్యే ముగ్గురు యువకులు మద్యం తాగి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని గౌతమబుద్ధనగర్ జిల్లా బాదల్పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దాద్రి సమీపంలోని పట్వారీ గ్రామానికి చెందిన బాలు యాదవ్, కపిల్ యాదవ్, రోహిత్ యాదవ్ వరుసకు అన్నదమ్ములు. మంగళవారం సాయంత్రం ఈ ముగ్గురూ మద్యం తాగి వారి ఇళ్లకు వెళ్లగా కుటుంబసభ్యులు లోనికి రానివ్వలేదు. మద్యం మత్తులో ఉన్న ఈ ముగ్గురూ కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుని నిర్ణయించుకున్నారు. అందుకోసం మళ్లీ మద్యం సేవించారు. అనంతరం రైలు పట్టాలపైకి వెళ్లి పడుకున్నారు. రైలు వారిపై నుంచి వెళ్లటంతో ఈ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. వీరిది హత్యా.. లేక ఆత్మహత్యా అని అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. -
మహేశ్ శర్మకు మంత్రి పదవి
ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుడు మహేశ్ శర్మకు నరేంద్ర మోదీ కేబినెట్ లో సహాయమంత్రి(స్వతంత్ర హోదా) దక్కింది. వైద్యునిగా వృతిజీవితం ప్రారంభించిన ఆయన 2014 లోక్‌సభ ఎన్నికల్లో గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 55 ఏళ్ల మహేశ్ శర్మకు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో అనుబంధం ఉంది. విద్యార్థి రాజకీయాల తర్వాత బీజేపీలో చేరారు. ఎంబీబీఎస్ చదివిన ఆయన నోయిడాలోని కౌలాష్ హెల్త్ కేర్ ఆస్పత్రికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వైద్య, కుటుంబ సంరక్షణకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 2014 సెప్టెంబర్ 1 నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎనిమిది పర్యాయాలు గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి లోక్‌సభ, యూపీ అసెంబ్లీకి పోటీ చేశారు. 2012లో నోయిడా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. అమిటీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఉత్తమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విభాగంలో 2009-2010 సంవత్సరానికి గానూ బిజినెస్ స్పియర్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.