గౌతమ్ బుద్ధ్ నగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ నోయిడా అంటే మాత్రం ఇట్టే గుర్తొస్తుంది. ఢిల్లీ సమీపంలోని అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం ఇది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఈ లోక్‌సభ నియోజకవర్గంలో హ్యాట్రిక్‌పై బీజేపీ కన్నేసింది.
జీబీ నగర్‌లోని నోయిడా, జేవార్, దాద్రీ, బులంద్‌షహర్‌లోని సికింద్రాబాద్, ఖుర్జాలతో కూడిన మొత్తం ఐదు సెగ్మెంట్లలో గౌతమ్ బుద్ధ్ నగర్ నియోజకవర్గంలో 2022 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు రానున్న లోక్‌సభ ఎన్నకల్లోనూ అవే ఫలితాలను అంచనా వేస్తోంది. ఇక్కడ గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్‌పీ, కాంగ్రెస్, ఎస్‌పీతో సహా ప్రధాన రాజకీయ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
ఇవే బీజేపీ బలాలు
తమ ప్రభుత్వం చేపట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం, దాద్రీ, బోడకిలో రవాణా సౌకర్యాలు, రైలు, మెట్రో విస్తరణ కారిడార్‌లు, సహా అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, పారిశ్రామిక కేంద్రాలతో పాటు రెండుసార్లు ఎంపీగా పనిచేసిన డాక్టర్ మహేష్ శర్మపై బీజేపీ విశ్వాసంతో ఉంది.
గౌతమ్ బుద్ధ నగర్ రాజకీయ చరిత్రలో డాక్టర్ మహేష్ శర్మ విజయ పరంపర దశాబ్దం క్రితమే మొదలైంది. 2014 ఎన్నికలలో డాక్టర్ శర్మ 5,99,702 ఓట్లు, 50 శాతం ఓట్లతో మొదటిసారి విజయం సాధించారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి నరేంద్ర భాటిని 2,80,212 ఓట్ల తేడాతో ఓడించారు. తరువాత, 2019 ఎన్నికలలో 8,30,812 ఓట్లు, 59.64 శాతం ఓట్లతో మరోసారి గెలుపొందారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. నోయిడా పేరుతో ప్రసిద్ధి చెందిన గౌతమ్ బుద్ధ్ నగర్ లోక్‌సభ స్థానానికి రెండో దశలో ఉత్తరప్రదేశ్‌లోని ఇతర నియోజకవర్గాలతో పాటు ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల నాటి ఎలక్షన్ కమిషన్ డేటా ప్రకారం, గౌతమ్ బుద్ధ నగర్‌లో 2,302,960 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,268,324 మంది పురుషులు, 1,034,503 మంది మహిళలు కాగా 133 మంది థర్డ్ జెండర్ ఓటర్లు. ఇక నియోజకవర్గంలో 3,297 పోస్టల్ ఓట్లు, 5,482 సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment