మహేశ్ శర్మకు మంత్రి పదవి
ఉత్తరప్రదేశ్ బీజేపీ నాయకుడు మహేశ్ శర్మకు నరేంద్ర మోదీ కేబినెట్ లో సహాయమంత్రి(స్వతంత్ర హోదా) దక్కింది. వైద్యునిగా వృతిజీవితం ప్రారంభించిన ఆయన 2014 లోక్సభ ఎన్నికల్లో గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి పార్లమెంట్ కు ఎన్నికయ్యారు. 55 ఏళ్ల మహేశ్ శర్మకు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీతో అనుబంధం ఉంది. విద్యార్థి రాజకీయాల తర్వాత బీజేపీలో చేరారు.
ఎంబీబీఎస్ చదివిన ఆయన నోయిడాలోని కౌలాష్ హెల్త్ కేర్ ఆస్పత్రికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. వైద్య, కుటుంబ సంరక్షణకు సంబంధించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో 2014 సెప్టెంబర్ 1 నుంచి సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎనిమిది పర్యాయాలు గౌతమ్‌బుద్ధ నగర్ నుంచి లోక్సభ, యూపీ అసెంబ్లీకి పోటీ చేశారు. 2012లో నోయిడా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు.
అమిటీ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఉత్తమ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి విభాగంలో 2009-2010 సంవత్సరానికి గానూ బిజినెస్ స్పియర్ అవార్డు అందుకున్నారు. వీటితో పాటు జాతీయ,అంతర్జాతీయ పురస్కారాలు ఆయనను వరించాయి.