హాలిడే ట్రిప్‌కు వెళ్తే.. లైంగిక వేధింపులు!
లండన్: హాలిడేస్‌ను సంతోషంగా గడుపుదామని కరీబియన్ దేశమైన డొమినికన్ రిపబ్లిక్కు వెళ్లిన ఓ బ్రిటిష్ యువతికి చేదు అనుభవం ఎదురైంది. 48 గంటల వ్యవధిలో ఆమె రెండు సార్లు లైంగిక వేధింపులకు గురికావడంతో బెదిరిపోయి హోటల్ రూంలో తలుపులేసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వివరాల్లోకి వెళ్తే.. బ్రిటన్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్ ప్రాంతానికి చెందిన గెమ్మ ఖాన్(25) ఇటీవల తన ముగ్గురు స్నేహితురాళ్లతో కలిసి ఇటీవల డొమినికన్ రిపబ్లిక్కు వెళ్లింది. అక్కడ ఓ ఖరీదైన హోటల్లో బస, ఇతర ఏర్పాట్లకు గాను వారు ఓ ట్రావెల్ సంస్థకు భారీగానే డబ్బు చెల్లించుకున్నారు. అయితే అక్కడకు వెళ్లిన తరువాతే గెమ్మ ఖాన్‌కు అనుకోని ఘటనలు ఎదురయ్యాయి. అక్కడి ఫైవ్ స్టార్ హోటల్లో.. స్విమ్మింగ్ చేసి రూంకు తిరిగి వెళ్తున్న సమయంలో ఎదురుపడిన ఇద్దరు వ్యక్తులు జెమ్మా బికినీ విప్పడానికి ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా హడలిపోయిన ఆమె వారిని విడిపించుకొని తన గదికి పరిగెత్తింది. తరువాత ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లినప్పుడు సైతం అక్కడ ఓ వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో 'నాకు ఇక ఈ టూర్ వద్దు బాబోయ్' అంటూ స్వదేశానికి తిరుగుముఖం పట్టింది. టూర్‌కు వెళ్లిన సందర్భంగా ఎదురైన అనుభవాలను ఆమె మీడియాతో వెల్లడించింది. ఈ రెండు ఘటనలపై అక్కడ ఉన్నవారికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గెమ్మ ఖాన్ వాపోయింది.