German company
-
ఇక మేనేజర్లు ఉండరు.. ప్రముఖ కంపెనీ వినూత్న ప్లాన్!
జర్మన్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం బేయర్ వినూత్న ప్రణాళిక రచించింది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం.. బేయర్ కొన్ని నిర్మాణాత్మక మార్పులు చేస్తోంది. కార్పొరేట్ బ్యూరోక్రసీని తగ్గించడం, ఉద్యోగులకు ఎక్కువ స్వయంప్రతిపత్తి కల్పించడం, వ్యాపారాన్ని సమర్థవంతంగా ఆవిష్కరించేలా చేయడం ఈ ప్రణాళిక లక్ష్యం. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బిల్ ఆండర్సన్ దీనికి "డైనమిక్ షేర్డ్ ఓనర్షిప్" అని పేరు పెట్టారు. కంపెనీ నిబంధనలకు సంబంధించి 1,300 జీలకుపైగా ఉన్న లిటరల్ కార్పొరేట్ రూల్‌బుక్‌ను తగ్గించాలని యోచిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇది 'వార్ అండ్ పీస్' పుస్తకం కంటే ఎక్కువగా ఉందని చమత్కరించారు. మిడిల్ మేనేజర్లను తగ్గించి, ప్రాజెక్ట్‌లను ఎంచుకోవడంలో ఉద్యోగులకు వెసులుబాటు కల్పించాలని యోచిస్తున్నట్లు బిల్ ఆండర్సన్ తెలిపారు. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. ఈ కొత్త వ్యవస్థ గురించి గురించి న్యూజెర్సీలో కొంతమంది ఉద్యోగులకు ఇప్పటికే అవగాహన కల్పించారు. నూతన ప్రణాళికలో భాగంగా తొలగించనున్న మేనేజర్ల సంఖ్యను కంపెనీ వెల్లడించలేదు. అయితే యూఎస్‌కు చెందిన వేలాది మంది మేనేజర్లకు కంపెనీ ఇతర ఉద్యోగాలు కేటాయించనుందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. బేయర్స్ సీఈవో అండర్సన్ ప్రతిపాదన కంపెనీ సంస్థాగత ఖర్చులను సుమారు 2 బిలియన్ యూరోలు తగ్గిస్తుందని జర్మన్ కార్పొరేషన్ మార్చిలో పేర్కొంది. గత సంవత్సరంలో బేయర్ షేర్లు 60.40 యూరోల నుండి 27.64 యూరోలకు 50 శాతానికి పైగా పడిపోయాయి. కంపెనీ సుమారు 34 బిలియన్ యూరోల రుణంపై నడుస్తోంది. -
ప్రపంచంలోనే అతి పెద్దది.. ఏపీలో ఎలక్ట్రిక్ వాహన యూనిట్
సాక్షి, అమరావతి: జర్మనీకి చెందిన ప్రముఖ విద్యుత్ బస్సులు, ట్రక్కుల తయారీ సంస్థ పెప్పర్ మోషన్ ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తోంది. చైనా వెలుపల ఈ స్థాయిలో భారీ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదిరినట్లు పెప్పర్ మోషన్ జీఎంబీహెచ్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ భారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు జిల్లా పుంగనూరులో 800 ఎకరాలు కేటాయించడంతో పాటు పలు రాయితీలను ఇచ్చింది. సుమారు రూ.4,640 కోట్లు (600 మిలియన్ అమెరికన్ డాలర్లు) పెట్టుబడితో ఏర్పాటు చేసే ఈ పరిశ్రమ ద్వారా 8080 మందికి ఉపాధి లభిస్తుంది. టెస్లా మాదిరి అంతర్జాతీయ ప్రమాణాలతో సమీకృత ఎలక్ట్రిక్ బస్ అండ్ ట్రక్ తయారీ యూనిట్‌తో పాటు డీజిల్ బస్సులు, ట్రక్కులను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే రిట్రో ఫిట్టింగ్, 20 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యం ఉండే బ్యాటరీ తయారీ యూనిట్, విడిభాగాల తయారీ యూనిట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న ప్రోత్సాహం, ఆయన తీసుకుంటున్న ప్రగతిశీల ఆరి్థక విధానాలకు తోడు పోర్టులు, పారిశ్రామిక మౌలిక వసతులు పెద్ద ఎత్తున సమకూరుస్తుండటంతో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను ఎంచుకున్నట్లు పెప్పర్ మోషన్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఆండ్రియాస్ హేగర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. యూనిట్ ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. 2025 నాటికి ఉత్పత్తి ప్రారంభం ఈ నెలాఖరులో యూనిట్ నిర్మాణం ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2025 ప్రారంభం నాటికి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. 2027 నాటికి ఏటా 50,000 కంటే ఎక్కువ బస్సులు, ట్రక్కులు తయారు చేసే సామర్థ్యానికి యూనిట్ చేరుకుంటుందని వెల్లడించింది. ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి, అంతర్జాతీయంగా సరఫరా చేయనున్నట్లు తెలిపింది. దేశంలోని పలు రాష్ట్రాల రవాణా సంస్థలు, ప్రైవేటు సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నాయని, ఇది తమ వ్యాపార విస్తరణకు కలిసొచ్చే అంశమని పెప్పర్ ఆ ప్రకటనలో పేర్కొంది. -
ఇంట్లోనే బీర్ తయారీ..జస్ట్ క్షణాల్లో రెడీ చేసుకోవచ్చు ఎలాగంటే
ఎక్కువ మంది బీర్లు తాగేందుకు ప్రిఫర్ చేస్తారు. అది మంచిదని కొందరూ..గ్లామర్ కోసం అని మరికొందరూ తాగుతుంటారు. పైగా ఆ బీర్లో క్రిస్పీగా సైడ్ డిష్‌లు ఉండాల్సిందే. ఇక చూడు సామిరంగా మందుబాబులు ఓ రేంజ్లో కుమ్మేస్తారు. ఇక ఓ కంపెనీ మరింత ముందడుగు వేసి ఏకంగా ఇన్స్టెంట్ బీర్ పౌడర్లను తీసుకొచ్చింది. ఇక మందు బాబులు బయటకు అడుగుపెట్టకుండా ఇంట్లోనే గ్లాస్లో దర్జాగా ఐస్‌క్యూబ్‌లు వేసుకుని బీర్ తాగేయొచ్చు అంటోంది జర్మన్ కంపెనీ. ఈ మేరకు జర్మనీకి చెందిన బ్రూవరీ కంపెనీ ఇంట్లోనే క్షణాల్లో బీర్ తయారు చేసుకునేలా ఇన్‌స్టింట్ కాఫీ మాదిరిగా బీర్ పౌడర్ని తీసుకొచ్చింది. ఇక ఇంట్లోనే చల్లగా తయారు చేసుకుని క్రిస్పీ స్నాక్స్‌తో ఓ పట్టుపట్టేయొచ్చు. ఇన్స్టెంట్ కాఫీ లేదా మిల్క్‌షేక్ మాదిరిగా క్షణాల్లో తయారు చేసుకోవచ్చట. ఒక గ్లాస్లో రెండు చెంచాల బీర్ పొడికి నీటిని జోడిస్తే చాలట. నిమిషాల్లో రెడీ అయిపోతుందట. దీంతో ఇక టన్నుల కొద్ది బీర్ రవాణను భారీగా తగ్గుతుందని అంటున్నారు వ్యాపార నిపుణులు. ఇక నుంచి ఒక కిలో బీర్ రవాణకు బదులు కేవలం 45 గ్రాముల పౌడర్‌కి పరిమితం చేయొచ్చు. అదే సమయంలో బీర్‌తో స్నానం చేయాలనుకునే వారి కోసం బాత్ బీర్‌ను కూడా రూపొందిస్తున్నారట. ప్రస్తుతానికి సదరు జర్మనీ కంపెనీ 42 రకాల బీర్లను అందిస్తోందని, అలాగే గ్లూటెన్-ఫ్రీ బీర్, నాన్ ఆల్కహాలిక్ బీర్లను సైతం తయారు చేయునున్నట్లు సదరు జర్మనీ కంపెనీ బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్ బ్రూ పేర్కొంది. -
టాటా పవర్ విండ్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: దేశీయంగా తీరప్రాంత పవన్ విద్యుత్(ఆఫ్‌షోర్ విండ్) ప్రాజెక్టుల అభివృద్ధివైపు టాటా పవర్ తాజాగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా జర్మన్ కంపెనీ ఆర్‌డబ్ల్యూఈ రెనెవబుల్స్ జీఎంబీహెచ్‌తో కలసి పనిచేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు పూర్తి అనుబంధ సంస్థ టాటా పవర్ రెనెవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వెరసి ఆఫ్‌షోర్ విండ్ ఎనర్జీకి ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలలో ఒకటైన ఆర్డబ్ల్యూఈతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు టాటా పవర్ తెలియజేసింది. దేశీయంగా 7,600 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉండటంతో ఆఫ్‌షోర్ విండ్ ప్రాజెక్టుల అభివృద్ధికి అత్యంత వీలున్నట్లు వివరించింది. 2030కల్లా 30 గిగావాట్ల ఆఫ్‌షోర్ విండ్ సామర్థ్య ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు తమ ఎంవోయూ మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది. రెండు సం స్థలకుగల సామర్థ్య వినియోగం ద్వారా దేశీయంగా పోటీపడేస్థాయిలో ఆఫ్‌షోర్ విండ్ మా ర్కెట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈలో టాటా పవర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 225 వద్ద ముగిసింది. -
ఆ కంపెనీలో వాట్సాప్, స్నాప్‌చాట్ నిషేధం
జర్మన్ ఆటోమేటివ్ పార్ట్‌ల సప్లయిర్ కాంటినెంటల్ ఏజీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీ ఆఫీసులో పనిచేసే ఉద్యోగులు వాట్సాప్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా యాప్స్ వాడకుండా నిషేధం విధించింది. కంపెనీ జారీచేసే ఫోన్ల ద్వారా వీటిని ఉపయోగించకూడదని, ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. భద్రతా కారణాలతో ఈ నిషేధం విధిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫోన్లు, టాబ్లెట్లలో సమాచారం నిక్షిప్తమై ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. ఈ నిషేధంతో దాదాపు 36వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుందని కాంటినెంటల్ అధికార ప్రతినిధి చెప్పారు. ప్రపంచంలో దిగ్గజ కారు పార్ట్‌ల కంపెనీల్లో ఒకటిగా ఉన్న కాంటినెంటల్‌లో గ్లోబల్‌గా 2 లక్షల 40వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. డేటా రక్షణ విషయానికి వచ్చేసరికి సోషల్ మీడియా సర్వీసుల్లో లోపాలున్నాయని తాము విశ్వసిస్తున్నామని కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ యాప్స్ యూజర్ల వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని యాక్సస్ చేస్తున్నాయని పేర్కొంది. తమ ఉద్యోగులను, బిజినెస్ పార్టనర్లను రక్షించుకోవాల్సినవసరం ఉందని కాంటినెంటల్ చెప్పింది. మే 25 నుంచి అమల్లోకి వచ్చిన యూరప్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్(జీడీపీఆర్)తో సోషల్ మీడియా కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు ప్రైవసీ అనేది తలనొప్పిగా మారిందని తెలిసింది. ఈ క్రమంలో జీడీపీఆర్‌కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు తమ బాధ్యతల్ని మార్చారని కాంటినెంటల్ చెప్పింది. ఈ సర్వీసులతో డేటా షేర్ చేయాలంటే, ప్రతి ఒక్క యూజర్, తమ కాంటాక్ట్ లిస్ట్‌లోని యూజర్లందరితో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కంపెనీకి ఎలాంటి పరిష్కారం లభించడం లేదు. దీంతో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడటం కోసం ఈ సర్వీసులను పూర్తిగా రద్దు చేయడమే మేలని కాంటినెంటల్ నిర్ణయించింది. -
మరిన్ని రాజీనామాలు ఆశించవచ్చు..
బెర్లిన్ : జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్ వాగన్ కంపెనీ బోర్డు నుంచి మరికొంత మంది రాజీనామా చేసే అవకాశం ఉందని బోర్డు సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. కాలుష్య కారకాలను గుర్తుపట్టకుండా ఉండేలా ఇంజిన్లను అమర్చి భారీ కుంభకోణానికి ఆ సంస్థ పాల్పడిన విషయం విదితమే. అమెరికాలో జరిపిన కాలుష్య పరీక్షలలో కొన్ని కొత్త విషయాలు బయటపడటంతో సంస్థ కుంభకోణం వెలుగుచూసింది. ఈ కుంభకోణానికి బాధ్యులెవరన్నది ఇంకా తేలలేదు. సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బోర్డు సభ్యులు ఐదు మంది ఆయనపై ఒత్తిడి తీసుకురావడంతో ఫోక్స్ వాగన్ సీఈఓ మార్టిన్ వింటర్ కార్న్ బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. జర్మనీకి చెందిన న్యాయవాదులు ఈ కంపెనీపై ఫిర్యాదుచేశారు. కుంభకోణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అమెరికాలోనే సుమారు 5లక్షల కార్లు విక్రయాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లలో కాలుష్యాన్ని గుర్తించని విధంగా ఉండే అమర్చి భారీ మోసాలకు ఆ కంపెనీ పాల్పడింది. జర్మనీ రవాణాశాఖ మంత్రి అలెగ్జాండర్ డోబ్రింట్ ఈ మోసాలపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. 1.1 కోట్ల కార్లలో 1.6 లీటర్లు, 2లీటర్ల ఇంజిన్ కార్లు యూరప్‌లో ఎన్ని ఉన్నాయో కచ్చితంగా తెలియదని, ఫోక్స్ వాగన్ సంస్థకు చెందిన ఏ మోడల్ కార్లలో ఇటువంటి పరికరాలు అమర్చారన్న వివరాలు ఇంకా తెలియరాలేదని మంత్రి వివరించారు. ఈ కుంభకోణం విలువ భారత కరెన్సీలో అక్షరాలా 42వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. -
బీఎండబ్ల్యూ రికార్డు అమ్మకాలు
ఫ్రాంక్ఫర్ట్: లగ్జరీ కార్ల విభాగంలో జర్మనీ దిగ్గజం బీఎండబ్ల్యూ గతేడాది రికార్డు అమ్మకాలు సాధించింది. తమ దేశానికే చెందిన ఆడి, మెర్సిడెస్ బెంజ్‌ను తోసిరాజని అగ్రస్థానం దక్కించుకుంది. 2013లో బీఎండబ్ల్యూ బ్రాండ్ కింద 16.6 లక్షల కార్లను విక్రయించినట్లు సంస్థ తెలిపింది. తద్వారా అంతక్రితం ఏడాదితో పోలిస్తే 7.5% వృద్ధి సాధించినట్లు పేర్కొంది. ఇటీవలి గణాంకాల ప్రకారం ఆడి గతేడాది 15.7 లక్షలు, మెర్సిడెస్ బెంజ్ 14.6 లక్షల కార్లను విక్రయించాయి. చైనా, అమెరికా లో అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఈ కంపెనీలు మెరుగైన ఫలితాలు సాధించ గలిగాయి. జర్మనీ ఆటోమొబైల్ రంగంలో ఈ మూడు దిగ్గజాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. బీఎండబ్ల్యూలో భాగమైన సూపర్ లగ్జరీ రోల్స్ రాయిస్ కార్ల అమ్మకాలు 1.5 శాతం పెరిగి 3,630గా నమోదయ్యాయి. రోల్స్ రాయిస్ బ్రాండ్ కింద కొన్నాళ్ల క్రితం ప్రవేశపెట్టిన రెయిత్ మోడల్ ఇందుకు తోడ్పడింది.