మరిన్ని రాజీనామాలు ఆశించవచ్చు..
బెర్లిన్ : జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్ వాగన్ కంపెనీ బోర్డు నుంచి మరికొంత మంది రాజీనామా చేసే అవకాశం ఉందని బోర్డు సభ్యుడొకరు అభిప్రాయపడ్డారు. కాలుష్య కారకాలను గుర్తుపట్టకుండా ఉండేలా ఇంజిన్లను అమర్చి భారీ కుంభకోణానికి ఆ సంస్థ పాల్పడిన విషయం విదితమే. అమెరికాలో జరిపిన కాలుష్య పరీక్షలలో కొన్ని కొత్త విషయాలు బయటపడటంతో సంస్థ కుంభకోణం వెలుగుచూసింది.
ఈ కుంభకోణానికి బాధ్యులెవరన్నది ఇంకా తేలలేదు. సంస్థపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బోర్డు సభ్యులు ఐదు మంది ఆయనపై ఒత్తిడి తీసుకురావడంతో ఫోక్స్ వాగన్ సీఈఓ మార్టిన్ వింటర్ కార్న్ బుధవారం రాజీనామా చేసిన విషయం విదితమే. జర్మనీకి చెందిన న్యాయవాదులు ఈ కంపెనీపై ఫిర్యాదుచేశారు. కుంభకోణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని తమ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. అమెరికాలోనే సుమారు 5లక్షల కార్లు విక్రయాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా 1.1కోట్ల డీజిల్ కార్లలో కాలుష్యాన్ని గుర్తించని విధంగా ఉండే అమర్చి భారీ మోసాలకు ఆ కంపెనీ పాల్పడింది.
జర్మనీ రవాణాశాఖ మంత్రి అలెగ్జాండర్ డోబ్రింట్ ఈ మోసాలపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. 1.1 కోట్ల కార్లలో 1.6 లీటర్లు, 2లీటర్ల ఇంజిన్ కార్లు యూరప్లో ఎన్ని ఉన్నాయో కచ్చితంగా తెలియదని, ఫోక్స్ వాగన్ సంస్థకు చెందిన ఏ మోడల్ కార్లలో ఇటువంటి పరికరాలు అమర్చారన్న వివరాలు ఇంకా తెలియరాలేదని మంత్రి వివరించారు. ఈ కుంభకోణం విలువ భారత కరెన్సీలో అక్షరాలా 42వేల కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.