శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీలా మారిపోయాడు!
లైమ్‌రిక్ (ఐర్లాండ్): ఐర్లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి భార్యతో శృంగారంలో పాల్గొన్న కాసేపటికే గజనీగా మారిపోయాడు. ఒకట్రెండు రోజులుగా జరిగినవేవీ జ్ఞాపకానికి రాక కిందా మీదా పడ్డాడు. 66 ఏళ్ల ఆ వ్యక్తి భార్యతో గడిపిన 10 నిమిషాలకు మొబైల్లో తేదీ చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. ఎందుకంటే ఆ ముందు రోజే వాళ్ల పెళ్లి రోజు. అంత ముఖ్యమైన విషయం మర్చిపోయానే అంటూ బాధపడిపోయాడు.
నిజానికతను భార్యతో, కూతురితో కలిసి ముందు రోజు సాయంత్రం పెళ్లి రోజును చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాడు. కానీ అవేమీ అతనికి గుర్తు లేకుండా పోయాయి. దాంతో, పెళ్లి రోజున సరదాగా గడిపామని భార్య, కూతురు ఎంత చెప్పినా ఓ పట్టాన నమ్మలేదు. ‘‘నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది? నేను ఏమేం చేశాను? ఒక్కటీ వదలకుండా చెప్పండి’’ అంటూ వారిని పదేపదే అడిగాడు.
పోనీ జ్ఞాపకశక్తి పూర్తిగా పోయిందా అంటే తన పేరు, వయసు వంటి పాత విషయాలన్నీ మాత్రం భేషుగ్గా గుర్తున్నాయి. ఇక లాభం లేదని ఆస్పత్రికి వెళ్లి పరీక్షలన్నీ చేయించినా సాధారణంగా మతిమరుపుకు దారితీసే నరాల సమస్య వంటివేమీ లేవని, అంతా మామూలుగానే ఉందని తేలింది. మరి ఈ తాత్కాలిక మరుపేమిటో అర్థం కాక డాక్టర్లు కూడా అయోమయానికి గురయ్యారు. కాసేపటికే ముందు రోజు జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఆసక్తికర ఉదంతం ఐరిష్ మెడికల్ జర్నల్ మే సంచికలో వ్యాసంగా పబ్లిషైంది. అతని సమస్యను ఒక రకమైన షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌గా గుర్తించినట్టు వ్యాసకర్త వివరించారు. ‘‘సాధారణంగా స్ట్రోక్ తదితరాల వల్ల తలెత్తే నరాల బలహీనత ట్రాన్సియెంట్ గ్లోబల్ అమ్నీసియా (టీజీఏ)గా పేర్కొనే షార్ట్ టర్మ్ మెమరీ లాస్‌కు కారణమవుతుంది. కానీ అలాంటివేవీ లేకుండానే కొందరిలో అరుదుగా ఈ సమస్య తలెత్తుతుంది. ప్రస్తుత కేసు అలాంటిదే’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 50 నుంచి 70 ఏళ్ల మధ్య వయస్కుల్లో ఇలా జరిగేందుకు ఆస్కారముంటుందన్నారు.
‘‘శారీరకంగా బాగా శ్రమ పడ్డా, అతి చల్లని, లేదా బాగా వేడి నీళ్లలో చాలాసేపు మునిగినా, ఎమోషనల్ స్ట్రెస్‌కు, బాధకు గురైనా, అరుదుగా కొన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాక ఇలా స్వల్పకాలిక మతిమరుపు వచ్చి పడుతుంది. ఫలితంగా తాజా సంఘటనలు ఎవరో చెరిపేసినట్టుగా జ్ఞాపకాల్లోంచి మాయమైపోతాయి. కొందరేమో ఏడాది క్రితం జరిగినవి మర్చిపోతుంటారు. చాలామటుకు కొద్ది గంటల్లోనే ఆ జ్ఞాపకాలన్నీ తిరిగొచ్చి మళ్లీ మామూలైపోతారు’’ అని వివరించారు.
కొసమెరుపు
ఈ ఉదంతంలోని కథానాయకునికి 2015లోనూ ఇలాంటి తాత్కాలిక మతిమరుపు వచ్చిందట. అది కూడా ఎప్పుడో తెలుసా? భార్యతో సన్నిహితంగా గడిపిన 10 నిమిషాలకే!