అరకు పార్లమెంటు పరిశీలకురాలిగా పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి
పాడేరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిని పార్టీ అరకు పార్లమెంట్ పరిశీలకురాలిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై రెండేళ్లుగా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి పోరాటం సాగిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఆమె రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల కోసం ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవో 97 జారీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు. కొయ్యూరు, చింతపల్లిల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వానికి దడ పుట్టించారు. ఏజెన్సీలో గిరిజన సమస్యలపై దృష్టి సారించి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసి పరిష్కారానికి నిరంతరం కృషి జరుపుతున్నారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పాడేరు నియోజకవర్గానికి పార్టీ సమన్వయకర్తగా నియమితులైన ఆమె అప్పట్లో పార్టీ నిర్వహించిన సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు పార్టీ వర్గాల్లోనూ, ఇటు ప్రజల్లో కూడా అనతికాలంలోనే విశేషమైన ఆదరాభిమానాలు చూరగొన్నారు. జిల్లాలోనే ముందుగా పాడేరు అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా గిడ్డి ఈశ్వరిని ఖరారు చేయడం విశేషం. నియోజకవర్గంలోనే కనీవినీ ఎరుగని రీతిలో 25 వేల పైచిలుకు భారీ ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆమెకు పార్టీలోనూ, నియోజకవర్గంలోనూ అపూర్వమైన ఆదరణ లభించింది. గత రెండేళ్లలో ఆమె ఎక్కడా రాజీ పడకుండా పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అధికార పార్టీ నిర్బంధాలను సైతం తిప్పికొడుతూ ముందుకు దూసుకుపోయారు.
∙అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఎంపీ కొత్తపల్లి గీత పార్టీకి దూరమవడంతోపాటు అక్కడి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సైతం వైఎస్సార్ పార్టీని వీడి ఇటీవల టీడీపీలో చేరడంతో గిడ్డి ఈశ్వరి ఇటు అరకు నియోజకవర్గంలో కూడా పార్టీ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి సారించి పార్టీ శ్రేణులకు అండగా, మార్గదర్శకంగా నిలిచారు. ఆది నుంచి పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్న ఈశ్వరి అధినేత జగన్మోహన్ రెడ్డి విశ్వాసాన్ని చూరగొన్నారు. అరకు పార్లమెంట్ పరిశీలకురాలిగా ఈశ్వరి నియామకం పట్ల పార్టీ వర్గాల్లో, గిరిజనుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఇది గిరిజన మహిళకు దక్కిన మరో గౌరవంగా పేర్కొంటున్నారు.