Ginger Narayana
-
ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కుంది
జస్టిస్ చంద్రకుమార్ హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఉంటుందన్న విషయాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలుసుకోవాలని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. అలాకాకుండా ప్రజల గొంతును నొక్కేస్తాను, భయపెడతానంటే కుదరదన్నారు. తాను 16వ ఏట నుంచే ఉద్యమాల్లో ఉన్నానని.. 1969 నుంచే రైతు, విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నానని.. ఈ విషయం తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. తాను ఉద్యమంలో పాల్గొన లేదంటే ఆ సమయంలో ఎక్కడ ఉన్నాను, ఏం జడ్జిమెంట్ ఇచ్చాను అనే విషయాలు తెలుసుకోవాలని అన్నారు. తన తండ్రి రజాకార్లకు, నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్‌లో పనిచేశారని.. అలాంటి కుటుంబం నుంచి తాను వచ్చానని తెలిపారు. జర్నలిస్టుగా, రచయితగా పనిచేసిన వ్యక్తి ఎంతో సమున్నతంగా, విశాలంగా ఆలోచించాలని అందుకు భిన్నంగా తప్పును ప్రశ్నించే వారిని భయపెట్టిస్తామనడం సబబు కాదన్నారు. తెలంగాణ లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు మన్నారం నాగరాజు, సోగెరా బేగం, రైతు సంక్షేమ సంఘం ప్రతినిధి రాంనర్సయ్య, బీసీ విద్యార్థి సంఘం నాయకుడు సాంబశివ గౌడ్లు మాట్లాడుతూ.. ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా రెండున్నరేళ్లుగా ఉంటూ జర్నలిస్టుల సమస్యలు ఒక్కటైనా పరిష్కరించకపోగా.. అవి ప్రస్తావించిన వారిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఈ అల్లం నారాయణ ఎక్కడకు పోయారని ప్రశ్నించారు. ఒక ఉన్నతమైన, మచ్చలేని వ్యక్తిపై ఆరోపణలు చేయడం సరికాదని హితవు పలికారు. -
ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా అల్లం నారాయణ
21 మందితో కొత్త కార్యవర్గం ఉత్తర్వులు జారీచేసిన సర్కార్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రెస్‌అకాడమీ చైర్మన్‌గా సీనియర్ సంపాదకులు అల్లం నారాయణను నియమిస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్‌తోపాటు పలు ప్రధాన పత్రికల సంపాదకులను ఇందులో సభ్యులుగా నియమించింది. ఈ మేరకు సమాచార శాఖ కమిషనర్ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల్లోగా ప్రెస్ అకాడమీ పూర్తిస్థాయిలో పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణకు కేబినెట్ హోదాతోపాటు అన్ని లాంఛనాలు ఉంటాయని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ ప్రెస్ అకాడమీ పనిచేస్తున్న చోటే తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ పనిచేయడానికి అవసరమైన సౌకర్యాలను కల్పించాలని ఆ అకాడమీ కార్యదర్శిని, సమాచార శాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. అకాడమీ పాలక మండలి పదవీ కాలం రెండేళ్లపాటు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కమిటీ సభ్యులు: టంకశాల అశోక్, వి.మురళి, కె.శ్రీనివాస్, మల్లేపల్లి లక్ష్మ య్య, కె.శేఖర్‌రెడ్డి, సీఆర్ గౌరీశంకర్, కె.శ్రీనివాస్‌రెడ్డి, జహీర్ అలీఖాన్, వినయ్‌వీర్, ఎన్.వేణుగోపాల్,ఎం.నారాయణరెడ్డి, కొమరవెల్లి అంజయ్యలతోపాటు, ఆర్థిక శాఖ కార్యదర్శి, సమాచార శాఖ నామినీ, తెలుగు యూనివర్సిటీ, ఉస్మానియా వర్సిటీ జర్నలిజం విభాగాల అధిపతులు, దూరదర్శన్ స్టేషన్ డెరైక్టర్, సమాచార శాఖ డెరైక్టర్, ప్రెస్ అకాడమీ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.