girl child dead
-
మిరాకిల్: అంత్యక్రియలు చేస్తుండగా కళ్లు తెరిచిన 3 ఏళ్ల చిన్నారి
మెక్సికో సిటీ: చనిపోయిన వ్యక్తులు మళ్లీ ప్రాణంతో తిరిగిరావటం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే.. నిజ జీవితంలో అలా జరగటం దాదాపుగా అసాధ్యం. కానీ, డాక్టర్లు చనిపోయిందని ప్రకటించిన ఓ మూడేళ్ల పాప అంత్యక్రియలు చేస్తుండగా లేచింది. నేను బతికే ఉన్నాను అంటూ కళ్లు తెరిచింది. ఈ అరుదైన సంఘటన ఆగస్టు 17న మెక్సికోలో జరిగింది. ఆసుపత్రి వర్గాల నిర్లక్ష్యంతో తన పాపను చనిపోయిందని ప్రకటించారని ఆరోపించారు తల్లి మారీ జాన్ మెండోజా. ఏం జరిగింది? విల్లా డీ రమోస్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు కమిలా రోక్సానా అనే మహిళ. ఆమె 3 ఏళ్ల కూతురు కమిలా రోక్సానా మార్టినెజ్ మెన్డోజా.. కడుపు నొప్పి, వాంతులు, జ్వరంతో బాధపడుతుండగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, మరో పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు చెప్పారు. అప్పటిలోపు పారాసిటమల్ ట్యాబ్లెట్స్ వేయాలని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. మరో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లేలోపు పాప ఆరోగ్యం మరింత విషమించింది. అక్కడి వైద్యులు మందులు ఇచ్చి, చిన్నారికి పండ్లు, వాటర్ ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ ఆమె పరిస్థితిలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ఆసుపత్రి సిబ్బంది పాపకు ఎక్కువ సమయం ఆక్సిజన్ పెట్టి ఉంచారని తల్లి ఆరోపించారు. 10 నిమిషాల పాటు ఇంట్రావీనస్ ద్రవాలను ఎక్కించిన తర్వాత వాటిని తొలగించి చనిపోయినట్లు వెల్లడించారని తెలిపారు. డీహైడ్రేషన్ కారణంగా చనిపోయిందని వైద్యులు పేర్కొననారు. ఆ తర్వాతి రోజు అంత్యక్రియలు చేసేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో చిన్నారిని ఉంచిన శవ పేటికలో ఓ గాజు ముక్క గాలిలో తెలుతుండటాన్ని గమనించింది ఆమె తల్లి. పక్కవారికి చెప్పగా వారు కొట్టిపారేశారు. ఆ తర్వాత కమిలా కళ్లు కదిలించినట్లు ఆమె బామ్మ గమనించింది. వెంటనే తెరిచి చూడగా నాడి కొట్టుకుంటుంది. హుటాహుటిన అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొద్ది సేపటికే పాప మరణించింది. పాప చనిపోయిందని నిర్లక్ష్యంతో ప్రకటించిన డాక్టర్లపై బాధితురాలి తల్లి మెండోజా కేసు నమోదు చేశారు. వైద్యులపై తనకు ఎలాంటి పగ లేదని, అయితే, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉంటాయన్నారు. ఇదీ చదవండి: ప్యాంటులో దాచి 60 పాములు, బల్లుల స్మగ్లింగ్.. అధికారులే షాక్! -
ఆడుతూ..పాడుతూ..దూరతీరాలకు
మేలిమి బంగారు తల్లులు..కలువ కన్నుల పిల్లలు..తల్లులు కన్న బాలికలు..చెంగు చెంగున గెంతుతూ కల్లాకపటం లేకుండా మనసారా నవ్వే చిన్నారులు..ఆడుతూ పాడుతూ గంతులేస్తున్న ఇద్దరు బాలికలు సజీవదహనమయ్యారు. ఈ హృదయ విదారక సంఘటన బాలికల కుటుంబసభ్యులను తీవ్ర విషాదంలో ముంచేయగా నవరంగపూర్ జిల్లా వాసులను కలిచివేసింది. ఒడిశా, జయపురం :అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలు అకస్మాత్తుగా తనువు చాలించడంతో ఆ కుటుంబాలు శోకసంద్రంలో, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నవరంగపూర్ జిల్లా ఝోరిగాం సమితి మైనాపొదర్ గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఆడపిల్లలు మొక్కజొన్న కుప్పల మంటలలో సజీవదహనమయ్యారు. గ్రామానికి చెందిన సామసన్ శాంత, పవిత్ర శాంత అన్నదమ్ములు. అన్నదమ్ములు పండించిన మొక్కజొన్న పంటను కోసి కళ్లంలో కుప్పలు వేశారు. అలాగే మొక్కజొన్న గడ్డిని కూడా కళ్లంలో పోగుగా పెట్టారు. ఆదివారం సాయంత్రం సామ్సన్ శాంత కుమార్తె సుజాత శాంత(4) పవిత్ర శాంత కుమార్తెలు అలీనా శాత(4) అర్చిత శాంత(2)లు ఆ కళ్లంలో ఆడుకుంటున్నారు. అయితే అకస్మాత్తుగా మొక్కజొన్న గడ్డి కుప్పలకు అగ్ని అంటుకుని నలువైపులా వ్యాపించింది. ఆడుకుంటున్న పిల్లలు అక్కడే ఉన్న పూరిపాకలోకి వెళ్లారు. మంటలు ఆ పాకకు కూడా వ్యాపించగా రెండేళ్ల అర్చిత ఎలాగో తప్పించుకుని అదృష్టవశాత్తు బయటపడింది. అయితే సుజాత, అలీనాలు మంటల్లోనుంచి బయట పడలేక పోయారు. వారి చుట్టూ మంటలు వ్యాపించడంతో హాహాకారాలు చేస్తూ కాలి బూడిదయ్యారు. మొక్కజొన్న కుప్పలకు అగ్ని ప్రమాదం జరిగి మంటలు ఎగిసి పడడం గమనించిన గ్రామస్తులు అక్కడికి వచ్చి చూసి ఇద్దరు బిడ్డలు మంటల్లో కాలిపోయి ఉంటారని అనుమానించి మంటలను ఆర్పి చూడగా కాలి బూడిదైన సుజాత, అలీనాలు కనిపించారు. ఈ విషయం వెంటనే పోలీసులు, అగ్నిమాపక విభాగానికి తెలియజేశారు. అయితే ఆ గ్రామం మారుమూల దుర్గమ ప్రాంతంలో ఉండడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రాలేకపోయారు. వారు చాలా ఆలస్యంగా వచ్చి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటన ఆ కుటుంబాలనే కాకుండా గ్రామస్తులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఆ కళ్లంలో ఉండేందుకు అన్నదమ్ములు పాక వేసుకున్నారని అక్కడనే కుటుంబాలతో ఉంటూ వంటలు కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ప్రమాదం వంట పొయ్యిలోని నిప్పులు రాజుకుని ఎగిరి పడడం వల్ల సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. -
డెంగీతో చిన్నారి మృతి
లాలాపేట: డెంగీ జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన బుధవారం లాలాపేటలో చోటు చేసుకుంది. స్థానిక లక్ష్మీనగర్ యాదవ బస్తీకి చెందిన మధుసూదన్‌రెడ్డి, అనిత దంపతుల ఏకైక కూతురు రుత్విక(4)కు నాలుగు రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో స్థానికంగా ఉన్న ఓ క్లినిక్‌లో చూపించారు. పరీక్షించిన వైద్యుడు పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పడంతో రెండు రోజుల క్రితం బంజారాహిల్స్‌లోని రెయిన్బో హాస్పిటల్లో చేర్పించారు. చికిత్స పొందుతూ రుత్విక బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారి స్థానికంగా ఉన్న ఆశ్రయ్ మోడల్ స్కూల్లో యూకేజీ చదువుతుండడంతో బుధవారం ఆ పాఠశాలకు సెలవు ప్రకటించారు. -
అన్నంలేక మన్ను తిన్న చిన్నారి మృతి
కదిరి మండలంలో ఆకలిచావు నమోదైంది. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఓ కుటుంబంలో చిన్నారి ఆకలితో అలమటించి మట్టి తిని అనారోగ్యంపాలై కన్నుమూసింది. మూడు రోజుల క్రితం జరిగిన హృదయవిదారకర ఘటన ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కదిరి అర్బన్: కర్ణాటక రాష్ట్రం గుదిబండ గ్రామం నుంచి మహేష్, నీలవేణి దంపతులు పదేళ్ల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హమాలీ క్వాటర్స్‌కు వచ్చి స్థిరపడ్డారు. కూలినాలి చేసుకుని జీవించే వీరికి ఉండటానికి ఇల్లు లేదు. తినడానికి తిండి లేదు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. ఈ దంపతులకు ఐదుగురు సంతానం. నీలవేణి అక్క కూతురును కూడా తమవద్దే పెంచుకుంటున్నారు. ఎనిమిదేళ్లలోపు వయసు కలిగిన శ్రీను,, అంజలి, వనిత, ఇంకా పేరు పెట్టని ఏడాది వయసుపాప ఉన్నారు. ఏడాది కిందట ఒక పాప అనారోగ్యంతో చనిపోయింది. మూడు రోజుల క్రితం రెండేళ్ల వయసు కలిగిన మరో పాప (నీలవేణి అక్క కూతురు) ఆకలికి తట్టుకోలేక మట్టి తిని అనారోగ్యానికి గురై మృతి చెందింది. వీరున్న గుడారం పక్కనే పాపను పూడ్చారు. దయనీయం.. మహేష్‌కు ఎప్పుడో ఓసారి మాత్రమే కూలి పని దొరుకుతోంది. కుటుంబ పోషణ భారంగా మారిపోయింది. ఇల్లు లేకపోవడంతో పిల్లలు రాత్రిపూట వీధుల్లో పడుకుంటున్నారు. పగలు ఎండవేడిమికి తట్టుకోలేక చెట్ల కింద ఉంటున్నారు. ఆకలి తీర్చేవారి కోసం ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఏడాది పాపకు ఏడవడానికి కూడా శక్తిలేదు. బాలల హక్కులను కాపాడడం సామాజిక బాధ్యతగా తీసుకోవాలని అందరూ చెపుతుంటారు. ప్రభుత్వం బాలల హక్కుల చట్టాలను అమలు చేస్తోందా అన్న ప్రశ్న ఈ పిల్లలను చూస్తే కలుగుతుంది. స్పందించిన ఎస్ఐ, చైల్ట్‌లైన్ సిబ్బంది మహేష్ కుటుంబ దీనావస్థను స్థానికుల ద్వారా తెలుసుకున్న కదిరి రూరల్ ఎస్ఐ వెంకటస్వామి చలించిపోయారు. ఆ కుటుంబానికి ఉండడానికి ఒక గదిని తన స్వంత డబ్బులతో నిర్మిస్తానని ముందుకు వచ్చారు. అలాగే చైల్డ్‌లైన్ 1098 కో ఆర్డీనేటర్ శ్రీనివాసులునాయుడు కూడా స్పందించారు. మహేష్ పిల్లల్లో ముగ్గురు ఆరోగ్యరీత్యా ప్రమాదపుటంచున్న ఉన్నారని, వీరిని జిల్లా కేంద్రానికి తీసుకెళ్లి సురక్షితమైన వసతిగృహంలో ఉంచి మెరుగున వైద్యం, విద్య అందించే ఏర్పాటు చేస్తానన్నారు. దాతలు ముందుకు వస్తే ఇలాంటి పిల్లలను ఆదుకున్నట్లవుతుందన్నారు. -
నీటి బకెట్లో పడి రెండున్నరేళ్ల చిన్నారి మృతి
అంబర్‌పేట: కళ్ల ముందు అప్పటిదాకా సందడి చేస్తున్న తమ కుమార్తె ప్రమాదవశాత్తూ బాత్రూంలోని నీటి బాకెట్లో పడి మృతి చెందడం తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద సంఘటన మంగళవారం మధ్యాహ్నం అంబర్‌పేట పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వీరయ్య కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మదనపల్లికి చెందిన హరికృష్ణ, రేణుక దంపతులు. వీరికి నాగున్నరేళ్ల కూతురు భాను, రెండున్నరేళ్ల చిన్ను సంతానం. నాలుగు నెలల క్రితం జీవనోపాధి కోసం డీడీ కాలనీకి వచ్చారు. హరికృష్ణ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కాగా మంగళవారం ఇంట్లో హరికృష్ణ భోజనం చేస్తుండగా చిన్న కూతరు చిన్ను ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడింది. అక్కడే ఆడుకున్న చిన్నారి అక్క భాను గమనించి తండ్రికి చెప్పింది. వెంటనే బాత్రూంలోకి పరిగెత్తుకు వచ్చి చిన్నును బకెట్లో నుంచి బయటకు తీశారు. మింగిన నీటిని బయటకు తీసి విద్యానగర్‌లో ఉన్న డీడీ ఆస్పత్రికి హుటాహుటిన తీసుకువెళ్లారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు చెప్పడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తేలుకాటుకు విద్యార్థిని మృతి
చిత్తూరు, సదుం: బాగా చదివి ప్రయోజకురాలు కావాలన్నది ఆ విద్యార్థిని కల. పదో తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలని ఎంతగానో తపన పడేది. ఎంతో ఇష్టంతో కష్టపడి చదివేది. కానీ విధి చిన్నచూపు చూసింది. తేలుకాటు రూపంలో మృత్యువు ఆ బాలిక ప్రాణాలను బలిగొంది. వివరాలు.. మండలంలోని సజ్జలవారిపల్లెకు చెందిన పార్థసారథి, సుగుణమ్మలకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె అయిన వైష్ణవి (15) సదుం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇంట్లో ఉన్న వైష్ణవి ఆదివారం రాత్రి కరెంటు పోవడంతో ఆవరణలోకి వచ్చి చీకట్లో కూర్చొంది. అక్కడే ఆరబెట్టిన చింతకాయలలో ఉన్న తేలు ఆమెను కాటు వేసింది. హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆమెను సదుం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువచ్చారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పీలేరుకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు తిరుపతికి తరలించారు. తిరుపతి స్విమ్స్‌లో వైష్ణవి చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మంగళవారం ఆమె మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ నాయకులు పెద్దిరెడ్డి వేణుగోపాల్‌రెడ్డి, రాజు, నాగరాజారెడ్డి, ఉపాధ్యాయులు సందర్శించి నివాళులు అర్పించారు. వైష్ణవి చదువులో ఎంతో చురుకుగా ఉండేదని ఉపాధ్యాయులు తెలిపారు. -
చిన్నారిని చిదిమేసిన గుర్తుతెలియని వాహనం
హస్తినాపురం:ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో మృతి చెందింది. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ వెంకటయ్య తెలిపిన మేరకు..కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్ గ్రామానికి చెందిన తుకారం తన భార్య సబిత, కూతురు శ్రేష్ట తో కలిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయినాధ్నగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. తుకారాంఏకైక కూతురు శ్రేష్ట (16నెలలు) గురువారం సాయంత్రం తన ఇంటి ముందు ఆడుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్రంగా గాయాలు కావడంతో చిన్నారిని చికిత్స నిమిత్తం చింతలకుంటలో గల రెయింబో ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చిన్నారి శ్రేష్ట మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చిన్నారి తండ్రి తుకారాం íఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. చుట్టుప్రక్కల కాలనీలతోపాటు విజయవాడ జాతీయరహదారిపై ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా ఆవాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. -
చిన్నారి గొంతు కోసి చంపిన తండ్రి
గుంటూరు: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగగుంటల్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కర్కశ తండ్రి తన 9 ఏళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు. అనంతరం తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు ఆ విషయాన్ని గమనించిన అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.