'పాస్ పోర్ట్' ఫోటోకు కొత్త నిబంధనలు..
అమెరికాః పాస్ పోర్ట్ కోసం ఫోటో తీసుకోవడం అంటేనే ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందే ఉన్న నియమ నిబంధనలకు తోడు కొత్తగా పాస్ పోర్టుకోసం ధరఖాస్తు చేసేవారికి అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ మరిన్ని నిబంధనలను అమల్లోకి తెస్తోంది. పాస్ పోర్ట్ కోసం అప్లై చేసేముందు.. దానికి జత పరిచే ఫోటోలు కళ్ళజోడు లేకుండా తీయించుకోవాలన్న కొత్త ఆంక్షను పెట్టింది. పాస్ పోర్టు జారీలో అనవసరమైన ఆలస్యాన్ని నిరోధించేందుకు ఈ నిబంధనను అమల్లోకి తెస్తోంది.
పోటో అనగానే చిరునవ్వులు చిందించడం, రకరకాల భంగిమలను ప్రదర్శించడం చేస్తారు. అయితే పాస్ పోర్ట్ ధరఖాస్తుకు జతపరిచే ఫోటోల్లో కెమెరా ముందు ఎటువంటి విపరీత హావభావాలు ప్రదర్శించకూడదు. అలాగే ఫోటో సైజు విషయంలోనూ ప్రత్యేక నియమాలు పాటించాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం పాత నిబంధనలకు తోడు తాజాగా అమెరికా స్టేట్ డిపార్ట్ మెంట్ కళ్ళజోడు పెట్టుకొని ఫోటో తీయించుకోకూడదన్న నిబంధనను జోడించింది. ఈ విధానం నవంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. గతేడాది ఏజెన్సీకి సుమారు 2,00,000 మంది వినియోగదారులు సమర్పించిన ఫోటోల్లో ఎన్నో నాణ్యతా లోపాలు ఉన్నాయని, ముఖ్యంగా వాటిలో కళ్ళజోడు పెట్టుకోవడం వల్ల నీడలు, గీతలు వంటి సమస్యలు వస్తున్నాయని, దాంతో అటు ఏజెన్సీకి, ఇటు జెట్ సెట్టర్స్ ప్రాసెసింగ్ కు తీవ్రంగా ఆలస్యం అవుతున్నట్లు తెలిపింది. ఈయేడు స్టేట్ డిపార్ట్ మెంట్ నుంచి సుమారు 20 మిలియన్ల వరకూ పాస్ పోర్టులు జారీ చేయాల్సి రావచ్చని, దీంతో అనవసరమైన ఆలస్యాన్ని తప్పించుకునేందుకు ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ వెల్లడించింది.
పాస్ పోర్ట్ ఫోటోలో మార్పులకోసం తెచ్చిన కొత్త నిబంధనల్లో అత్యవసర పరిస్థితులకు స్టేట్ డిపార్ట్ మెంట్ కొంత సడలింపు ఇచ్చింది. అత్యవసర ప్రయాణాలు, వైద్య పరమైన సమస్యల వంటి అరుదైన పరిస్థితుల్లో మాత్రం పాస్ పోర్ట్ ఫోటోకు కళ్ళద్దాలను అనుమతిస్తామని స్టేట్ డిపార్ట్ మెంట్ ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపింది. అయితే అలాంటి సందర్భాల్లో పాస్ పోర్ట్ అప్లికేషన్ కు తప్పనిసరిగా వైద్య నిపుణులు అందించిన మెడికల్ సర్టిఫికెట్ కూడా జత చేయాల్సి ఉంటుందని చెప్పింది. ఇప్పటికే ఉన్న పాస్ట్ పోర్లుల విషయంలో కళ్ళజోడు ప్రశ్న లేదని, ఇకపై కొత్తగా ధరఖాస్తు చేసుకునేవారు మాత్రం ఈ నిబంధన తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్టేట్ డిపార్ట్ మెంట్ సూచించింది.