గ్లోబల్ జర్నలిజం కోసం రూ.650 కోట్లు
వాషింగ్టన్ : స్వతంత్ర మీడియా, స్వేచ్ఛాయుత జర్నలిజం కోసం రాబోయే మూడేళ్లలో రూ.650 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు ఈబే సంస్థ వ్యవస్థాపకుడు పెర్రీ ఒమిడియార్ ప్రకటించారు. ఈ మొత్తాన్ని తప్పుడు సమాచారంతో పాటు, విద్వేష ప్రసంగాలను నిరోధించడానికి వినియోగిస్తామన్నారు. గతంలో పనామా పేపర్ల కుంభకోణాన్ని బయటపెట్టిన ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం (ఐసీఐజే) సంస్థకు తన దాతృత్వ సంస్థ ఒమిడియార్ నెట్వర్క్ ఇనిషియేటివ్(ఓఎన్ఐ) ద్వారా పెర్రీ 4.5 మిలియన్ డాలర్ల సాయాన్ని అందించారు.
ప్రస్తుతం ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా స్పందించకపోవడంతో పాటు, మీడియా సంస్థలు నమ్మకాన్ని కోల్పోవడం, తప్పుడు సమాచార వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నాయని ఓఎన్ఐ సభ్యుడు మ్యాట్ బెన్నిక్ తెలిపారు. సమాచార స్వేచ్ఛతో పాటు ప్రజల భాగస్వామ్యం, బాధ్యతాయుత జర్నలిజంకు తాము కట్టుబడి ఉన్నట్లు మాట్ స్పష్టం చేశారు.
ఒమిడియార్ తన సొంత వార్తా నెట్వర్క్ ‘ది ఇంటర్సెప్ట్’లో రానున్న కాలంలో 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల యూదులపై విద్వేషాన్ని నిరోధించడానికి పోరాడే యాంటి డిఫమేషన్ లీగ్(ఏడీఎల్), లాటిన్ అమెరికాలో ప్రభుత్వాల జవాబుదారి కోసం పోరాడే లాటిన్ అమెరికన్ అలయెన్స్ ఫర్ సివిక్ టెక్నాలజీ(ఏసీటీ) సంస్థలు లబ్ధి పొందనున్నాయి. ఫ్రాన్స్‌లో జన్మించిన ఒమిడియార్ ఇరానియన్-అమెరికన్ పౌరుడు.