GMR Energy
-
జీఎంఆర్ పవర్‌కు భారీ ఆర్డరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ పవర్ అనుబంధ సంస్థ జీఎంఆర్ స్మార్ట్ ఎలెక్ట్రిసిటీ డి్రస్టిబ్యూషన్ (జీఎస్ఈడీపీఎల్)కు పూర్వాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి రూ. 5,123 కోట్ల విలువ చేసే ఆర్డర్లు లభించాయి. వీటి కింద ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ (వారణాసి, ఆజమ్గఢ్ జోన్, ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ జోన్)లో 50.17 లక్షల స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్, నిర్వహణ పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ప్రయాగ్‌రాజ్–మీర్జాపూర్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,387 కోట్లుగాను, వారణాసి–ఆజమ్గఢ్ జోన్ కాంట్రాక్టు విలువ రూ. 2,736.65 కోట్లుగాను ఉంటుందని సంస్థ తెలిపింది. త్వరలోనే దక్షిణాంచల్ (ఆగ్రా, అలీగఢ్ జోన్)లో 25.52 లక్షల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్టుకు సంబంధించి దక్షిణాంచల్ విద్యుత్ వితరణ్ నిగమ్ నుంచి కూడా కాంట్రాక్టు లభించే అవకాశం ఉందని పేర్కొంది. -
జీఎంఆర్‌కు భారీ నష్టాలు
న్యూఢిల్లీ/హైదరాబాద్: విద్యుత్, మౌలికరంగం, విమానయానం వంటి వివిధ రంగాల్లో ఉన్న జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ 2018–19 4వ త్రైమాసికంలో భారీ నష్టాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం ఏకంగా రూ.2,341 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని విద్యుత్ ఆస్తుల విలువ క్షీణించడం వల్ల ఈ స్థాయి నష్టాలను ఎదుర్కొన్నట్టు కంపెనీ తెలియజేసింది. జీఎంఆర్ ఎనర్జీ లిమిటెడ్ (జీసీఈఎల్), దీని సబ్సిడరీలు, జాయింట్ వెంచర్లలో కంపెనీ పెట్టుబడుల విలువ క్షీణించడం వల్ల రూ.1,242 కోట్ల మేర నష్టాలు వచ్చినట్టు వెల్లడించింది. జీఎంఆర్ ఛత్తీస్‌గఢ్ ఎనర్జీ లిమిటెడ్‌కు సంబంధించి రూ.969 కోట్ల నష్టం కూడా తోడైంది. దీంతో మొత్తం పెట్టుబడుల విలువ క్షీణత రూపంలో రూ.2,212 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీకి రూ.5 కోట్ల లాభం రావడం గమనార్హం. ఇక మార్చి క్వార్టర్‌కు మొత్తం ఆదాయం రూ.2,293 కోట్లుగా నమోదయింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.2,234 కోట్లుగా ఉంది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్ విభాగం మాత్రం రూ.1,357 కోట్ల ఆదాయంపై రూ.271 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఢిల్లీ విమానాశ్రయ ప్రయాణికుల ట్రాఫిక్ 2018–19లో 5 శాతం పెరిగి 69.2 మిలియన్లుగా ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల ట్రాఫిక్ 16 శాతం పెరిగి 21.4 మిలియన్లుగా నమోదైంది. ఇంధన విభాగంలో తాజా పెట్టుబడుల్లేవు ‘‘ఇంధన విభాగంలో మా వాటాదారుల పెట్టుబడి విలువ గణనీయంగా తగ్గిపోయింది. అయినప్పటికీ ప్రస్తుతమున్న ఇంధన ఆస్తుల సమర్థతను పెంచేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రారంభ పెట్టుబడిని మాఫీ చేశాం. నియంత్రణ పరిస్థితులు మరింత స్పష్టంగా మారి, మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడే వరకూ ఈ దశలో ఇంధన విభాగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టబోవడం లేదు. సరైన సమయంలో పెట్టుబడులపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది’’అని జీఎంఆర్ ఇన్ఫ్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ చావ్లా తెలిపారు. ఇటీవల టాటా గ్రూపు, జీఐసీ సింగపూర్, ఎస్ఎస్జీ క్యాపిటల్ మేనేజ్మెంట్తో రూ.8,000 కోట్ల పెట్టుబడికి సంబంధించి చేసుకున్న ఒప్పందంతో జీఎంఆర్ ఇన్ఫ్రా రుణభారం గణనీయంగా తగ్గిపోవడమే కాకుండా, ఎయిర్పోర్ట్ వ్యాపారం డీమెర్జింగ్‌కు మార్గం సుగమం అవుతుందని జీఎంఆర్ గ్రూపు సీఎఫ్‌వో సురేష్ బాగ్రోడియా చెప్పారు. రుణభారం ప్రస్తుత రూ.24,000 కోట్ల నుంచి ఆరోగ్యకరమైన స్థితికి తగ్గిపోతుందన్నారు. విమానాశ్రయాల్లో సామర్థ్యం పరంగా ఇబ్బందులు ఎదురవుతుండడంతో విస్తరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. -
జీఎంఆర్ ఎనర్జీలో వాటాల విక్రయం
♦ మలేషియా కంపెనీ టీఎన్‌బీకి 30% వాటాలు ♦ డీల్ విలువ రూ. 2,000 కోట్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ దిగ్గజం జీఎంఆర్ గ్రూప్ అనుబంధ సంస్థ జీఎంఆర్ ఎనర్జీ (జీఈఎల్)కి చెందిన అసెట్స్ కొన్నింటిలో 30 శాతం వాటాలను మలేషియా కంపెనీ తెనగా నేషనల్ బెర్హాద్ (టీఎన్‌బీ)కు విక్రయించింది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,000 కోట్లు). సుమారు రూ. 2,750 కోట్ల పైచిలుకు ఉన్న జీఈఎల్ కార్పొరేట్ రుణభారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిధులను వినియోగించనున్నట్లు జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రంధి సోమవారం వివరించారు. డీల్ ప్రకారం జీఈఎల్కు చెందిన ఏడు విద్యుత్ అసెట్స్ పోర్ట్‌ఫోలియోల్లో 30 శాతం వాటాలు టీఎన్‌బీకి దాఖలుపడతాయి. రాబోయే అయిదేళ్లలో ఛత్తీస్‌గఢ్ తదితర ప్రాజెక్టుల్లో టీఎన్‌బీ పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పోర్ట్‌ఫోలియోల విలువ దాదాపు 1 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 6,700 కోట్లు)గా ఉంటుందని అంచనా. హైడ్రో, పునరుత్పాదక విద్యుదుత్పత్తి ప్లాంట్ల అభివృద్ధి, నిర్వహణ కార్యకలాపాల్లో తెనగా అనుభవం తమకు తోడ్పడగలదని జీఈఎల్ చైర్మన్ జీబీఎస్ రాజు ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, 2022 నాటికల్లా ప్రజలందరికీ నిరంతరాయ విద్యుత్ అందించాలన్న కేంద్రం లక్ష్య సాధన దిశగా టీఎన్బీతో ఒప్పందం దోహదపడగలదని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు పేర్కొన్నారు. ఏటా రూ. 250 కోట్ల వడ్డీ మిగులు.. తాజా నిధుల రాకతో జీఈఎల్కు ఉన్న రుణభారం సుమారు రూ. 2,000 కోట్లు తగ్గి, రూ. 750 కోట్ల స్థాయికి చేరుకోగలదని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. దీనితో ఏటా రూ. 250 కోట్ల మేర వడ్డీ ఆదా అవుతుందన్నారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని గ్యాస్ ఆధారిత ప్లాంట్లు ప్రస్తుతం 35 శాతం పీఎల్‌ఎఫ్‌తో (పే లోడ్ ఫ్యాక్టర్) పనిచేస్తున్నట్లు వివరించారు. దాదాపు 4,630 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు జీఈఎల్ ఆధ్వర్యంలో ఉన్నాయి. కమలాంగ, వేమగిరి, వరోరా, అప్పర్ కర్నాలి హైడ్రో మొదలైన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. 10,818 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం గల టీఎన్‌బీకి.. మలేషియాలో విద్యుత్ పంపిణీ తదితర కార్యకలాపాలు కూడా ఉన్నాయి. -
జీఎంఆర్ ఎనర్జీ ఐపీవో ఉపసంహరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీఎంఆర్ ఇన్‌ఫ్రాకి చెందిన అనుబంధ కంపెనీ జీఎంఆర్ ఎనర్జీ పబ్లిక్ ఇష్యూను ఉపసంహరించుకుంది. రూ.1,800 కోట్ల పబ్లిక్ ఇష్యూకి సంబంధించి సెబీకి దాఖలు చేసిన రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పి)ను వివిధ వ్యాపార కారణాలతో ఉపసంహరించకున్నట్లు జీఎంఆర్ ఇన్ఫ్రా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్కి తెలియచేసింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేకరించిన మొత్తంలో రుణ భారం తగ్గించుకోవాలని జీఎంఆర్ ఇన్ఫ్రా భావించింది.