ఇదొక పెద్ద కుట్ర!
అక్షర తూణీరం
విశ్వనాథ వారిని కదిలిస్తే ‘‘ఇవన్నీ రామాయణ కాలంలోనే అఘోరించాయి. ముక్కుబేసరి నోటి మాటని గ్రహించేది. కర్ణాభరణాలు విషయాన్ని వినిపించేవి. వాటిలో అద్భుతమైన దివ్యశక్తి గల రవ్వలుండేవి. అవి ఏమిటో నేడు మనకు తెలియదు. వారికి తెలియును. ఇదియొక చమత్కారము’’ అని వివరిస్తారు.
‘‘అనుకున్నంతా అయింది! మొరార్జీ దేశాయ్‌కి బంగారం విలువ, దానిపై ఉన్న మోజు తెలియక ఆ రోజుల్లో గోల్డ్ కంట్రోల్ పెట్టాడు. ఇప్పుడు రాత్రి విలువ, సరదా తెలియ ని ప్రధాని మోదీ ఈ ‘జాగారం పథకం’ ప్రవేశ పెట్టారు’’ అంటూ ఒక సామాజిక తత్వ వేత్త కలవరపడ్డాడు. రేపు వచ్చే కార్మిక దినోత్సవం నించి, ‘‘ఇక మీ ఓపిక’’ నినాదంతో, భారత్ సంచార నిగమ్ రాత్రి పూట ‘‘ఉచిత’’ వాగుడు వేళల్ని జాతికి ధారాదత్తం చేయనుంది. దాని వల్ల - ఇప్పటిదాకా ప్రతిరాత్రీ వసంతరాత్రీ లాగా గడుస్తున్న వారికి ప్రతి రాత్రీ శివరాత్రి కాగల ప్రమాదం ఉంది. ఇదేదో ప్రభుత్వం కల్పించిన గొప్ప రాయితీ అనుకోవద్దు, దీని వెనుక పెద్ద కుట్ర ఉందంటున్నాడు మా రవిబాబు. మొన్న చంద్ర గ్రహణం వెనకాల, ఎల్లుండి రాబోయే పుష్కరాల వెనకాల కూడా కుట్ర ఉందని ప్రతిపాదించి, వాదించి తలవూపిస్తాడు రవిబాబు. బెరడుగట్టిన సామా జిక స్పృహ గల ఎర్రచందన వృక్షం ఆయన.
ఎన్నో భయంకర సమస్యలను కప్పెట్టడానికి ఇదొక మంత్రం. మోదీ అనాలోచిత చర్యల్ని ప్రజల దృష్టి నుంచి తప్పించడానికి పన్నిన పన్నాగం. రాత్రంతా మాటలతో సరి. పగలు ఆవలింతలతో సరి. ఇలాగ ఒక్కొక్కరి ఆలోచన ఒక్కోలా ఉంది. అయితే టీవి సీరి యల్స్కి దెబ్బే. ఎందుకంటే రాత్రి ఎనిమిది నుంచి ప్రైమ్స్ మొదలవుతాయి. అప్పట్నించి సద్దితే గాని తొమ్మిది నించి నిరంతర సంభాషణకి వీలుండదు. రాత్రి సినిమాలు బోసి పోతాయి. సామర్థ్యం గల చోట మిగతా సంసార పక్ష కార్యక్రమాలు కొంచెం మందకొడిగానే నడుస్తాయి. ఒకప్పుడు పెట్రోలు ధరలు పెరిగినప్పుడు, యిది కుటుంబ నియంత్రణకు గొడ్డలిపెట్టు అని మేధావులు అరిచారు. ఇప్పుడు కూడా ఆ ప్రమాదం వుంది. ఏకాంతమన్నది వుండదిక. రామాయణంలో తాటక సంహార ఘట్టంలో, ‘‘రామా! బాణం సంధించు సంకోచించకు. ప్రొద్దు మీరిన కొద్దీ రాక్షసులు బలం పుంజుకుంటారు’’ అని హెచ్చరిస్తాడు. ఫ్రీ అనగానే జనం బలం పుంజుకుంటారు. పైగా రాత్రి.
విశ్వనాథ వారిని కదిలిస్తే ‘‘ఇవన్నీ రామా యణ కాలంలోనే అఘోరించాయి. ముక్కుబేసరి నోటి మాటని గ్రహించేది. కర్ణాభరణాలు విష యాన్ని వినిపించేవి. వాటిలో అద్భుతమైన దివ్యశక్తి గల రవ్వలుండేవి. అవి ఏమిటో నేడు మనకు తెలియదు. వారికి తెలియును. ఇదియొక చమత్కా రము’’ అని వివరిస్తారు. దీని వెనుక పెద్ద వ్యాపారం వుంది. మొదలు పెట్టాక ఒక పని చేసినా చెయ్యొచ్చు. ఉచిత వేళలో అయిదు నిమిషాలు కాగానే టకీమని లైను కట్ అయిపోతుంది. వెంటనే ముప్పై సెకన్లు స్పాట్ పడుతుంది. వ్యాపార ప్రకటన లేదా మోదీ పథకాలు విధిగా వినాల్సిందే. మీరు లైను కట్ చేస్తే, మళ్లీ డయల్ చేసుకోవా ల్సిందే. అప్పుడు ప్రతి డయలింగ్కి ఒక రూపాయి తగిలిచ్చా రనుకోండి- తడిసి మోపెడవుతుంది. ‘‘ఇది నల్లమందు, గంజాయి కంటే ప్రమాదమైన వ్యసనం. సమాచార వ్యవస్థ వుండటం మంచిదే కాని మరీ యింత అవసరమా? ఇంతకంటే అత్య వసరాలు ఎన్నో వున్నాయ్’’ అంటూ ఆందోళన చెందు తున్న వారున్నారు. పొద్దున్నే పేపరు చదివి యీ వాగుడు విశేషం గురించి చెప్పగానే మా ఆవిడ మొహం సెల్ టవరంతైంది. అయితే, ఇహ రాంగ్ నంబర్లతో కూడా ఓ అరగంట మాట్లాడుకో వచ్చని సంతృప్తిగా నిట్టూర్చింది.
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ