పరారీలో బంగారం వ్యాపారి
నరసన్నపేట: నరసన్నపేటలోని బజారువీధిలో శ్రీ సంతోషిమాతా జ్యూయలర్ పేరున బంగారం షాపు నిర్వహిస్తున్న పొట్నూరు సన్యాసిరావు పరారయ్యాడు. 15 రోజులుగా షాపు తెరవక పోవడం, ఇంటికి తాళాలు వేసి ఉండటంతో ఏమైందని ఆరా తీసిన బాధితులు సన్యాసిరావుకు ఫోను చేస్తున్నా స్విచ్ ఆఫ్ అని వస్తుండంతో లబోదిబోమంటున్నారు.
సన్యాసిరావు 12 ఏళ్ల క్రితం ఇలాగే పరారై రూ.50 లక్షలకు పైగా స్థానికులకు టోకరా వేశాడు. కొన్నేళ్ల కిందట తిరిగి నరసన్నపేట వచ్చి మళ్లీ బంగారం షాపు పెట్టాడు. పాత అప్పులు తీర్చకపోగా కొత్తగా షాపు నిర్వహణ, బంగారం వస్తువుల పేరిట పరిసర గ్రామాలకు చెందిన వారి నుంచి అధికంగా డబ్బు సేకరించి మరోసారి పరారయ్యాడు.
ఎక్కువ వడ్డీ ఇస్తానని చెప్పి రూ.10 లక్షల వరకూ అప్పు చేసినట్లు సమాచారం. బంగారం వస్తువులు ఇస్తానని తోటి బంగారం షాపుల వారి నుంచి రూ.10 లక్షల వరకూ టోపీ వేసినట్లు తెలుస్తోంది. వీరితో పాటు జమ్ము, తామరాపల్లి, గోపాలపెంట, పోతయ్యవలస, మడపాం, యారబాడు గ్రామస్తుల నుంచి రూ. 5 లక్షల వరకూ తీసుకున్నట్లు సమాచారం.
నమ్మి పోసపోయాం..
జమ్ముకు చెందిన వాన చిన్నమ్మి, పీస లక్ష్మి, నరసన్నపేట బజారు వీధికి చెం దిన లక్ష్మిలు మాట్లాడుతూ బంగారం వస్తువులు ఇస్తానని సన్యాసిరావు చెప్పడంతో నమ్మి మోసపోయామని వాపోయారు. ఈ విషయమై సీఐ పైడపునాయుడు మాట్లాడుతూ సన్యాసిరావు పరారైన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఎవరూ రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వక పోవడంతో దర్యాప్తు చేయలేకపోతున్నామని చెప్పారు.