Goldstone Infratech
-
నేపాల్‌కు గోల్డ్‌స్టోన్ ‘ఈ–బజ్ కే6’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాదీ కంపెనీ గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ తాజాగా ఈ–బజ్ కే6 మోడల్‌ను తయారు చేసింది. కేంద్ర మంత్రి అనంత్ గీతే చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించిన ఈ బస్‌లను.. నేపాల్‌కు ఎగుమతి చేస్తున్నట్లు గోల్డ్‌స్టోన్ ఈడీ నాగ సత్యం చెప్పారు. 7 మీటర్ల పొడవున్న ఈబజ్ కే6 బస్‌లో 18 మంది కూర్చునే వీలుంది. ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంతో గోల్డ్‌స్టోన్ ఈ బస్‌లను తయారు చేస్తోంది. భారత్‌లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా త్వరలో భారత్ కూడా తయారు చేయగలదని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తృత వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అనంత్ గీతే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, బస్సుల్లో ఉపయోగించే వాటి కోసం ఒక్కో దానికి రూ. 50–60 లక్షలు అవుతోందని మంత్రి చెప్పారు. బ్యాటరీల ఖర్చు తగ్గితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా అందుబాటు స్థాయిలోకి వస్తాయన్నారు. -
అయిదేళ్లలో 10 వేల ఉద్యోగాలు
హైదరాబాద్: వచ్చే అయిదేళ్లలో 8–10 వేల మందికి ఉద్యోగావకాశాలు అందించనున్నట్టు ఎలక్ట్రిక్ బస్‌ల తయారీ సంస్థ గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ వెల్లడించింది. భారత్‌ను ఎగుమతి కేంద్రంగా తీర్చిదిద్దుతామని కంపెనీ స్ట్రాటజీ ప్రెసిడెంట్ నాగ సత్యం తెలిపారు. శ్రీలంక, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్‌కు ఇక్కడి నుంచి బస్‌లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. త్వరలోనే విదేశీ గడ్డమీద అడుగు పెట్టనున్నాయని వివరించారు. ఎగుమతుల విషయంలో భారత్ నుంచి తొలి ఎలక్ట్రిక్ బస్ కంపెనీగా నిలుస్తామన్నారు. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ బస్‌లను గోల్డ్‌స్టోన్ తయారు చేస్తోంది. హైదరాబాద్ సమీపంలో కంపెనీకి అసెంబ్లింగ్ ప్లాంటు ఉంది. ఏడాదికి 600 బస్‌లను సరఫరా చేసే సామర్థ్యం ఈ యూనిట్‌కు ప్రత్యేకత. ఏడాదికి 1,500 బస్‌లను అసెంబుల్ చేయగల సామర్థ్యంతో కర్ణాటకలో రూ.600 కోట్లతో నిర్మిస్తున్న ప్లాంటు 2018 అక్టోబరు కల్లా సిద్ధం కానుంది. తెలంగాణకు 100, బెంగళూరుకు 150, ముంబైకి 40 బస్‌లను సరఫరా చేసేందుకై ఆర్డర్లను ఇటీవలే గోల్డ్‌స్టోన్ సాధించింది. -
హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్‌ల అసెంబ్లింగ్!
⇒ గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఏర్పాటు ⇒ చైనా దిగ్గజం బీవైడీ ఆటో భాగస్వామ్యం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బస్‌ల అసెంబ్లింగ్‌కు కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాద్‌లో మరో కంపెనీ జతపడుతోంది. సిలికాన్ రబ్బర్ ఇన్సులేటర్ తయారీలో ఉన్న భాగ్యనగరికి చెందిన గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ అసెంబ్లింగ్ యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు కంపెనీలు సాధారణ బస్‌లను మాత్రమే అసెంబ్లింగ్ చేస్తున్నాయి. గోల్డ్‌స్టోన్ మాత్రం పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ బస్‌లను రూపొందించనుంది. ఇందుకోసం చైనా దిగ్గజం బీవైడీ ఆటోతో చేతులు కలిపింది. ప్లాంటుకు 100 ఎకరాలు అవసరమవుతాయని సంస్థ ఈ–బస్ విభాగం హెడ్ పి.కె.శ్రీవాస్తవ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. బస్‌ల కోసం ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాదిలోగా కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తొలుత రూ.20 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. తొలి దశలో 300 బస్‌ల అసెంబ్లింగ్ సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. ప్లాంటు సాకారమైతే 500 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పెరుగుతున్న ఆర్డర్లు.. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి 25 ఎలక్ట్రిక్ బస్‌లకు గోల్డ్‌స్టోన్ ఇన్ఫ్రాటెక్ ఆర్డరు సాధించింది. 110 కిలోమీటర్ల కొండ ప్రాంతమైన మనాలి–రోహ్తంగ్–మనాలి మార్గంలో 13,000 అడుగుల వరకు ఎత్తులో ఇవి ప్రయాణిస్తాయి. సమతల మార్గం పరంగా చూస్తే ఈ దూరం 150–160 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ సోమవారం బీఎస్ఈకి తెలిపింది. ఒకసారి చార్జ్ చేస్తే చాలని, ప్రయాణం పూర్తి అవుతుందని వివరించింది. ఆర్డరు విలువ రూ.47.75 కోట్లు అని కంపెనీ ఎండీ ఎల్.పి.శశికుమార్ తెలిపారు. వార్షిక నిర్వహణ ఖర్చులు దీనికి అదనం. బీవైడీ ఆటో సహకారంతో ఈ బస్‌లను భారత్‌లోనే అసెంబుల్ చేస్తారు. భారత్‌లోనే బస్ డిజైన్ కూడా చేపడుతున్నారు. బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి 6 బస్‌లకు ఇప్పటికే కంపెనీ ఆర్డరు పొందింది.