హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల అసెంబ్లింగ్‌! | Goldstone Infratech to assemble electric buses in tie-up with BYD | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల అసెంబ్లింగ్‌!

Published Tue, Feb 28 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల అసెంబ్లింగ్‌!

హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ బస్‌ల అసెంబ్లింగ్‌!

గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఏర్పాటు
చైనా దిగ్గజం బీవైడీ ఆటో భాగస్వామ్యం


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బస్‌ల అసెంబ్లింగ్‌కు కేంద్ర బిందువుగా మారుతున్న హైదరాబాద్‌లో మరో కంపెనీ జతపడుతోంది. సిలికాన్‌ రబ్బర్‌ ఇన్సులేటర్‌ తయారీలో ఉన్న  భాగ్యనగరికి చెందిన గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ అసెంబ్లింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ఆసక్తి చూపుతోంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు కంపెనీలు సాధారణ బస్‌లను మాత్రమే అసెంబ్లింగ్‌ చేస్తున్నాయి. గోల్డ్‌స్టోన్‌ మాత్రం పూర్తి స్థాయి ఎలక్ట్రిక్‌ బస్‌లను రూపొందించనుంది. ఇందుకోసం చైనా దిగ్గజం బీవైడీ ఆటోతో చేతులు కలిపింది.

ప్లాంటుకు 100 ఎకరాలు అవసరమవుతాయని సంస్థ ఈ–బస్‌ విభాగం హెడ్‌ పి.కె.శ్రీవాస్తవ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు వెల్లడించారు. బస్‌ల కోసం ఆర్డర్లు పెరుగుతున్న నేపథ్యంలో ఏడాదిలోగా కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. తొలుత రూ.20 కోట్లు పెట్టుబడి పెడతామన్నారు. తొలి దశలో 300 బస్‌ల అసెంబ్లింగ్‌ సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నారు. ప్లాంటు సాకారమైతే 500 మంది స్థానికులకు ఉపాధి లభిస్తుందని తెలియజేశారు. రానున్న రోజుల్లో శిక్షణ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామన్నారు.

పెరుగుతున్న ఆర్డర్లు..
హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ నుంచి 25 ఎలక్ట్రిక్‌ బస్‌లకు గోల్డ్‌స్టోన్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఆర్డరు సాధించింది. 110 కిలోమీటర్ల కొండ ప్రాంతమైన మనాలి–రోహ్‌తంగ్‌–మనాలి మార్గంలో 13,000 అడుగుల వరకు ఎత్తులో ఇవి ప్రయాణిస్తాయి. సమతల మార్గం పరంగా చూస్తే ఈ దూరం 150–160 కిలోమీటర్ల వరకు ఉంటుందని కంపెనీ సోమవారం బీఎస్‌ఈకి తెలిపింది.

ఒకసారి చార్జ్‌ చేస్తే చాలని, ప్రయాణం పూర్తి అవుతుందని వివరించింది. ఆర్డరు విలువ రూ.47.75 కోట్లు అని కంపెనీ ఎండీ ఎల్‌.పి.శశికుమార్‌ తెలిపారు. వార్షిక నిర్వహణ ఖర్చులు దీనికి అదనం. బీవైడీ ఆటో సహకారంతో ఈ బస్‌లను భారత్‌లోనే అసెంబుల్‌ చేస్తారు. భారత్‌లోనే బస్‌ డిజైన్‌ కూడా చేపడుతున్నారు. బృహన్‌ ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ నుంచి 6 బస్‌లకు ఇప్పటికే కంపెనీ ఆర్డరు పొందింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement