ఆ నలుగురిలో ఒకరు!
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిపై కసరత్తు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాల్ గాంధీల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ నలుగురిలో ఎవరో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టవచ్చని ప్రతిపక్ష నేత ఒకరు వెల్లడించారు. సుదీర్ఘ రాజకీయానుభవం ఉన్న శరద్ పవార్ పేరుపై ప్రతిపక్షాలు సానుకూలంగా ఉండగా.. దళిత నేత, కాంగ్రెస్కు చెందిన మీరా కుమార్కు అవకాశాలు మెండుగా ఉన్నాయి.
జేడీయూకు చెందిన శరద్ యాదవ్ సీనియర్ నేతే కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా సుదీర్ఘ అనుభవముంది. మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీకి పార్టీలకతీతంగా మద్దతిస్తున్నారు. గాంధీ అభ్యర్థిత్వానికి తృణమూల్ కాంగ్రెస్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థి విషయమై కొందరు ప్రతిపక్ష నేతలు తనను సంప్రదించారని గాంధీ తెలిపారు. ఉమ్మడి అభ్యర్థిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, బిహార్ సీఎం నితీశ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, ఇతర ప్రతిపక్ష నేతలు చర్చలు కొనసాగిస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్, బీజేడీతో పాటు దక్షిణాదికి చెందిన ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తమకు మద్దతిచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నారు.