'బైచుంగ్కు ఇవ్వం... బీజేపీకే మద్దతు ఇస్తాం'
డార్జీలింగ్ లోక్సభ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాజీ ఫుట్బాల్ ఆటగాడు బైచుంగ్ భాటియాను ఎంపిక చేయడం పట్ల గుర్కా జనముక్తి మోర్చ (జీజేఎం) నిరసన వ్యక్తం చేసింది. అతడిని ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని జీజేఎం అధ్యక్షుడు బిమల్ గురంగ్ మంగళవారం డార్జీలింగ్లో వెల్లడించారు. సిక్కం రాష్ట్రానికి చెందిన వ్యక్తిని ఇక్కడ ఎలా ఎన్నికల బరిలో నిలుపుతారని ఆయన ఆ పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రశ్నించారు. ఆయన ఎంపిక విషయం తమను సంప్రదించలేదన్నారు. అదికాక గుర్కాలాండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్పటి నుంచి పోరాడుతున్నామని ఆయన గుర్తు చేశారు.
బీజేపీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉందన్నారు. అందుకు మద్దతు ఇస్తామని ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు జస్వంత్ సింగ్, సుష్మాస్వరాజ్, రాజీవ్ ప్రతాప్ రూడీలు భరోసా ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీకే మద్దతు ఇస్తామన్నారు. అయితే డార్జీలింగ్ ఎంపీ బీజేపీ సీనియర్ నేత జస్వంత్ సింగ్ గత ఐదేళ్లుగా తమ ప్రాంతానికి చేసింది ఏమీ లేదన్నారు. అయితే డార్జీలింగ్ నియోజకవర్గం నుంచి బైచుంగ్ వంద శాతం విజయం సాధిస్తాడని రాష్ట్ర మంత్రి గౌతమ్ దేవ్ ధీమా వ్యక్తం చేశారు.