Gosthani River
-
గోస్తనీ నదిలో విద్యార్థి గల్లంతు.. ఆవేదనలో తల్లిదండ్రులు!
పద్మనాభం: మండలంలోని పాండ్రంగి పంచాయతీ కురపల్లి చెక్ డ్యామ్ వద్ద ఆదివారం స్నానానికి దిగిన ఇంటర్ విద్యార్థి గల్లంతైనట్టు ఎస్ఐ జె.సురేష్ తెలిపారు. ఎస్ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. పీఎం పాలెం గాయత్రినగర్‌కు చెందిన ఎనిమిది మంది మహిళలు, ఐదుగురు పురుషులు కలిసి ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆటోలో కురపల్లి పిక్నిక్కు వచ్చారు. వీరిలో పొన్నగంటి హరి (16)తోపాటు ముగ్గురు చెక్ డ్యామ్ వద్ద గోస్తనీ నదిలోకి స్నానానికి దిగారు. ఈ క్రమంలో హరి నదిలో గల్లంతయ్యాడు. మిగతా ఇద్దరు ఒడ్డుకు చేరుకుని కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. విషయం తెలుసుకున్న పాండ్రంగి గ్రామానికి చెందిన జాలర్లు, కురపల్లి గ్రామస్తులు నదిలో హరి కోసం సాయంత్రం ఐదు గంటల వరకు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు ఎస్ఐ సురేష్ తెలిపారు. గాయత్రినగర్‌కు చెందిన పొన్నగంటి అప్పారావు, రమణమ్మ దంపతులకు హరి, ఉదయ్ ఇద్దరు కుమారులు సంతానం. వీరిలో రెండోవాడైన హరి మద్దిలపాలెం కృష్ణా కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఉదయ్ పాలిటెక్నికల్ చదువుతున్నాడు. తండ్రి అప్పారావు స్థానిక బీసీ హాస్టల్లో హెల్పర్‌గా పని చేస్తున్నాడు. హరి, ఉదయ్ చక్కగా చదువుకుని ప్రయోజకులై తమకు అండగా నిలుస్తారని ఆశపడితే, ఇలా గల్లంతయ్యాడని తల్లి రమణమ్మ, గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆమెను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఇది చదవండి: పాదయాత్రగా వెళ్లి.. దుర్మరణం పాలై! -
ఘొల్లుమన్న గోస్తనీ
పశ్చిమగోదావరి ,తణుకు: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న చిన్నారులు ఇక లేరన్న విషయాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుతున్న పెద్ద దిక్కు సైతం తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని కలచివేస్తోంది. ఒకే కుటుంబంలో ముగ్గురు గోస్తనీ నదిలో పడి మృత్యువాత పడటంతో బంధువులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తణుకు మండలం వెంకట్రాయపురం పరిధిలో మంగళవారం జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తించింది. వేల్పూరు రోడ్డులో స్థానిక వీమాక్స్ థియేటర్ ఎదురుగా నివాసం ఉంటున్న వడ్లమూడి వరప్రసాద్, ప్రసన్నకుమారి దంపతుల ఇద్దరు కుమారులు వడ్లమూడి అభిషేక్ (7), వడ్లమూడి జాన్‌కెల్విన్(5) స్థానికంగా ప్రైవేటు స్కూలులో మొదటి తరగతి, ఎల్కేజీ చదువుతున్నారు. వీరు నివాసం ఉంటున్న ఇంటికి దగ్గర్లో గోస్తనీ కాల్వ రేవు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఆడుకుంటున్నారు. గమనించిన వీరి అమ్మమ్మ మానుకొండ సావిత్రి (60) వారిని హెచ్చరించింది. దీంతో ఆందోళనకు గురైన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయారు. వెంటనే సావిత్రి ఆందోళనతో వారిని రక్షించేందుకు కాల్వలో దూకేసింది. ముగ్గురూ నీటి ప్రవాహానికి కొట్టుకుపోవడంతో గమనించిన స్థానికులు రక్షించే యత్నం చేశారు. అప్పటికే వీరంతా మృతి చెందడంతో వీరభద్రపురం సమీపంలో మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలను వెలికితీసిన పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాలను బంధువులకు అప్పగించారు. తణుకు రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆడుకుంటూ అనంతలోకాలకు.. కలిసిమెలిసి ఆడుకున్న అన్నదమ్ములు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. అప్పటి వరకు కళ్ల ముందు మెదిలిన చిన్నారుల మృతదేహాలను చూసిన స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. వీమాక్స్ థియేటర్ ఎదురుగా గోస్తనీ కాల్వ సమీపంలో నివాసం ఉంటున్న మానుకొండ సావిత్రి తన కుమార్తె ప్రసన్నకుమారిని తాడేపల్లిగూడెంకు చెందిన వడ్లమూడి వరప్రసాద్‌కు ఇచ్చి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేశారు. వరప్రసాద్ తాడేపల్లిగూడెంలో ప్రైవేటు స్కూలులో టీచర్‌గా పని చేస్తుండగా తల్లి ప్రసన్నకుమారి స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కాల్వ రేవు వద్ద ఆడుకుంటున్న అభిషేక్, జాన్‌కెల్విన్‌లను అమ్మమ్మ సావిత్రి హెచ్చరించారు. కాల్వలో పడిపోతారు వచ్చేయండ్రా అంటూ మందలించే క్రమంలో ఆందోళనతో భయపడి ప్రమాదవశాత్తూ చిన్నారులు ఇద్దరూ కాల్వలో పడిపోయారు. వీరిని రక్షించే క్రమంలో సావిత్రి కూడా దూకేయడంతో మృత్యువాత పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వీరిని రక్షేంచేందుకు విశ్వప్రయత్నం చేశారు. వీరభద్రపురం సమీపంలో మృతదేహాలను గుర్తించినా.. వీరిలో అభిషేక్, సావిత్రి బతికే ఉన్నారంటూ వీరిద్దరినీ స్థానికంగా ప్రైవేటు ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృత్యువాత పడటం స్థానికులను కలచివేసింది. -
నదిలో పడి యువకుడి మృతి
జామి: గోస్తనీనదిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని భీమసింగిలో చోటుచేసుకుంది. స్థానికులు, తోటి కార్మికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా సింహాచలం కుమ్మరిదిబ్బకు చెందిన శ్రీకాకుళపు రాంబాబు (30) భీమసింగిలో తన మామ ఎం. రాంబాబుకు చెందిన ఇటుక బట్టీలో ఏడాదిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవార సాయంత్రం పని ముగించుకుని సమీపంలో ఉన్న నదికి స్నానానికి వెళ్లాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో తోటి కార్మికులు సమీప ప్రాంతాల్లో వెతికారు. ఎవరో స్నేహితుల దగ్గరకు వెళ్లి ఉంటాడులే అనుకున్నారు. బుధవారం ఉదయానికి కూడా రాకపోవడంతో మరోసారి సహచర కూలీలందరూ వెతకగా, గోస్తనీ నది ఒడ్డున రాంబాబు సైకిల్ కనిపించింది. దీంతో నదిలో గాలిస్తుండగా సోమయాజులపాలెం వంతెన వద్ద రాంబాబు మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. జామి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. పండగకు వస్తానని చెప్పి.. సింహాచలంలో జరుగుతున్న పైడితల్లి పండగకు వస్తానని చెప్పిన భర్త అర్ధంతరంగా మృత్యువాత పడడంతో భార్య అరుణ కన్నీరుమున్నీరవుతోంది. మంగళవారం సాయంత్రం రాంబాబు తన భార్యకు ఫోన్‌చేసి బుధవారం ఉదయం ఇంటికి వస్తానని తెలిపాడు. భార్య అరుణ భర్త రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో భర్త మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంఘటనా ప్రాంతానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడికి భార్యతో పాటు లిఖిత (6), సాత్విక (4) కుమార్తెలున్నారు. ఇసుక తవ్వకాలే ప్రాణం తీశాయి.. గోస్తనీ నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నది ప్రమాదకరంగా మారింది. ఈ గోతుల్లో కూరుకుపోవడం వల్లే రాంబాబు మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
గోస్తని నదిలో వ్యక్తి గల్లంతు
గంట్యాడ (విజయనగరం జిల్లా) : గంట్యాడ మండలం తాటిపూడి వద్ద మంగళవారం గోస్తని నదిలో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. గల్లంతైన వ్యక్తి విజయనగరం పట్టణం కమ్మవీధికి చెందిన షేక్ అబ్దుల్ ఖాదర్ గిలానీ(40)గా గుర్తించారు. గిలానీ తన నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి వెళ్లినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకున్నట్లు తెలిసింది. గల్లంతైన గిలానీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు స్థానిక ఎస్ఐ తిరుపతి తెలిపారు. -
‘కాశీపట్నం’ చూడర బాబూ!
శృంగవరపుకోట: పవిత్రంగా ప్రవహించే గోస్తనీ నది, మదిని అలరించే అందమైన ఇసుక తిన్నెలు, నీడనిచ్చే వృక్షాలు, ఆ వృక్షాల నడుమ ఓ తొ ర్రలో కొలువైన శివుడు. ఆ స్వామి ఎదుట స్వయంభువుగా వెలసిననంది. అన్నీ కలిపి కాశీపట్నం. కార్తీక మాసాన భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ, వారి పాలిట కొంగుబంగారంగా పరిఢవిల్లుతోందీ క్షేత్రం. ఎస్.కోటకు 13కిలోమీటర్ల దూరంలో విశాఖ-అరకు రోడ్డులో విశా ఖ జిల్లా అనంతగిరి మండల పరిధిలో ఉన్న కాశీపట్నానికి కార్తీక మాసంలో భక్తులు అధిక సంఖ్యలో వెళతారు. ఈ క్షేత్రం విశాఖ జిల్లాలోనే ఉ న్నా విజయనగరం నుంచే అధిక సంఖ్యలో భక్తులు వెళుతుంటారు. ని త్యం భక్తుల దర్శనాలతో, పర్యాటకులతో సందడిగా ఉండే కా శీపట్నం క్షేత్రం అటు దేవాదాయశాఖ నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోకున్నా భక్తులు సమర్పిస్తున్న దక్షిణలు, కానుకలతో నిర్వహణ సాగుతోంది. ఇదీ ఉమారామలింగేశ్వరుని చరితం... కాశీపట్నంలో కొలువుదీరిన నీలకంఠుడు ఉమారామలింగేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడు. ఇక్కడ ఉన్న కథనం ప్రకారం... విజయనగరం సంస్థానాధీశులు వేటకు వెళ్లినపుడు చక్రవ ర్తి కాలికి రాయి తగిలింది. చక్రవ ర్తి శివలింగాకారంలో ఉన్న రాయిని చూసి ఇది దైవ సంకల్పం అని విశ్వసించారు. శివలింగం పక్కనే రావి,మర్రి మొక్కలు నాటి పూజ చేశారు. తర్వాత కొన్నేళ్లకు వేటకు వెళ్లే సమయానికి శివలింగం పెరిగి పెద్దదయినట్టు గుర్తించారు. ప్రస్తుతం శివలింగం మూడు అడుగుల ఎత్తులో ఉంది. అప్పటి నుంచి ఈ ఈశ్వరుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. పవిత్రం గోస్తనీ స్నానం... కాశీపట్నంలో కొలువుదీరిన ఉమారామలింగేశ్వరుని దర్శించేందుకు వచ్చిన భక్తులు ఆలయం పక్కనున్న గోస్తనీలో తనివీ తీరా పవిత్ర స్నానాలు చేసి పుల కించి, స్వామిని దర్శించి త రిస్తారు. గోస్తనీ పరవళ్లు, పక్కనే ఉన్న పర్యతాలు, చెట్లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. స్వయంభువుడైన నందీశ్వరుడు : విజయనగరం సంస్థానాధీశులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్నప్పుడు అక్కడ నందీశ్వరుడు లేడు. కాలక్రమంలో రాజులు ఉమారామలింగేశ్వరుని కనుగొన్న తర్వాత అక్కడ నందీశ్వరుడు స్వయంభువుగా వెలిశాడని స్థానికులు చెబుతారు. నందీశ్వరున్ని కాలితో తన్నిన వ్యక్తి నోటిమాట పోయిందని ఒక కథనం ప్రచారంలో ఉంది. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వరున్ని సైతం అంతే భక్తితో కొలిచి పూజలు చేస్తారు. చెట్టు తొర్రే కైలాసంగా: కాశీపట్నం క్షేత్రంలో నేటికీ ఉమారామలింగేశ్వరుడు మర్రి, రావి చెట్లు కలిసి ఏర్పడిన చెట్టు తొర్రలోనే ఉన్నాడు. చెట్లు పెద్దవిగా పెరిగిపోవటంతో చెట్ట కాండాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో క్ర మంగా ఇటుకలు పేర్చి పూరించారు. నేటీకి ఈ ఆలయం చెట్టుగానే కొనసాగుతోంది. బయటి నుంచి చూస్తే ఆలయం ఎక్కడా కని పించదు. మిగిలిన ఆలయాల మాదిరిగా ఆలయ గోపురం, ప్రాం గణం, గర్భాలయం, గాలిగోపురం ఏమీ ఉండవు. విస్తారంగా వ్యాపించిన రావి, మర్రి చెట్లు కొమ్మల మాటున ఉన్న ఆలయ ప్రాంగణంలో ఉమారామలింగేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. కాశీపట్నంలో ఉమారామలింగేశ్వరుని సన్నిధి, ఆలయానికి ఎదురుగా శ్మశానవాటిక, పక్కనే పవిత్ర గోస్తనీ నదీ ప్రవాహం ఉన్నాయి. కాశీపట్నం చేరాలంటే : * విశాఖ నుంచి ఎస్.కోట మీదుగా అరుకు వెళ్లే బస్‌లు కాశీపట్నం మీదుగా వెళ్తాయి. ఎస్.కోట నుంచి కాశీపట్నం వెళ్లేందుకు ప్రతి గంటకు బస్ ఉంది. * ఎస్.కోట నుంచి కాశీపట్నం 13 కిలోమీటర్ల ఉంటుంది. బస్ చార్జి పల్లెవెలుగు రూ 10లు, ఎక్స్‌ప్రెస్‌కు *15లు ఉంటుంది. * ఎస్.కోట నుంచి కాశీపట్నం వేళ్లేందుకు ఆటోలు, ప్రైవేటు వాహనాలు విరివిగా ఉంటాయి. * విజయనగరం నుంచి ఎస్.కోటకు తాటిపూడి రూట్లో వస్తే బొడ్డవర జంక్షన్లో దిగి కాశీపట్నం వెళ్లొచ్చు. బొడ్డవర నుంచి కాశీపట్నం 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది.