రోధిస్తున్న భార్య అరుణ, బంధువులు
జామి: గోస్తనీనదిలో పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలోని భీమసింగిలో చోటుచేసుకుంది. స్థానికులు, తోటి కార్మికులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా సింహాచలం కుమ్మరిదిబ్బకు చెందిన శ్రీకాకుళపు రాంబాబు (30) భీమసింగిలో తన మామ ఎం. రాంబాబుకు చెందిన ఇటుక బట్టీలో ఏడాదిగా పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళవార సాయంత్రం పని ముగించుకుని సమీపంలో ఉన్న నదికి స్నానానికి వెళ్లాడు. రాత్రికి ఇంటికి రాకపోవడంతో తోటి కార్మికులు సమీప ప్రాంతాల్లో వెతికారు.
ఎవరో స్నేహితుల దగ్గరకు వెళ్లి ఉంటాడులే అనుకున్నారు. బుధవారం ఉదయానికి కూడా రాకపోవడంతో మరోసారి సహచర కూలీలందరూ వెతకగా, గోస్తనీ నది ఒడ్డున రాంబాబు సైకిల్ కనిపించింది. దీంతో నదిలో గాలిస్తుండగా సోమయాజులపాలెం వంతెన వద్ద రాంబాబు మృతదేహం కనిపించింది. వెంటనే విషయాన్ని పోలీసులు, రెవెన్యూ అధికారులకు తెలియజేశారు. జామి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.
పండగకు వస్తానని చెప్పి..
సింహాచలంలో జరుగుతున్న పైడితల్లి పండగకు వస్తానని చెప్పిన భర్త అర్ధంతరంగా మృత్యువాత పడడంతో భార్య అరుణ కన్నీరుమున్నీరవుతోంది. మంగళవారం సాయంత్రం రాంబాబు తన భార్యకు ఫోన్‌చేసి బుధవారం ఉదయం ఇంటికి వస్తానని తెలిపాడు. భార్య అరుణ భర్త రాకకోసం ఎదురుచూస్తున్న సమయంలో భర్త మరణవార్త తెలియడంతో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సంఘటనా ప్రాంతానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడికి భార్యతో పాటు లిఖిత (6), సాత్విక (4) కుమార్తెలున్నారు.
ఇసుక తవ్వకాలే ప్రాణం తీశాయి..
గోస్తనీ నదిలో ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల నది ప్రమాదకరంగా మారింది. ఈ గోతుల్లో కూరుకుపోవడం వల్లే రాంబాబు మృతి చెంది ఉంటాడని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment