gouse basha
-
‘మగాడు ఇలా చేయాలంటే కత్తిమీద సామే’
సాక్షి, యడ్లపాడు/గుంటూరు: చిన్ననాటి నుంచే అతనికి సినిమాలంటే ఎంతో ఇష్టం.. ఆ ఇష్టమే అతని ఆశయసాధన దిశగా అడుగులు వేయించింది. ఎందరో కళాకారులను అక్కున చేర్చుకునే కళామతల్లి ఒడిలో ఒదిగేలా చేసింది. బుల్లితెర, వెండితెర నటుడిగా మారేలా చేసింది. అతడే హాస్యనటుడు హర్షిత. ఇది ఇండస్ట్రీలో పిలుచుకునే అతని ముద్దుపేరు. అసలు పేరు గౌస్‌బాష. చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన గోనె సంచుల వ్యాపారి మాబుసుభాని, మహబ్బీ దంపతుల పెద్ద కుమారుడు. స్త్రీ, పురుష పాత్రల్లో వేషం ఏదైనా నటన అదరహో అనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఉద్యోగం కోసమంటూ హైదరాబాద్‌కు.. మొదటినుంచి గౌస్‌బాష సినిమాలను ఎక్కువగా చూసేవాడు. కళపై మక్కువో.. నటుడు కావాలన్న కోరిక తెలియదు కాని ఇంటర్‌తోనే విద్యకు ఫుల్స్టాప్ పడింది. తల్లిదండ్రులు చూపిన విద్యమార్గం కంటే తాను ఎంచుకున్న రంగంపైనే అభిలాష ఎక్కువగా పెంచుకున్నాడు. ఇంటర్, ఏసీ మెకానికల్ ఐటీఐను అతికష్టం మీద పూర్తి చేశాడు. ఆరో తరగతి నుంచే కళారంగం అంటే ఇష్టత ఏర్పడిందని తాను కళాకారుడిగానే జీవితంలో గుర్తింపు తెచ్చుకోవాలని ఎన్నో కలలు కన్నానని కుటుంబసభ్యులకు చెప్పాడు. పగటి కలలు కనకు అంటూ కుటుంబసభ్యులు తోసిపుచ్చారు. ఊళ్లో ఇది విన్నవారు కామెడీ చేస్తున్నావా అంటూ ఎద్దేవా చేశారు. ఆ మాటలు విన్న అతనిలో తన ఆశయం సాధించాలన్న కసి మరింతగా పెరిగింది. జాబ్ నిమిత్తమంటూ ఊరు విడిచి హైదరాబాద్ చేరుకున్నాడు. నిరాశ ఎదురైనా పట్టు వీడలేదు తనకు ఎంతటి పట్టుదల ఉన్నా, తనలో ఎంతటి ప్రతిభ ఉన్నా గుర్తించే వ్యక్తి అవకాశం కోసం విశ్వప్రయత్నాలు చేశాడు. మూడేళ్లు గడిచాయి. ఒక్క అవకాశమూ తలుపు తట్టలేదు. జరిగిందేదో జరిగింది. ఇంటికి వచ్చేయమంటూ కుటుంబసభ్యులు, మిత్రులు సలహా ఇచ్చారు. అయినా లక్ష్యం సాధించే వరకు ఊరికి తన ముఖం చూపించకూడదనుకున్నాడు. 2018లో చివరిలో ఇండిపెండెంట్ పేరుతో రూపొందించే ఓ షార్ట్‌ఫిల్మ్‌లో అవకాశం లభించింది. అందులో తన నటనా కౌసల్యాన్ని అద్భుతంగా ప్రదర్శించాడు. అది బాగా వైరల్ కావడంతో ఆ ఫొటోలు చూసి బుల్లితెరలో నటించే అవకాశం లభించింది. ఇప్పుడు ఎన్నో అవకాశాలు... జెమినీలో జూలకటక, స్టూడియోవన్లో లాఫింగ్ అడ్డా, ఈటీవీ జబర్దస్త్, 108 తెలంగాణ చానల్లో గబ్బర్‌సింగ్ టెలీ కామెడీ షోలలో నటిస్తున్నాడు. దర్శకుడు మూర్తి.. బాషాను పిలిచి ముత్యాలముగ్గులో నటించే అవకాశం ఇచ్చి సీరియల్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత కాలేజీ పోరగాళ్లు, మళ్లీమళ్లీ చూశా, పుణ్యదంపతులు సినిమాల్లోనూ నటించాడు. వీటితోపాటు తనకు నటుడిగా గుర్తింపు తెచ్చిన షార్ట్ఫిల్మ్స్లో 20కు పైగా నటించాడు. వీటితో పాటు ప్రైవేట్ ఆల్బమ్ కవర్సాంగ్స్లోనూ నటిస్తున్నాడు. యూట్యూబ్ చానెల్స్ వారం వారం ప్రసారం చేసే యాదయ్య, యాదమ్మ ముచ్చట్లు, వారం వారం నీ కవితతో వంటి ప్రత్యేక ప్రోగ్రామ్స్‌లోనూ రాణిస్తున్నారు. స్త్రీ వేషధారణకు మంచి గుర్తింపు స్త్రీ వేషధారణలో హర్షిత పేరుతో చేస్తున్న కామెడీ పోగ్రామ్స్ గౌస్‌బాషాకు మంచి గుర్తింపును తీసుకువచ్చాయి. ఆడవారి హావభావాలు ప్రదర్శించడం ఆషామాషీ విషయం కాదు. అందుకు ఆహార్యం ఒక్కటే సరిపోదు. అందుకు తగ్గ అభినయం ఉండాలి. మాటాల్లో మృధుత్వం పలకాలి. సిగ్గు, బిడియం తొణికిసలాడాలి. అన్నింటికి మించి నడకలో వయ్యారాలు పోవాలి. వీటన్నింటి ఓ మగాడు చేయాలంటే కత్తిమీద సామువంటిదే. అదికూడా టెలీషోలో చేయడమంటే చాలా కష్టం. కళల పట్ల ఆసక్తి..కళాకారుడిగా నిరూపించుకోవాలన్న కసి ఉన్నప్పుడే అవి సాధ్యపడతాయని గౌస్‌బాషా నిరూపించాడు. పలు చానల్లో కామెడీ షోలలో హర్షిత పేరుతో స్త్రీ పాత్రలు పోషిస్తున్నాడు. -
మంచిర్యాలలో విస్తరిస్తున్న గంజాయి
సాక్షి,మంచిర్యాల : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం విస్తరిస్తోందని ఎసిపి గౌస్‌భాష పేర్కొన్నారు. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, మందమర్రి, హాజీపూర్, శ్రీరాంపూర్లలో గంజాయి వినియోగం జోరుగా కొనసాగుతుంది. తాజాగా హాజీపూర్ మండలం రాపల్లిలో గంజాయి అమ్ముతూ పట్టుబడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎసిపి గౌస్‌భాష వెల్లడించారు. విచారణలో భాగంగా మరికొంత మంది గంజాయికి బానిసలు అవుతున్నట్లు తెలుసుకొని మరో 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారందరికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించిన గౌస్‌భాష మరోసారి గంజాయి జోలికి పోకూడదంటూ ప్రమాణం చేయించారు. కాగా, వారం క్రితమే మంచిర్యాల జిల్లా మందమర్రిలో గంజాయికి బానిసలుగా మారిన 39 మందికి వారి తల్లిదండ్రుల సమక్షంలో డిసిపి రక్షిత్ కె మూర్తి కౌన్సెలింగ్ నిర్వహించారు. -
‘తేజస్’ వెబ్సైట్ ఆవిష్కరణ
చెన్నై, సాక్షి ప్రతినిధి : వార్తల సేకరణలో పెరిగిన వేగానికి అనుగుణంగా తేజస్ కార్యకలాపాలతో వెబ్సైట్ రూపకల్పన శుభపరిణామమని గవర్నర్ కే రోశయ్య ప్రశంసించారు. తెలుగు జర్నలిస్ట్స్ అసోసియేషన్ (తేజస్, చెన్నై) కొత్తగా రూపొందించిన వెబ్‌సైట్‌ను రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో ఆదివారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ కాలంలోని వేగంతోపాటు పాత్రికేయుల పాత్ర కూడా వేగవంతమైందని చెప్పారు. 1952లో కార్బన్ కాపీపై వార్త రాసి విలేకరికి అందజేస్తే వారం, పది రోజులకు పత్రికలో ప్రచురితమయ్యేదని గుర్తుచేశారు. ఈ జాప్యాన్ని కాలదోషంగా భావించకుండా ఎంతో సంతోషించే వారమన్నారు. నేడు సభ జరుగుతుండగానే వార్తలు పంపేయడం, మీడియాలో ప్రసారం కావడం కూడా పూర్తవుతోందని చెప్పారు. నేటి వార్త మరుసటిరోజు రాకుంటే కాలదోషం పట్టినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ యుగం తో పోటీపడుతున్నట్లుగా తేజస్ ఒక వెబ్‌సైట్‌ను రూపొం దించుకోవడం, దాన్ని రాజ్‌భవన్‌లో తన చేతుల మీదుగా ఆవిష్కరించడం ఆనందకరమన్నారు. తనకు కనీసం సెల్‌ఫోన్ వినియోగించడం కూడా రాదని తెలిపారు. మాట్లాడడం మినహా ఆన్ ఆఫ్‌లు కూడా సహాయకులు చేస్తారని వివరించారు. భవిష్యత్తులో తమవంటి వారికి తేజస్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తమిళనాడు నుంచి వెలువడుతున్న తెలుగు వార్తా పత్రికల్లో తెలుగుదనాన్ని మరింతగా పెంచాలని సూచించారు. విషయ సేకరణను పెంచి పాఠకులకు అందించాలని ఒక పాఠకునిగా కోరుతున్నానని అన్నారు. తేజస్ సభ్యుల సంక్షేమ నిధికి రూ 2 లక్షల భూరి విరాళాలు ప్రకటించిన పల్లవ గ్రానైట్స్ అధినేత కే సుబ్బారెడ్డి, రూ లక్షకు హామీ ఇచ్చిన జయరాజ్ ఇంటర్నేషనల్ ప్రయివేట్ లిమిటెడ్ సీఎండీ టీ రాజశేఖర్‌ను, వెబ్సైట్ రూపకర్త భాస్కర్‌రెడ్డిని, తేజస్ బృందాన్ని గవర్నర్ అభినందించారు. తేజస్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో కీలకమైన మలుపునకు 12వ తరగతి కారణమైనట్లే, తేజస్ సైతం 12 ఏళ్ల ప్రస్తానా న్ని దాటేటప్పుడు వెబ్‌సైట్‌ను సిద్ధం చేసుకుందన్నారు. తమిళనాడులో పనిచేసే తెలుగు జర్నలిస్టుల వివరాలు, తేజస్ కార్యకలాపాలను ప్రపంచానికి చాటేలా వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. మంచి మనస్సు కలిగిన మచ్చలేని రాజకీయవేత్త రోశయ్య చేతుల మీదుగా వెబ్సైట్ ఆవిష్కరించుకోవడం తమకు సంతోషదాయకమన్నారు. విలేకరులకు కూడా విమర్శలేగానీ సుఖమయ జీవితం, జీతం ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని తేజస్ సభ్యుల సంక్షేమం కోసం శాశ్వత నిధిని ఏర్పాటు చేసి మృతి చెందిన విలేకరి కుటుంబానికి బీమా ద్వారా రూ 5 లక్షలు అందజేయనున్నామని ప్రకటించారు. సభ్యుల సంక్షేమం కోసం తేజస్‌ను మరింత బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తేజస్‌కు ఊపిరిగా నిలుస్తున్న కే సుబ్బారెడ్డి, ఆరోగ్య సంజీవని వలె అండగా ఉన్న ‘ఉంగళుక్కాగ’ సునీల్ తదితరుల సహకారం మరువలేనిదని అన్నారు. తేజస్ ప్రధాన కార్యదర్శి వందన సమర్పణ చేస్తూ శాశ్వత నిధికి విరాళాలు అందించిన కల్పవృక్ష చారిటబుల్ ట్రస్ట్ (రూ 1 లక్ష), సినీ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ (జీవితాంతం ఏడాదికి రూ 10 వేలు), తేజస్ సభ్యురాలు ఎన్ అరుణశ్రీ (రూ 25 వేలు)లకు, సభకు హాజరైన ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రముఖులు పల్లవ గ్రానైట్స్ అధినేత కే సుబ్బారెడ్డి, ఉంగళుక్కాగ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సునీల్, సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ సభ్యులు చిరంజీవి, పెరియార్ వర్సిటీ సెనేట్ సభ్యులు తంగుటూరి రామకృష్ణ, గొల్లపల్లి ఇజ్రాయల్ తదితరులు పాల్గొన్నారు.