governement school
-
మారిన ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు..
-
విద్యార్థులకు ప్రోగ్రెస్‌కార్డులు చేరేదెప్పుడో?
మంచిర్యాలఅర్బన్: విద్యార్థుల ప్రగతి ఎలా ఉందో తెలుసుకోవాలంటే నివేదిక కీలకం. తరగతి గదిలో విద్యార్థి ప్రతిభ, మార్కులు ఎలా వస్తున్నాయో ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రుకు తెలియాలంటే అందించే ప్రగతి నివేదిక పంపిణీలో ఎనలేని జాప్యం జరుగుతోంది. విద్య సంవత్సరం ప్రారంభమై ఐదునెలలు గడుస్తున్నా ప్రగతి నివేదిక పత్రాలు పాఠశాలలకు చేరలేదు. విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పే పాలకులు, అధికారులు మాటలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికే రెండు పరీక్షలు ముగిసిన వాటికి సంబంధించిన ప్రగతిని రికార్డుల్లో నమోదు చేయాల్సి ఉంది. ఆలస్యం కారణం ఏమైనా మంచిర్యాల బుక్ డిపోకు చేరి వారం గడుస్తున్నా గోదాంలు దాటని వైనంపై ‘సాక్షి’ కథనం. ప్రగతి నివేదికలు పంపిణీ ఇలా? విద్యాసంవత్సరం ప్రారంభమైన మొదటో ఏటా ఒకటి, ఆరోతరగతి విద్యార్థులకు ప్రగతి నివేదికల రికార్డులు అందిస్తారు. ప్రగతి నివేదిక ప్రోగ్రెస్ రిపోర్టు, సమగ్ర నిరంతర మూల్యంకనం, సెంట్రల్ మార్క్ రిజిస్టర్లను ప్రభుత్వమే అందిస్తూ వస్తోంది. మిగతా తరగతుల వారికి గతంలో ఇచ్చిన వాటిల్లోనే (రికార్డుల్లోనే) మార్కులు పొందుపరుస్తారు. కానీ ఈ ఏడాది ఐదునెలలు గడిచినా ప్రగతి నివేదికల రికార్డులబుక్లు అందకపోవడంతో విద్యార్థుల మార్కులను నోట్ పుస్తకాల్లోనే రాసుకోవాల్సిన పరిస్థితి. పరీక్షలు పూర్తయినా... ఇప్పటికే ఎఫ్ఏ–1, ఎఫ్ఏ–2 పరీక్షలు పూర్తయ్యాయి. నిబంధనల ప్రకారం పరీక్ష ముగిసిన వెంటనే విద్యార్థుల ప్రగతి నివేదికలను పూర్తి వివరాలతో తల్లిదండ్రులకు పంపించాలి. అయితే ఇందుకు విరుద్ధంగా ఉపాధ్యాయులు జవాబుపత్రాలను విద్యార్థులతో ఇంటికి పంపించి వారి తల్లిదండ్రులు చూపించి సంతకం తీసుకురావాలని సూచనలు చేస్తున్న వారు లేకపోలేదు. ప్రస్తుతం కాగితాలు, జవాబుపత్రాలపై ఉన్న మార్కులు మళ్లీ ప్రగతి నివేదికల్లో వేయడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఐదు నెలలు గడుస్తున్నా... పాఠశాలలు పున:ప్రారంభమై ఐదునెలులు గడిచిపోయింది. సెంట్రల్మార్కు రిజిస్టర్, విద్యార్థి సంచిత సమగ్ర ప్రగతి నివేదిక ( క్యుములేటివ్ రికార్డు), సీసీఈ రిజిస్టర్ (ప్రగతి నమోదు రిజిస్టర్)లు మాత్రం ఇప్పటివరకు పాఠశాలలకు చేరలేదు. ప్రస్తుతం మంచిర్యాల జిల్లాకేంద్రం ప్రభుత్వం పుస్తక విక్రయ కేంద్రం (బుక్‌డిపో)కు చేరి రోజులు గడుస్తున్నా గోదాంల నుంచి దాటడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బుక్ డిపోల్లోనే భద్రం.. జిల్లాలోని 18 మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటో తరగతి విద్యార్థులకు పంపిణీ చేసే సీసీఈ ప్రోగ్రెస్ రికార్డింగ్ రిజిస్ట్రర్లు 173(తెలుగు మీడియం), 14 (ఉర్దూ),7(ఇంగ్లీష్) క్యుములేటివ్ ప్రోగ్రెస్ రికార్డు 764 (తెలుగు మీడియం) 64(ఉర్దూ), సెంట్రల్ మార్కు రిజిస్ట్రర్లు–86 (తెలుగు మీడియం) 5(ఉర్దూ), 4 (ఇంగ్లీష్ మీడియం) బుక్‌డిపోకు చేరాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులకు అందించేందుకు సీసీఈ ప్రోగ్రెస్ రికార్డింగ్ రిజిస్టర్లు– 3048(తె.మీ), 505(ఇ.మీ), 116(ఉ.మీ), క్యుములేటివ్ ప్రోగ్రెస్ రికార్డు 5486(తె.మీ), 3149(ఇ.మీ), 117(ఉ.మీ), సెంట్రల్ మార్కు రిజిస్టర్లు 707(తె.మీ),197(ఇ.మీ), 24(ఉ.మీ) సంబంధించిన విద్యార్థి ప్రగతి నివేదిక పుస్తకాలు గోదాంల్లోనే ఉన్నాయి. ఒక్క ఇంగ్లీశ్ మీడియానికి చెందిన క్యుములేటివ్ ప్రోగ్రెస్ రికార్డులకు సంబంధించిన 53 మాత్రమే తక్కువగా వచ్చాయి. రెండురోజుల్లో పంపిణీ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ప్రగతి నివేదికలకు సంబంధించిన రికార్డులు బుక్‌డిపోకు చేరాయి. ఏయే పాఠశాలలకు ఎన్ని ఇవ్వాలో నివేదిక తయారు చేశాం. మండల ఎంఈవోలకు సమాచారం పంపించాం. రెండురోజుల్లో మండలాలకు అక్కడి నుంచి పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. – పారుపెల్లి ప్రభాకర్‌రావు,సెక్టోరల్ అధికారి మంచిర్యాల -
‘పది’లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
వాంకిడి(ఆసిఫాబాద్): పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులను సిద్ధం చేయాలని డీఈవో భిక్షపతి అన్నారు. మండలంలోని ఇందాని జెడ్పీ ఉన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వసతులు, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల పనితీరు పై అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. బోధన అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థులపై శ్రద్ధ వహించాలన్నారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ఇవ్వాలన్నారు. అనంతరం మొదటి సారిగా పాఠశాలకు వచ్చిన డీఈవోను పాఠశాల ఉపాధ్యాయులు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం రాథోడ్ సుభాష్, ఉపాధ్యాయులు మహేశ్, సూర్యభాను తదితరులు ఉన్నారు. -
సదువొస్తలేదు..!
ఆదిలాబాద్‌టౌన్: సర్కారు బడుల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రాథమిక, ఉన్నత స్థాయి విద్యార్థుల పరిస్థితిలో ఏమాత్రం వ్యత్యాసం లేకుండాపోయింది. చాలా మంది విద్యార్థులు కనీస అభ్యసన స్థాయిలైన చదవడం, రాయడం చేయలేకపోతున్నారు. చతుర్విద ప్రక్రియల్లో భాగంగా గోడమీద రాతలు కూడా చదవని పరిస్థితి ఉందంటే ప్రభుత్వ పాఠశాలల్లో బోధన తీరును ఇట్టే అర్థమవుతోంది. సగానికి పైగా విద్యార్థులు అక్షరాలు గుర్తించడంలో వెనుకంజలో ఉన్నారు. ప్రతియేడాది విద్యార్థుల ప్రగతి మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ఏదో ఒక కార్యక్రమం చేపట్టినా అది పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, కొంతమంది ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు శాపంగా మారుతోంది. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్(ఎన్సీఈఆర్టీ) ప్రతి సంవత్సరం 3, 5, 8, 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు పరీక్షలు ని ర్వహిస్తున్నారు. ఈ ఫలితాల్లో జిల్లా వెనుకబడే ఉంటోంది. గత మూడు నాలుగేళ్లుగా పదో తరగ తి పరీక్ష ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయిలో కింది నుంచి మొదటి స్థానం మనదే ఉండడం గమనార్హం. జిల్లాలో.. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో మొత్తం 56,600 మంది వరకు విద్యార్థులు చదువుతున్నారు. 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు, 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. గతేడాది నవంబర్ మాసంలో జాతీయ మదింపు పరీక్ష(ఎన్ఏఎస్)లో 3, 5, 8, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేసిన పాఠశాలల్లో పరీక్ష నిర్వహించింది. ఇందులో చాలామందికి చదవడం, రాయడం రావడం లేదని, బోధన విధానం డొల్లతనాన్ని బయటపెట్టింది. విద్యార్థులు చిన్న చిన్న లెక్కలు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారని సర్వేలో తేటతెల్లమైంది. ప్రతియేడాది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నప్పటికీ ఏమాత్రం ప్రయోజనం కనిపించడంలేదు. ఈ యేడాది కూడా ఉపాధ్యాయులకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఎన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నా లోపాలు మాత్రం విద్యాశాఖ అధికారులు సవరించలేకపోతున్నారు. ఇందుకు సీసీఈ విధానమే కారణమని కొంతమంది ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అసైన్మెంటు ఇవ్వడం, అవగాహన లేని కారణంగా విద్యార్థులు చేయలేకపోతున్నారు. దీనికితోడు కొంతమంది ఉపాధ్యాయులకు కూడా వీటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం కూడా ఓ కారణంగా చెప్పుకోవచ్చు. విద్యార్థి తాను పరిసరాలను చూసినేర్చుకోవాలనేది ఈ విధానం ముఖ్య ఉద్దేశం. లక్ష్యం మంచిదే అయినా ఆచరణలో మాత్రం పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. త్వరలో ఉపాధ్యాయులకు శిక్షణ.. ఉపాధ్యాయుల బోధన సామర్థ్యాలపై ఈ పది రోజుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు విద్యాశాఖ అధికారుల ద్వారా తెలుస్తోంది. షార్ట్ టర్మ్, మిడ్‌టర్మ్, లాంగ్ టర్మ్ వారీగా ఉపాధ్యాయులకు శిక్షణ కల్పించనున్నారు. ఈ శిక్షణలో విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. విద్యార్థులు ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారనే విషయాలను ఉపాధ్యాయులు గ్రహించి వారికి ప్రత్యేక బోధన కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈయేడాదైనా మెరుగు పడేనా.. ప్రతియేడాది నవంబర్‌లో రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిల్లో విద్యార్థుల సామర్థ్య స్థాయి పరీక్షలు నిర్వహిస్తారు. గతేడాది రాష్ట్రస్థాయిలో చివరి స్థానంలో నిలిచిన విషయం విదితమే. ఈసారైనా జిల్లాలోని సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థుల స్థాయి మెరుగు పడేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఉపాధ్యాయులు వారిపై ప్రత్యేక దృష్టి సారించి ఈసారి ప్రతిభ కనబర్చేలా చూడాలని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కాగా జిల్లాలోని 58 ప్రాథమిక పాఠశాలల్లో 813 మంది 3వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 50.48 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 51.12 శాతం, పరిసరాల విజ్ఞానంలో 48.40 శాతం ప్రగతి ఉంది. అదేవిధంగా 57 ప్రాథమిక పాఠశాలల్లో 1,074 మంది 5వ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 43.02 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 40.95 శాతం, పరిసరాల విజ్ఞానంలో 40.05 శాతం, 8వ తరగతితో 51 ఉన్నత పాఠశాల్లో 1301 విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 43.62 శాతం సగటు మార్కులు వచ్చాయి. గణితంలో 31.01 శాతం, సామాన్య శాస్త్రంలో 31.51 శాతం, సాంఘిక శాస్త్రంలో 33.51 శాతం వచ్చాయి. 80 పాఠశాలల్లో 2642 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించారు. తెలుగులో 46.81 శాతం, ఆంగ్లంలో 33.34 శాతం, గణితంలో 33.23 శాతం, సామాన్య శాస్త్రంలో 33.94 శాతం, సాంఘిక శాస్త్రంలో 36.23 శాతం విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. ఈ ఫలితాల్లో 10వ తరగతి విద్యార్థులు కేవలం 31 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. ఇదీ జిల్లా పరిస్థితి. -
తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
♦ ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా ♦ మరుగుదొడ్లు కూల్చివేసి పొలాల్లోకి రోడ్డు వేస్తున్న వైనం ♦ విమర్శలు గుప్పిస్తున్న గ్రామస్తులు తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. భావి భారత పౌరులను తయారు చేసే పాఠశాల స్థలంపై కన్నేశారు. అనుకున్నదే తడవుగా అక్కడ ఉన్న మరుగుదొడ్లు కూల్చివేశారు. ఆ స్థలంలో తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనిపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు. అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. గతంలో పనిచేసిన కలెక్టర్ జనార్దన్‌రెడ్డి పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యం కోసం అదనంగా 1.17 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం రూ.7.5లక్షలతో ప్రణాళికలు పంపడంతో ప్రస్తుతం రూ.4.5 లక్షల నిధులు మంజూరుయ్యాయి. వాటితో పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ప్రహరీ గోడ ఏర్పాటు చేస్తే తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఉండదనే స్వార్థంతో కొందరు తెలుగు తమ్ముళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే జేసీబీల సాయంతో పాఠశాలలోని మరుగుదొడ్లను కూల్చివేశారు. పాఠశాల స్థలంలోనే రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు ఎందుకు వేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలిజ ప్రశ్నిస్తే మా పొలాల్లోకి వెళ్లడానికి దారి ఏర్పాటు చేయాలని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అనుమతితోనే మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. అనుమతి పత్రాలు చూపాలని హెచ్ఎం కోరితే దాటవేస్తున్నారు. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల చర్యలను నీతిమాలినవిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ తహశీల్దార్ మహబూబ్‌బాషాను వివరణ కోరింది. రహదారి నిర్మించుకోవాలని ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాఠశాల స్థలాన్ని పరిశీలించి ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
రెంజల్, న్యూస్‌లైన్ : విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్ అన్నారు. బుధవారం రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో కీర్తన సొసైటీ అధ్వర్యంలో 10వ తరగతి బాలికలకు ‘సాక్షి’ బుక్‌లెట్స్‌ను సబ్ కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు పదవ తరగతి పునాది లాంటిదని అన్నారు. ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకుని చదువులో ముందుకు సాగాలని సూచించారు. బాలికలకు 10వ తరగతి తర్వాత రూ. 10 వేల రుణం అందించి చిన్న తరహా పరిశ్రమలు పెట్టించినా ఫలితముండదని అదే కష్టపడి చదివి విద్యావంతులైతే వారితో పాటు కుటుంబం మొత్తానికి మేలు జరుగుతుందన్నారు.అంతేగాక సమాజంలో తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. చదువుతో పాటు క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పథకాలతో పాటు సేవా సంస్థలు అందించే ప్రోత్సాహంతో పైకి రావాలన్నారు. 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయమే రూ.వితాన్ని మారుస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతీ ఒక్కరు పదిలో పాస్ కావాలని భగవంతుడిని ప్రార్థిస్థానని అన్నారు. కీర్తన సొసైటీ ద్వారా అందిస్తున్న ‘సాక్షి’ ఎస్సెస్సీ బుక్‌లెట్స్‌ను చదివి రాణించాలన్నారు. పేద విద్యార్థులకు అవసరమైన స్టడీ మెటీరియల్‌ను అందించడం అభినందనీయమన్నారు. రెంజల్‌లోని కస్తూర్బా గాంధీ విద్యాలయం విద్యార్థులతో పాటు బీసీ బాలికల హాస్టల్ విద్యార్థినులకు కూడా కీర్తన సోసైటీ ద్వార పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కీర్తన సొసైటీ అధ్యక్షుడు ప్రణయ్రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సీమా పర్వీన్ సిబ్బంది పాల్గొన్నారు.