తెలుగు తమ్ముళ్ల బరితెగింపు
♦ ప్రభుత్వ పాఠశాల స్థలం కబ్జా
♦ మరుగుదొడ్లు కూల్చివేసి పొలాల్లోకి రోడ్డు వేస్తున్న వైనం
♦ విమర్శలు గుప్పిస్తున్న గ్రామస్తులు
తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. భావి భారత పౌరులను తయారు చేసే పాఠశాల స్థలంపై కన్నేశారు. అనుకున్నదే తడవుగా అక్కడ ఉన్న మరుగుదొడ్లు కూల్చివేశారు. ఆ స్థలంలో తమ పొలాలకు వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. వీటిని నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. దీనిపై స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
అనంతపురం రూరల్ : అనంతపురం రూరల్ మండల పరిధిలోని ఆలమూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉంది. గతంలో పనిచేసిన కలెక్టర్ జనార్దన్‌రెడ్డి పాఠశాలలోని విద్యార్థుల సౌకర్యం కోసం అదనంగా 1.17 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. పాఠశాలలో అభివృద్ధి పనుల కోసం రూ.7.5లక్షలతో ప్రణాళికలు పంపడంతో ప్రస్తుతం రూ.4.5 లక్షల నిధులు మంజూరుయ్యాయి. వాటితో పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. ప్రహరీ గోడ ఏర్పాటు చేస్తే తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి ఉండదనే స్వార్థంతో కొందరు తెలుగు తమ్ముళ్లు పాఠశాల ప్రధానోపాధ్యాయునికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే జేసీబీల సాయంతో పాఠశాలలోని మరుగుదొడ్లను కూల్చివేశారు.
పాఠశాల స్థలంలోనే రహదారిని ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు ఎందుకు వేస్తున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శైలిజ ప్రశ్నిస్తే మా పొలాల్లోకి వెళ్లడానికి దారి ఏర్పాటు చేయాలని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన అనుమతితోనే మరుగుదొడ్లను కూల్చివేసి రోడ్డు వేస్తున్నామని సమాధానం ఇచ్చారు. అనుమతి పత్రాలు చూపాలని హెచ్‌ఎం కోరితే దాటవేస్తున్నారు. విద్యార్థులు వినియోగించే మరుగుదొడ్లు కూల్చివేయడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల చర్యలను నీతిమాలినవిగా పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ తహశీల్దార్ మహబూబ్‌బాషాను వివరణ కోరింది. రహదారి నిర్మించుకోవాలని ఎలాంటి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. పాఠశాల స్థలాన్ని పరిశీలించి ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.