కార్పొరేట్ వైద్యశాలకంటే దీటుగా వైద్య సేవలు
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి అనుబంధంగా మెడికల్ కళాశాల ఏర్పాటు అయ్యాక కార్పొరేట్ వైద్యశాలకంటే దీటుగా వైద్య సేవలు అందిస్తోంది. ఫలితంగా రోజు రోజుకు రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వైద్యశాల, కళాశాలల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పరికరాలు, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తాజాగా నెల్లూరులోని ప్రభుత్వ మెడికల్ కళాశాల, పెద్దాస్పత్రి అభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసింది. ఈ పరిణామం వైద్యానికి ఊతంగా నిలుస్తోంది.
నెల్లూరు (అర్బన్): వైద్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. రోగులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు డాక్టర్లను నుంచి నర్సింగ్, పారామెడికల్, పారిశుధ్య సిబ్బంది వరకు ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వేగంగా భర్తీ చేస్తోంది. తాజాగా అభివృద్ధి పనులకు రూ.48.50 కోట్లను మంజూరు చేసింది. ప్రొద్దుటూరుకు చెందిన కేపీసీ కన్స్ట్రక్షన్స్ కంపెనీ రివర్స్ టెండర్ ద్వారా కాంట్రాక్ట్ పనులు దక్కించుకుంది. ఈ నిధులతో త్వరలోనే పెద్దాస్పత్రిలో అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి. బాయ్స్‌కు, లేడీస్‌కు విడివిడిగా పీజీ హాస్టల్స్, యూజీ హాస్టల్స్ నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న పల్మనాలజీ వార్డు పైన మరో బ్లాక్‌ను, డెర్మటాలజీ విభాగానికి సంబంధించి మరో అదనపు బ్లాక్‌ను నిర్మించనున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు క్వార్టర్స్ ఏర్పాటు చేయనున్నారు.
సీపేజ్ రాకుండా చర్యలు
పెద్దాస్పత్రిలో నూతనంగా నిర్మించిన 5 అంతస్తుల భవనంలోని సెల్లార్ అధిక వర్షాలతో ఊట ఉబికి నడుము లోతు నీటితో నిండిపోతుంది. ఫలితంగా అత్యంత ఖరీదైన విద్యుత్ ప్యానెల్స్లోకి వర్షపు నీరు చేరి పెద్దాస్పత్రికి విద్యుత్ సౌకర్యం నిలిచిపోయింది. దీంతో అప్పటికప్పుడు కలెక్టర్ ఆధ్వర్యంలో ఇంజినీర్లు అత్యంత కష్టపడి రోగులు ఇబ్బంది పడకుండా జనరేటర్లు, ఇతర మార్గాల ద్వారా విద్యుత్‌ను పునరుద్దరించారు. ఆ పరిస్థితి మళ్లీ వర్షాలకు తలెత్తకుండా ఉండేందుకు మద్రాస్ ఐఐటీ ప్రొఫెసర్లు పరిశీలించారు. ప్రొఫెసర్ల నివేదిక మేరకు ప్రస్తుతం రూ.1.50 కోట్ల అంచనాలతో కెమికల్ బాండింగ్ చేపట్టి వర్షపు ఊట రాకుండా అరికట్టనున్నారు.
పరికరాల కోసం అదనంగా రూ.5 కోట్లు
ఇప్పటికే రేడియాలజీ విభాగానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 6 పీజీ సీట్లను మంజూరు చేసింది. రేడియాలజీ విభాగంలో ఆధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లను అదనంగా మంజూరు చేసింది. పీజీ సీట్లు ఎన్ని ఎక్కువ మంజూరైతే అంత మంది స్పెషలైజేషన్ డాక్టర్లు అందుబాటులోకి వచ్చి రోగులకు నాణ్యమైన వైద్యం మరింత ఎక్కువ మందికి అందుతుంది.
రూ.3.5 కోట్లతో క్రిటికల్ కేర్ బిల్డింగ్ భవనం
కోవిడ్ వంటి అనుకోని ఉపద్రవాలు వచ్చినప్పుడు రోగులు ఇబ్బంది పడకుండా క్రిటికల్ కేర్ యూనిట్‌ను నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పెద్దాస్పత్రిలో రూ.3.5 కోట్లతో క్రిటికల్ యూనిట్‌ను నిర్మించేందుకు ప్రతి పాదనలు సిద్ధమయ్యాయి. కేంద్ర అధికారుల బృందం అధికారులు ఈ ఏడాది జూలై 12న æ నెల్లూరు పెద్దాస్పత్రిలో స్థలపరిశీలన చేసి వెళ్లారు. అత్యవసర వైపరీత్యాలు సంభవించినప్పుడు క్రిటికల్ కేర్ యూనిట్ భవనంలో వైద్య సేవలు అందిస్తారు. మిగతా సమయాల్లో లాబోరేటరీ వంటి సాధారణ వైద్యసేవలకు వినియోగించుకుంటారు. ఇవన్ని పూర్తయితే పెద్దాస్పత్రిలో మరింతగా వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయి.
త్వరలో పనులు ప్రారంభం
మెడికల్ కళాశాలతో పాటు అనుబంధ ప్రభుత్వ పెద్దాస్పత్రిలో అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.48.50 కోట్లు మంజూరు చేసింది. కాంట్రాక్ట్ దక్కించుకున్న కేపీసీ కన్స్ట్రక్షన్ కంపెనీ కాంట్రాక్టర్ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తారు. పనులు పూర్తయితే మరిన్ని సేవలు అందుబాటులోకి వచ్చి రోగులకు ఎంతో మేలు చేకూరుతుంది.
– ఎం. విజయభాస్కర్, ఏపీఎంఎస్ఐడీసీ జిల్లా ఈఈ
మెయింటెనెన్స్‌కు మరో రూ. 1.30 కోట్లు
మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఇటీవల పెద్దాస్పత్రిని పరిశీలించి డాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మెయింటెనెన్స్‌కు నిధులు లేవని తెలుసుకున్న మంత్రి కాకాణి ఇందు కోసం ప్రతిపాదనలు తయారు చేయా లని ఏపీఎంఎస్ఐడీసీ ఇంజినీర్‌ను ఆదేశించారు. దీంతో ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ విజయభాస్కర్ రూ.1.30 కోట్లతో అంచనాలు తయారు చేశారు. ఈ నిధులను రోగులకు ఇబ్బంది లేకుండా ఆపరేషన్ థియేటర్లో ఏసీలు, లిఫ్ట్‌లు, సెంట్రల్ లైటింగ్, పైపుల మరమ్మతులకు వినియోగించనున్నారు.