govindananda saraswathi
-
Krishnapatnam Medicine: ప్రతి జిల్లాలో ఆనందయ్య మందు పంపిణీ
ముత్తుకూరు: ఏపీలోని ప్రతి జిల్లాకు తొలి విడతగా కరోనా మహమ్మారి బారిన పడిన 5 వేల మందికి మందు పంపిణీ చేస్తానని తయారీ నిపుణుడు ఆనందయ్య చెప్పారు. శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు శ్రీగోవిందానంద సరస్వతి నేతృత్వంలో ఆనందయ్య శనివారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం గ్రామంలోని శ్రీసిద్ధేశ్వరాలయంలో ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. మహాశివుడి ముందు కరోనా మందు ఉంచి పూజలు చేయించారు. ఆనందయ్య మాట్లాడుతూ..సోమవారం (ఈ నెల 7న) 3 రకాల మందు ఉన్న కిట్‌ను ఆయా జిల్లా కేంద్రాలకు పంపిస్తామని చెప్పారు. మందు పేరు ‘ఔషధ చక్రం’ తమ గురువుల సహకారంతో 30 ఏళ్లుగా అనారోగ్యానికి గురైన వారికి ఆయుర్వేద మందు అందజేస్తున్నామని ఆనందయ్య చెప్పారు. కరోనా నివారణకు తాము తయారు చేసిన మందు పేరు ‘ఔషధ చక్రం’ అని తెలిపారు. మందుకు ఈ పేరునే పరిగణించాలని కోరారు. కాగా, కృష్ణపట్నం శివారులోని తన సొంత భూమిలో ఆయుర్వేద మందు తయారీ, పంపిణీ కుటీరం నిర్మాణానికి ఆనందయ్య శనివారం భూమి పూజ చేశారు. సోమిరెడ్డి విమర్శలు సరికాదు: ఆనందయ్య నెల్లూరు(సెంట్రల్): కరోనాకు తాను తయారు చేసిన మందుపై కొందరు లేనిపోని విమర్శలు చేస్తున్నారని, అది సరికాదని ఆయుర్వేద మందు తయారీ నిపుణుడు ఆనందయ్య అన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కూడా ఏదో వెబ్సైట్ అంటూ విమర్శలు చేస్తున్నారని, సోమిరెడ్డి తనను రాజకీయాల్లోకి లాగడం మాని, ప్రజలకు ఉపయోగపడే సలహాలు, సూచనలు ఇస్తే మంచిదని శనివారం ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. తనను కలవడానికి వచ్చిన కొందరిపై లాఠీ చార్జీ చేశారని సోమిరెడ్డి చెప్పడం అవాస్తవమన్నారు. తాను కరోనాకు మందు తయారుచేయడం మొదలుపెట్టి 40 రోజులకు పైగా అయిందని, కొద్ది రోజులపాటు నిలిచిపోయినా.. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుండటంతో మందు తయారీలో నిమగ్నమయ్యానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా తనకు సహకరించిందన్నారు. అనుమతులు రావడంతో మొదట సర్వేపల్లి నియోజకవర్గంలో మందు పంపిణీ చేసి, తరువాత మిగిలిన ప్రాంతాలకు పంపిణీ చేద్దామనే నిబంధన పెట్టుకున్నామని, అంతేతప్ప వెబ్‌సైట్‌కు కాకాణి గోవర్దన్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. సోమవారం నాటికి మందు పంపిణీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. -
విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దు: టీటీడీ ఈవో
సాక్షి, తిరుపతి: ఆంజనేయస్వామి జన్మస్థలం అంజనాద్రినే అని.. టీటీడీ అన్ని పరిశోధించే ఈ ప్రకటన చేసిందని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గోవిందానంద స్వామి ఏదేదో మాట్లాడుతున్నారని.. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారన్నారు. పురాణాలను కూడా ఆయన విశ్వసించడం లేదన్నారు. సరైన ఆధారాలుంటే ఎవరైనా తీసుకురావొచ్చని.. అంతేకాని విమర్శలు చేయడమే పనిగా పెట్టుకోవద్దని టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి హితవు పలికారు. కాగా, శేషాచలం కొండల్లోని అంజనాద్రియే ఆంజనేయుడి జన్మస్థానమని టీటీడీ పండితుల కమిటీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని గత నెల 21న శ్రీరామనవమి రోజున తిరుమలలో ఆంజనేయుడి జన్మస్థానంపై పరిశోధన చేసిన కమిటీ ప్రకటించింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే చెప్పాలని కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ ప్రొఫెసర్ మురళీధర శర్మ కోరారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్వామి హనుమంతుడి జన్మస్థాన ప్రకటనపై తనకున్న అభ్యంతరాలతో టీటీడీకి ఓ లేఖ రాశారు. ఆంజనేయుడి జన్మస్థలంపై చర్చాగోష్టి నిర్వహించాలని కోరారు. గత నెల జాతీయ సంస్కృత వర్సిటీలో ఆంజనేయుడి జన్మస్థానం అంశంపై చర్చ జరిగిన సంగతి విదితమే. చదవండి: అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థానం హనుమ జన్మస్థలం: ఆధారాలు తప్పని నిరూపించలేకపోయారు -
‘ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులే’
డి.హీరేహాళ్ : సమాజంలో ప్రతి ఒక్కరూ భగవంతుని స్వరూపులేనని ద్వారక శారద పీఠం అధిపతి జగద్గురు శంకరాచార్య స్వరూపానంద సరస్వతి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు హంపి నుంచి డి.హీరేహాళ్ మండలం ఓబుళాపురం గ్రామానికి ఆయన చేరుకున్నారు. ఆయనకు ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు, ఆర్డీఓ రామారావు స్వాగతం పలికారు. అనంతరం మహాలక్ష్మి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వరూపానంద సరస్వతి మాట్లాడుతూ ధర్మాన్ని రక్షించాలని, అధర్మాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు. గోవిందానంద సరస్వతి మాట్లాడుతూ హిందూసాంప్రదాయాలతోనే భారతీయత ముడిపడివుందన్నారు. కార్యక్రమానికి మార్కెట్ యార్డ్ చైర్మన్ చంద్రహాస్, రాష్ట్ర ధర్మసంరక్షణ సమితి అధ్యక్షులు రఘుస్వామి, స్థానిక నాయకులు నాగళ్ళిరాజు, హనుమంతరెడ్డి, మోహన్‌రెడ్డి, ఆనందరెడ్డి, వెంకటరెడ్డి, అంగడి రాజశేఖర్, మహబళి, చంద్రశేఖర్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.