'ఎన్కౌంటర్' వంజారాకు భారీ స్వాగతం!
సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు నిందితుడు, వివాదాస్పద పోలీసు అధికారుల్లో ఒకరైన మాజీ డీజీ వంజారా బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. అహ్మదాబాద్‌లోని సబర్మతి జైలు వద్ద ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. భారీ సంఖ్యలో అభిమానులు జైలు వద్దకు చేరుకుని వంజారాకు స్వాగతం పలికారు. ఆయనకు అనుకూలంగా నినాదాలు చేస్తూ.. ఆయనతో కలిసి ఫొటోలు తీయించుకోడానికి ఎగబడ్డారు. దాదాపు ఎనిమిదేళ్లుగా జైల్లో ఉన్న వంజారాకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
జైలు నుంచి విడుదలైన ఆయన.. ఏదో ఎన్నికల్లో నెగ్గినట్లుగా మెడలో దండలు వేయించుకుని ఓపెన్ టాప్ జీపులో ఊరేగింపుగా వెళ్లి.. అందులోనే విలేకరుల సమావేశం కూడా నిర్వహించారు. అయితే.. వంజారా తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోకి మాత్రం ప్రవేశించకూడదని కోర్టు ఉత్తర్వులిచ్చింది. రెండు బూటకపు ఎన్కౌంటర్లలో ఏడుగురిని హతమార్చిన కేసులో మరికొందరు పోలీసు ఉన్నతాధికారులు సహా.. వంజారా కూడా నిందితుడు. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారంటూ వాళ్లను ఎన్కౌంటర్లో హతమార్చారు. కానీ ఉగ్రవాదుల పేరుతో పౌరులనే చంపేశారని సీబీఐ కేసు పెట్టింది.