బృందా‘వనాలు’..!
- మొక్కలు నాటేందుకు 25 చెరువుల ఎంపిక
- పచ్చదనంపై హెచ్ఎండీఏ దృష్టి
- ‘ఔటర్’లో పూర్తయిన ‘హరిత హారం’
సాక్షి, సిటీబ్యూరో: జల వనరుల వద్ద పచ్చదనం పెంపునకు హెచ్ఎండీఏ సన్నద్ధమైంది. తొలిదశలో 25 చెరువుల వద్ద మొక్కలు నాటి ‘వనదుర్గాన్ని’ ఆవిష్కరించేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం సిద్ధమవుతోంది. గత నెల వరకు వర్షాలు లేని కారణంగా ఆగిపోయిన ‘హరిత హారం’ మళ్లీ ఊపందుకొంది. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ హరితహారాన్ని పూర్తి చేసిన అధికారులు ఇప్పడు చెరువుల వద్ద పచ్చదనాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు.
‘త్రి సూత్రం’తో...
చెరువుల ఆక్రమణల నిరోధం, బండ్స్ సుందరీకరణ, బఫర్ జోన్లో చె ట్ల అభివృద్ధి అనే‘త్రి సూత్ర’ విధానంతో అధికారులు ముందుకెళుతున్నారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం ప్రారంభించి... అక్టోబరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
టార్గెట్ 40 లక్షలు
‘తెలంగాణ కు హరిత హారం’ పథకంలో ఈ ఏడాది 395 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 40 లక్షల మొక్కలు నాటాలనేది హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ విభాగం లక్ష్యం. ఇందులో భాగంగా రూ.1.5 కోట్లతో నర్సరీలు ఏర్పాటు చేసి... ఇటీవల ఔటర్ చుట్టూ, 19 జంక్షన్లు, 3 రేడియల్ రోడ్లు, ఖాళీ స్థలాలు, గ్రామాలు, స్కూళ్లు, ఆస్పత్రుల వద్ద సుమారు 9 లక్షల మొక్కలు మొక్కలు నాటారు. మరో 5-6 లక్షల మొక్కలను వివిధ ప్రభుత్వ శాఖలకు ఉచితంగా అందించారు. తాజాగా ఎంపిక చేసిన 25 జలాశయాల వద్ద 10-15లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
‘పచ్చ’లహారం
ఔటర్ చుట్టూ గ్రీనరీని అభివృద్ధి చేయాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. ఆ మేరకు ఔటర్ మెయిన్ క్యారేజిలోని రోడ్ మీడియన్, రైల్వే కారిడార్, సర్వీసు రోడ్లు, ఇంటర్ ఛేంజెస్లో పూల మొక్కలు, ఫలసాయాన్నిచ్చే వృక్ష జాతులు నాటినట్టు అర్బన్ ఫారెస్ట్రీ డెరైక్టర్ స్వర్గం శ్రీనివాస్ తెలిపారు. ‘హరితహారం’ కింద హెచ్ఎండీఏకు ఈ ఏడాది రూ.50 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని... వాటిలో రూ.25 -30 కోట్లు వెచ్చిస్తున్నట్లు ఆయన ‘సాక్షి’కి వివచించారు. మిగిలిన నిధులతో వచ్చే ఏడాది పెద్ద మొత్తంలో మొక్కలను నాటి నగరాన్ని వనదుర్గంగా తీర్చిదిద్దుతామన్నారు.