‘జీఎస్టీతో భయం లేదు.. హెల్ప్‌డెస్క్‌లు పెట్టాం’
యాదాద్రి: కొత్తగా వచ్చిన జీఎస్టీ విధానంతో భయపడాల్సి పనిలేదని వాణిజ్య శాఖ కమిషనర్ వి.అనిల్‌కుమార్ వ్యాపారులకు భరోసా ఇచ్చారు. జీఎస్టీపై రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా తొలిసారిగా బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని వ్యాపారులకు అవగాహన కల్పించారు. జీఎస్టీ వల్ల ఏదో జరుగుతుందన్న భయం వీడాలని, డీలర్లకు, వినియోగదారులకు లాభం చేకూరుతుందని వివరించారు. రూ.7.50లక్షల వ్యాట్ టర్నోవర్ నుంచి రూ.20 లక్షల వరకు టర్నోవర్ గల వ్యాపారులకు ఎలాంటి ట్యాక్స్‌లు ఉండవన్నారు. మూడు నెలల పాటు జీఎస్టీపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
హెల్ప్‌డెస్క్‌లు సీటీఓ కార్యాలయాల్లో పనిచేస్తాయని చెప్పారు. టెక్స్టైల్, చేనేత రంగాలపై పన్నుల విషయాల్లో మరింత స్పష్టతను ఇస్తామని పేర్కొన్నారు. ఈ- వేబిల్ సిస్టం మూడు నెలల తర్వాత వస్తుందని అంత వరకు డెలివరీ ఇన్వాయిస్పై సరుకు రవాణా చేసుకోవచ్చన్నారు. జీఎస్టీపై ఎదురయ్యే సందేహలను తీర్చడానికి టోల్‌ఫ్రీ నంబర్ 18004253787కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఫోన్ చేయవచ్చన్నారు.