Guruji
-
సరళ వాస్తు గురూజీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి..
హుబ్లీ: రాష్ట్రంతో పాటు ముంబై తదితర ప్రాంతాల్లో సరళ వాస్తు గురూజీగా పేరొందిన చంద్రశేఖర్ గురూజీ దారుణ హత్య రాష్ట్రంలో కలకలం సృష్టించింది. మంగళవారం హుబ్లీలో ప్రెసిడెంట్ హోటల్లో ఆయనను శిష్యులు మహంతేష్, మంజునాథ్ కత్తులతో పొడిచి చంపడం తెలిసిందే. పోలీసులు దర్యాప్తులో అనేక విషయాలు వెలుగుచూశాయి. స్థిరాస్తుల విషయంలో నిందితులు, ఎంతో కాలంగా విశ్వాసంగా ఉన్న మహంతేష్ దంపతులతో గురూజీకి ఆస్తుల గురించి వివాదం తలెత్తింది. ఇటీవల మహంతేష్ ఆస్తులను అమ్మగా రూ. 5 కోట్లు వచ్చిందని తెలిసింది. ఆ రూ.5 కోట్ల మొత్తం తిరిగి ఇవ్వాలని మహంతేష్‌ను గురూజీ ఒత్తిడి చేశాడని, ఇదే హత్యకు కారణమైందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన శిష్యులను బినామీ ఆస్తులకు వారసులుగా పెట్టడమే స్వామీజీ చేసిన పెద్ద తప్పు అని తెలుస్తోంది. ముఖ్యంగా ముంబైలో సరళవాస్తు కార్యాలయం పూర్తి బాధ్యతలను మహంతేష్ చూసేవాడు. మరో నిందితుడు మంజునాథ్‌ను కూడా పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు. హుబ్లీలో ఇద్దరినీ ఒకే చోట ఉంచి తమదైన శైలిలో నిజాలు రాబట్టేందుకు విచారణ చేస్తున్నారు. గురూజీ హత్య తనకెంతో బాధ కలిగించిందని జిల్లా ఇన్చార్జి మంత్రి శంకర్ పాటిల్ మునేనకొప్ప తెలిపారు. చదవండి: (సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి) నా భర్తకు శిక్ష పడాలి – నిందితుడు మహంతేష్ భార్య గురూజీని హత్య చేయడం తన భర్త మహంతేష్ చేసిన ఘోరమని నిందితుని భార్య వనజాక్షి తెలిపారు. చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందేనన్నారు. భర్త అకృత్యం వల్ల తాను పోలీసు స్టేషన్‌కు రావాల్సి వచ్చిందన్నారు. విచారణ జరిపిన తర్వాత తనను ఇంటికి పంపించారన్నారు. తన పిల్లలతో కలిసి జీవిస్తానని, చేసిన పాపాన్ని భర్త అనుభవించక తప్పదన్నారు. ఇలాంటి దారుణానికి పాల్పడతారని తాను ఊహించలేదు, ఇంత దారుణంగా చంపేంత ద్వేషం ఏముందో తెలియదని ఆమె అన్నారు. అయితే తన పేరున మాత్రం గురూజీ ఎలాంటి ఆస్తులు చేయలేదన్నారు. తన భర్త పేరిట ఆస్తులు చేసిన విషయం కూడా తనకు తెలియదన్నారు. ఇప్పటికీ తాను కొన్న ఫ్లాట్‌కు వాయిదాల ద్వారా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. తామిద్దరూ పని చేస్తున్న సందర్భంలోనే గురూజీ విశాల హృదయంలో తమ పెళ్లి చేశారన్నారు. తన స్వంత పిల్లల్లా తమని చూశారని తెలిపారు. -
సరళ వాస్తు గురూజీ దారుణ హత్య.. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి
హుబ్లీ (కర్ణాటక): సరళవాస్తు ద్వారా రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ ప్రెసిడెంట్ హోటల్లో ఈ దారుణం జరిగింది. ఆయన శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడడంతో గురువుకే వాస్తు దోషం కలిగిందా? అన్న ప్రశ్న తలెత్తింది. కాళ్లు మొక్కుతున్నట్లు నటించి చంద్రశేఖర్ దగ్గర పని చేస్తున్న మహంతేష్ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు. వీరిలో గురూజీకి ఒకరు కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 40 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్ నుంచి తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడి బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులు పట్టుబడ్డారు. హుబ్లీ పోలీస్ కమిషనర్ లాభురాం మాట్లాడుతూ గురూజీ ప్రెసిడెంట్ హోటల్లో బస చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిసి వారిని కలవడానికి లాబీలోకి వచ్చారు. ఈ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యారు అని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నిందితులు మంజునాథ, మహంతేష్ ఆస్తి వివాదమే కారణమా? హత్యకు ఆస్తి వివాదమే కారణమని చెబుతున్నారు. చంద్రశేఖర్ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్ పేరున కోట్లాది రూపాయల ఆస్తి చేశారని చెబుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేసేవాడు. అయితే తిరిగి ఇవ్వడం కుదరదని మహంతేష్ తెగేసి చెప్పాడు. ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చి ఆయన్ను హత్య చేశారు. కాగా చంద్రశేఖర్ గురూజీ అంత్యక్రియలు సుళ్య గ్రామంలో బుధవారం నెరవేరనున్నాయి. అత్యంత ప్రజాదరణ సొంతం సరళ్ వాస్తు సూత్రాలతో గురూజీ ప్రసిద్ధి చెందారు. అనేక టీవీ చానెళ్లలో నిత్యం కనిపిస్తూ ఉండేవారు. సరళమైన జీవనం గురించి ఉపన్యాసాలిస్తుంటారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది. గురూజీ వయసు గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. సుమారు 55 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని అంచనా. ఆయన స్వస్థలం బాగల్‌కోట జిల్లా. తల్లి పేరు నీలమ్మ అంగడి. భార్య, కుటుంబ విషయాలు గుట్టుగా ఉంచారు. చదవండి: (టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత) -
HYD: స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్, హత్య.. కుట్రలో ప్రముఖ గురూజీ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్‌భాస్కర్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. కేపీహెచ్‌బీ ఠాణా వెనకవైపు ఓ హాస్టల్లో ఉంటున్నాడు. గత నెల 20 నుంచి విజయ్‌భాస్కర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆయన అల్లుడు జయ సృజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు మరొకరు.. మొత్తం నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్ఫోన్లోఫోటో తీసి ఉంచుకున్నాడు. కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ఈ గురూజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ ప్రముఖుడి స్థలంలో వెలికి తీసిన విలువైన లోహాన్ని విదేశీ కంపెనీకి విక్రయించడం కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌రెడ్డితోపాటు ఆయనకు తెలిసిన వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బులిచనట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్ తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై గురూజీ కోపం పెంచుకొని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసును చేధించిన పోలీసులు హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. విజయ్‌భాస్కర్ హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు -
భక్తిశ్రద్ధలతో మహాయజ్ఞం
ఆళ్లగడ్డ: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో మూడో రోజు బుధవారం మహా యజ్ఞానాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ జ్వాల సెంట్రల్ ట్రస్ట్ నిర్వాహకులు శ్రీధర్ గురూజీ ఆధ్వర్యంలో ఈ యజ్ఞం కొనసాగుతున్న విషయం విదితమే. బుధవారం ఉదయం సూర్యనమస్కారంతో పూజలు మొదలయ్యాయి. గణపతి హోమం, సాలిగ్రామ అభిషేకం జరిపారు. అస్త్రవిన్యాసం కార్యక్రమంలో భాగంగా.. పురాణ, ఇతిహాసాల కాలంలో దేవ, దానవులు ఉపయోగించిన ఆయుధాలను శ్రీధర్ గురూజీ ధరించి ప్రయోగం ప్రకారం పూజించి ప్రతిష్టించారు. అనంతరం కుబేర లోకం యజ్ఞ కుండలకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేదపండితులు పాల్గొన్నారు. -
రాసలీలల కేసులో దేవిశ్రీకి బెయిల్
ఆమె తన రెండవ భార్యగా పేర్కొన్న స్వామీజీ తన అనుమతితోనే రెండవ పెళ్లి చేసుకున్నారన్న తొలి భార్య బెంగళూరు, న్యూస్‌లైన్ : రాసలీలల కేసులో అరెస్టైన దేవిశ్రీ గురూజీ కి బెయిల్ మంజూరైంది. బుధవారం ఉదయం స్థానిక ఆరవ ఏసీఎంఎం న్యాయస్థానంలో దేవిశ్రీని పోలీసులు హాజరుపరిచారు. కేసు వివరాలు తెలుసుకున్న అనంతరం న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తమకు గురూజీ నుంచి ప్రాణహాని ఉందంటూ ఆయన కారు డ్రైవర్ వసంత్, మేనేజర్ ఉదయ్ ఫిర్యాదు మేరకు హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు కేసు నమోదు చేసిన వైనం విదితమే. అంతకు ముందే రాసలీలలపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రసారం కావడంతో దేవిశ్రీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తమిళనాడులోని ధర్మపురిలో తలదాచుకున్న దేవిశ్రీని మంగళవారం రాత్రి హెచ్ఎస్ఆర్ లే ఔట్ పోలీసులు అదుపులోకి తీసుకుని బెంగళూరుకు పిలుచుకొచ్చారు. కాగా, బెయిల్‌పై బయటకు వచ్చిన వెంటనే దేవిశ్రీ ఓ టీవీ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను రాసలీలలు సాగించినట్లు ప్రసారం అయిన క్లిప్పింగ్‌లలో ఉన్న మహిళ తన రెండవ భార్య అని పేర్కొన్నారు. మొదటి భార్య అనుమతితోనే ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇందుకు ఎలాంటి సాక్ష్యాలు ఉండవని తెలిపారు. ఏనాడు తాను సన్యాసినని చెప్పుకోలేదని స్పష్టం చేశారు. గత ఆగస్టు 15 నుంచి తనను బ్లాక్మెయిల్ చేశారని, తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు చేసి రూ. 2.50 లక్షలు డ్రైవర్ వసంత్‌కు ఇచ్చి, మరో ప్రాంతానికి వెళ్లి సుఖంగా జీవించాలని సూచించానని అన్నారు. గత ఏడాది మే నుంచి తన రెండవ భార్య దూరమైందని, ప్రస్తుతం ఆమె ఎక్కడుందో తనకు తెలియదని పేర్కొన్నారు. తన అనుమతితోనే తన భర్త రెండవ పెళ్లి చేసుకున్నారని దేవిశ్రీ భార్య కౌసల్య స్పష్టం చేశారు. దేవిశ్రీతో కలిసి టీవీ చానెల్లో ఆమె మాట్లాడారు. వివాహమైన తర్వాత ఆమె తనతో పాటు ఒకే ఇంటిలోనే కలిసి ఉందని, వేరు కాపురానికి అంగీకరించలేదని చెప్పారు.