హుబ్లీ (కర్ణాటక): సరళవాస్తు ద్వారా రాష్ట్రంతో పాటు పలు రాష్ట్రాల్లో ఖ్యాతి పొందిన చంద్రశేఖర్ గురూజీ మంగళవారం పట్టపగలు దారుణ హత్యకు గురయ్యారు. హుబ్లీ ప్రెసిడెంట్ హోటల్‌లో ఈ దారుణం జరిగింది. ఆయన శిష్యులే ఈ ఘాతుకానికి పాల్పడడంతో గురువుకే వాస్తు దోషం కలిగిందా? అన్న ప్రశ్న తలెత్తింది.
కాళ్లు మొక్కుతున్నట్లు నటించి
చంద్రశేఖర్ దగ్గర పని చేస్తున్న మహంతేష్ శిరూర్, మంజునాథలను నిందితులుగా గుర్తించారు. వీరిలో గురూజీకి ఒకరు కాళ్లకు మొక్కుతున్నట్లుగా నటించగా, మరొకరు చాకుతో పొడిచాడు. కిందకు పడినా కూడా వదలకుండా సుమారు 40 సార్లకు పైగా కత్తితో పొడిచి హోటల్ నుంచి తప్పించుకున్నారు. పోలీసులు వెంటాడి బెళగావి జిల్లా రామదుర్గ వద్ద ఈ ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. హత్య జరిగిన 4 గంటల్లోనే నిందితులు పట్టుబడ్డారు. హుబ్లీ పోలీస్ కమిషనర్ లాభురాం మాట్లాడుతూ గురూజీ ప్రెసిడెంట్ హోటల్లో బస చేశారు. ఇద్దరు వ్యక్తులు వచ్చారని తెలిసి వారిని కలవడానికి లాబీలోకి వచ్చారు. ఈ సమయంలో కత్తితో దాడి చేసి పరారయ్యారు అని చెప్పారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. హత్య దృశ్యాలు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
నిందితులు మంజునాథ, మహంతేష్
ఆస్తి వివాదమే కారణమా?
హత్యకు ఆస్తి వివాదమే కారణమని చెబుతున్నారు. చంద్రశేఖర్ గురూజీ శిష్యుల పేరిట బినామీ ఆస్తులు పెట్టారని, నిందితుడు మహంతేష్ పేరున కోట్లాది రూపాయల ఆస్తి చేశారని చెబుతున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాక తన ఆస్తిని తిరిగి ఇచ్చేయాలని గురూజీ ఒత్తిడి చేసేవాడు. అయితే తిరిగి ఇవ్వడం కుదరదని మహంతేష్ తెగేసి చెప్పాడు. ఇదే విషయమై మాట్లాడడానికి హోటల్‌కు వచ్చి ఆయన్ను హత్య చేశారు. కాగా చంద్రశేఖర్ గురూజీ అంత్యక్రియలు సుళ్య గ్రామంలో బుధవారం నెరవేరనున్నాయి.
అత్యంత ప్రజాదరణ సొంతం
సరళ్ వాస్తు సూత్రాలతో గురూజీ ప్రసిద్ధి చెందారు. అనేక టీవీ చానెళ్లలో నిత్యం కనిపిస్తూ ఉండేవారు. సరళమైన జీవనం గురించి ఉపన్యాసాలిస్తుంటారు. యూట్యూబ్‌లో ఆయన వీడియోలకు లక్షలాది వ్యూస్ రావడం బట్టి ఆయన ప్రజాదరణ ఏమిటో అర్థమవుతుంది. గురూజీ వయసు గురించి ఎప్పుడూ చెప్పేవారు కాదు. సుమారు 55 ఏళ్లకు పైగా వయసు ఉంటుందని అంచనా. ఆయన స్వస్థలం బాగల్‌కోట జిల్లా. తల్లి పేరు నీలమ్మ అంగడి. భార్య, కుటుంబ విషయాలు గుట్టుగా ఉంచారు.
చదవండి: (టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ కన్నుమూత)
Comments
Please login to add a commentAdd a comment