సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఆహారంలో మత్తుమందు కలిపి హాస్టల్ నుంచి వ్యాపారి కిడ్నాప్ చేసి అనంతరం గుట్టుచప్పుడు కాకుండా హత్య చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాకు చెందిన విజయ్‌భాస్కర్ కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటూ స్థిరాస్తి వ్యాపారం చేసుకుంటున్నాడు. కేపీహెచ్‌బీ ఠాణా వెనకవైపు ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. గత నెల 20 నుంచి విజయ్‌భాస్కర్ ఫోన్ స్విచ్చాఫ్ వస్తుండటంతో ఆయన అల్లుడు జయ సృజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హాస్టల్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలంగా విజయ్‌భాస్కర్‌ను కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు కంటపడ్డాయి. కారు నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయగా.. మల్లేష్, సుధాకర్, కృష్ణంరాజుతోపాటు మరొకరు.. మొత్తం నలుగురు కలిసి భాస్కర్‌ను హత్య చేసినట్లు బయటపడింది. మాజీ సైనికోద్యోగి మల్లేశ్ కుమారుడు భాస్కర్ ఉండే హాస్టల్‌లో చేరి నమ్మకంగా ఉంటూ ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చినట్లు తేలింది. స్పృహ కోల్పోయిన విజయ్‌ను కొందరు కారులో తీసుకెళ్లి శ్రీశైలంలోని సున్నింపెట వద్ద కాటికాపరిని బెదిరించి మృతదేహాన్ని ఖననం చేయించారు. వీరి తీరుపై అనుమానంతో మృతదేహాన్ని చితిపై ఉంచిన సమయంలో కాటికాపరి తన సెల్‌ఫోన్‌లోఫోటో తీసి ఉంచుకున్నాడు.
కాగా నెల్లూరు జిల్లా కావలికి చెందిన ఓ గురూజీ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్లు తేలింది. ఇటీవల ఈ గురూజీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఓ ప్రముఖుడి స్థలంలో వెలికి తీసిన విలువైన లోహాన్ని విదేశీ కంపెనీకి విక్రయించడం కోసం పలువురు భక్తుల నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌రెడ్డితోపాటు ఆయనకు తెలిసిన వారు కూడా పెద్ద మొత్తంలో డబ్బులిచనట్లు తెలుస్తోంది. విదేశాల నుంచి నిధులొస్తాయంటూ కాలయాపన చేస్తున్నాడనే అనుమానంతో విజయ్ తన డబ్బు కోసం గురూజీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. దీంతో విజయ్‌పై గురూజీ కోపం పెంచుకొని హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
కేసును చేధించిన పోలీసులు
హైదరాబాద్‌లో స్థిరాస్థి వ్యాపారి హత్య కేసును పోలీసులు చేధించారు. విజయ్‌భాస్కర్ హత్య కేసులోని నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు
Comments
Please login to add a commentAdd a comment