Haj pilgrimage
-
చోటా సన్మాన్.. బడా దావత్! ప్లేట్ బిర్యానీకి రూ.700? మరో విశేషం ఏంటంటే!
సాక్షి, సిటీబ్యూరో: ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. ధార్మిక సేవల కోసం వినియోగించాల్సిన సర్కారీ సొమ్ము పక్కదారి పడుతోంది. యాత్రికులకు ఉత్తమ సేవలు అందించినవారికి అవార్డుల పేరుతో హజ్ కమిటీ భారీగా నిధులను దుబారా చేసింది. ఆతిథులకు మెగా విందును ఏర్పాటు చేసి ఖజానాకు గండికొట్టింది. ప్లేట్ బిర్యానీకి ఏకంగా రూ.700 చెల్లించి భారీగా వెనకేసుకుంది. కేవలం 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించినట్లు చెప్పుకున్న కమిటీ.. బిల్లుల చెల్లింపుల వరకు వచ్చేసరికి ఈ సంఖ్యను 350 చేసేసింది. ఇలా ఏకంగా రూ.3.5 లక్షలను ఈ దావత్‌కు వెచ్చించింది. మరో విచిత్రమేమింటే.. ఈ ఆతిథ్యమిచ్చిన హోటల్ హజ్ కమిటీ చైర్మన్‌ది కావడం మరో విశేషం. హజ్ యాత్రికుల కోసం శిబిరం ఏర్పాటు చేసేందుకు ఏటా బడ్జెట్లో రూ.2 కోట్లను ప్రభుత్వం కేటాయిస్తోంది. ఈ నిధులకు అదనంగా చైర్మన్ పలుకుబడిని ఉపయోగించి మరో రూ.2 కోట్లను ప్రభు త్వం నుంచి రాబట్టారు. ఆర్థిక సంవత్సరం దగ్గర పడుతుండటంతో మంచినీళ్లలా నిధులను ఖర్చు చేస్తున్న హజ్ యంత్రాంగం.. లెక్కా పద్దు కూడా చూసుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. (చదవండి: NGRI Hyderabad: ఆ గనుల్లో బంగారం కంటే విలువైన లోహం) -
‘సీఎం జగన్ వల్లనే ముస్లింల స్వప్నం నెరవేరింది’
సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లింల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వల్లనే నెరవేరిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. 2020 ఏడాదికిగాను హజ్ యాత్ర తొలి దరఖాస్తును డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గురువారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 13 జిల్లాకు చెందిన ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టి సారించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. 2020 హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ రోజు నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులకు నవంబర10 చివరి తేదీ అని చెప్పారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం తరఫును అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రూ. 3 లక్షలలోపు ఆదాయం ఉన్న యాత్రికులకు రూ. 60వేలు, అంతకు మించి ఆదాయం ఉన్నవారికి రూ. 30వేలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. క్యాబినేట్ ఆమోదం పొందిన తరువాత ఈ సాయం యాత్రికులకు అందజేస్తామని పేర్కొన్నారు. విజయవాడకు ఎంబార్క్ పాయింట్ కేటాయించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వికి ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
సముద్ర మార్గంలో హజ్ యాత్రకు సౌదీ అంగీకారం
న్యూఢిల్లీ: హజ్ యాత్రను తక్కువ ఖర్చులో పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. హజ్ యాత్రికులు జెడ్డాకు చేరుకునేందుకు 23 ఏళ్ల క్రితం మూసివేసిన సముద్ర మార్గాన్ని పునరుద్ధరించాలన్న భారత్ విజ్ఞప్తిని సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంపై సౌదీ హజ్, ఉమ్రా మంత్రి మహ్మద్ బిన్ ఆదివారం సంతకం చేసినట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. అయితే సముద్ర మార్గం ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందన్న విషయంపై పూర్తి సమాచారం తెలియలేదు. 1995 వరకు హజ్ యాత్రికులు ముంబైలోని మజ్గావ్ (ఎల్లో గేట్) నుంచి సౌదీలోని జెడ్డాకు ఈ మార్గం ద్వారానే ప్రయాణించేవారు. అప్పట్లో ఈ ప్రయాణానికి సుమారు 12 నుంచి 15 రోజుల సమయం పట్టేది. అయితే ప్రస్తుతం అత్యాధునిక ఓడలు అందుబాటులో ఉండటంతో యాత్రకు 4 రోజులు సమయం మాత్రమే పట్టనుంది. మెహ్రం, లాటరీ లేకుండానే హజ్‌కు.. 2018లో దాదాపు 1300 మంది భారతీయ మహిళలు పురుషుల తోడు లేకుండానే హజ్ యాత్రకు వెళ్లనున్నారని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ పేర్కొన్నారు. వీరందరినీ లాటరీ విధానం నుంచి తప్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. -
సముద్రమార్గం ద్వారా హజ్‌కు!
న్యూఢిల్లీ: 23 ఏళ్ల విరామం తరువాత సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్రికులను సౌదీ అరేబియాకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హజ్ పాలసీ 2018 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. జలమార్గం ద్వారా హజ్ యాత్రికులను ముంబై నుంచి జెడ్డాకు పంపించడం 1995 నుంచి నిలిపి వేశారు. ముంబై నుంచి జెడ్డాకు యాత్రికులను చేరవేసే ఎంవీ అక్బరీ నౌక బాగా పాతదై ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో అప్పట్లో సముద్ర ప్రయాణాన్ని నిలిపేశారు. విమానయానం ద్వారా వెళ్లే హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని 2022 నాటికి రద్దు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తోంది.