సాక్షి, విజయవాడ : రాష్ట్ర విభజన తరువాత విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లాలనుకున్న ముస్లింల చిరకాల స్వప్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వల్లనే నెరవేరిందని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. 2020 ఏడాదికిగాను హజ్ యాత్ర తొలి దరఖాస్తును డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గురువారం ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 13 జిల్లాకు చెందిన ముస్లిం మత పెద్దలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింల సంక్షేమం, అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించారని తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో హజ్ యాత్రకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. 2020 హజ్ యాత్రకు వెళ్లాలనుకునేవారు ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులకు నవంబర10 చివరి తేదీ అని చెప్పారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ప్రభుత్వం తరఫును అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. రూ. 3 లక్షలలోపు ఆదాయం ఉన్న యాత్రికులకు రూ. 60వేలు, అంతకు మించి ఆదాయం ఉన్నవారికి రూ. 30వేలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. క్యాబినేట్ ఆమోదం పొందిన తరువాత ఈ సాయం యాత్రికులకు అందజేస్తామని పేర్కొన్నారు. విజయవాడకు ఎంబార్క్ పాయింట్ కేటాయించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వికి ఏపీ ప్రభుత్వం తరఫున ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment