కరువు పరిస్థితుల్లోనే చేవదేలుతుంది!
ఎర్రచందనం నాటిన 20-22 ఏళ్లకు కోతకొస్తుంది. ఎకరానికి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇతర పంటల సాగుకు పనికిరాని రాళ్లూరప్పలతో కూడిన మెట్ట ప్రాంత ఎర్ర నేలలు, గరప నేలలు దీని సాగుకు అనుకూలం. నీరు నిల్వ ఉండని నల్లరేగడి భూములూ పనికొస్తాయి. దీన్ని నీరు పెట్టి, ఎరువులు వేసి పెంచితే చేవ తక్కువగా వస్తుంది. దీని వేళ్లు బాగా లోతుకు చొచ్చుకెళ్తాయి. మొక్కలు నాటిన తర్వాత ఏడాది వరకు డ్రిప్ ద్వారా తగుమాత్రంగా నీరిస్తే చాలు. అది కూడా ఎర్ర నేలల్లో అయితే పది రోజులకోసారి నీరివ్వొచ్చు. రేగడి నేలల్లో అయితే 20 రోజులకోసారి ఇచ్చినా చాలు.
ఆ తర్వాత నీరు, ఎరువులు ఏమీ అక్కర్లేదు. కరువు పరిస్థితుల్లో పెరిగితేనే చేవ ఎక్కువగా వస్తుంది. నాణ్యమైన దిగుబడి వస్తుంది. పొలంలో అక్కడక్కడా, గట్ల మీద ఎకరానికి ఎర్రచందనం 50, 60 మొక్కలు వేసుకోవచ్చు. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే రైతులు పొలంలో పూర్తిగా దీన్నే సాగు చేయవచ్చు. ఎర్రచందనానికి ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ మాత్రమే ఉంది. అయితే, దుంగల ఎగుమతిపైనే నిషేధం ఉంది. ఎర్రచందనం ఉత్పత్తుల ఎగుమతిపై ఆంక్షల్లేవు. ఆ దిశగా మనవాళ్లు ఎందుకు ఆలోచించడం లేదో అర్థంకావడం లేదు. శ్రీగంధం ఎకరానికి 3-4 టన్నుల దిగుబడి వస్తుంది. దీనికి దేశీయంగా విపరీతమైన గిరాకీ ఉంది. ఎర్రచందనం, శ్రీగంధం సాగుపై తెలుగు రాష్ట్రాల రైతులకు శిక్షణ ఇచ్చే ఆలోచన ఉంది. రైతులు విస్తృతంగా సాగు చేయడం మొదలు పెడితే ఎర్రచందనం స్మగ్లింగ్ తగ్గుతుంది.
- డా. హంపయ్య(98494 27981), వ్యవసాయ రంగ నిపుణుడు, అధ్యక్షుడు, ఆం.ప్ర. జీవవైవిధ్య మండలి, హైదరాబాద్