గ్యాస్ సరఫరాలో చేతివాటం
గ్యాస్ సిలిండర్ల సరఫరాలో డెలివరీ బోయిస్ చేతివాటం పెరిగిపోయిందని వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కో సిలిండర్‌పై రూ. 40 అదనంగా అక్రమ వసూళ్లు చేస్తున్నారు. కాస్త అమాయకంగా కనిపిస్తే వంద రూపాయలకు పైనే గుంజుతున్నారు.
వినియోగదారుల నుంచి వసూలుచేసే అదనపు సొమ్మును ఏజెన్సీ నిర్వాహకులకు అందజేస్తున్నట్టు సమాచారం. నగరంలోని కృష్ణలంక, విద్యాధరపురం, వన్‌టౌన్, టుటౌన్, పటమట ప్రాంతాలకు చెందినవారే కాకుండా మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, ఉయ్యూరుల్లో వినియోగదారులు ‘సాక్షి’ కార్యాలయాలకు ఫోన్లు చేసి తమ గోడు వినిపించారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి...
మచిలీపట్నం, గుడివాడ, కైకలూరు, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో డెలివరీ పాయింట్లలో కూడా ఇదే విధంగా దోపిడీ జరుగుతున్నట్లు ‘న్యూస్‌లైన్’ దృష్టికి వచ్చింది. ఒకసారి వచ్చిన సిలిండర్ వెనక్కి వెళ్లిపోతే తిరిగి నెలరోజుల వరకు రాదనే భయంతో ఎక్కువ రేటు చెల్లించాల్సి వస్తోందని చెబుతున్నారు. దీనికి తోడు బుకింగ్ చేసిన తరువాత సిలిండర్ తీసుకోకపోతే ఇచ్చే సబ్సిడీ సిలిండర్ల సంఖ్య తగ్గిపోతుందని గ్యాస్ డెలివరీ బోయిస్ భయపెట్టడంతో ఇక చేసేది లేక తీసుకుంటున్నారు.