Hanmanth sindhe
-
ప్రధాని మోదీకి ఆస్కార్ ఇవ్వాలి.. మహానటుడు: కేటీఆర్ వ్యంగ్యస్త్రాలు
సాక్షి, కామారెడ్డి: బీఆర్ఎస్ పథకాలు దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి కర్ణాటక, మహారాష్ట్రలో కనిపిస్తుందా అని ప్రశ్నించారు. విద్యుత్, సాగునీరు ఇక్కడ పుష్కలంగా అందిస్తున్నామని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందే తెలంగాణ పోరాటమని గుర్తు చేశారు. అక్కడ( కర్ణాటక, మహారాష్ట్ర) రైతుబీమా, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలు అమలవుతున్నాయా..? అనే విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పిట్లంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. గిరిజన తండాలను, గూడెలను గ్రామపంచాయతీలుగా చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. తండాల్లో రోడ్లను అభివృద్ధి చేస్తాం. గిరిజనులకు సర్పంచ్‌లుగా అవకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. బిచ్కుంద, పిట్లంను మున్సిపాలిటీలుగా మారుస్తామని, మిగతా మున్సిపాలిటీల కంటే ఈ రెండింటిని అద్భుతంగా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. చిత్తశుద్ధితో పని చేసేవారిలో హన్మంత్ షిండే ఒకరు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా.. ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించే షిండే మాట్లాడుతారని మంత్రి కేటీఆర్ అన్నారు. జుక్కల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు. మంచి నాయకుడు దొరికినప్పుడు గట్టిగా 10 కాలాల పాటు కాపాడుకోవాలి. గత ఎన్నికల్లో 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచాను అని చెప్పిండు.. ఈ సారి నాగమడుగు ప్రాజెక్టు తెచ్చినందుకు 72 వేల ఓట్ల మెజార్టీతో గెలిపించే బాధ్యత మీపై ఉన్నది. ప్రజల పట్ల చిత్తశుద్ధితో పని చేసేవారు కొందరే ఉంటారు. అందులో ఒకరు హన్మంత్ షిండే. అలాంటి నాయకుడిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. ‘తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ రేవంత్ రెడ్డి గొంతు చించుకుంటున్నాడు. 10 సార్లు అవకాశాలు ఇస్తే 50 ఏళ్ళు దేశాన్ని పాలించి కాంగ్రెసోళ్లు ఏం చేశారు..? పరిపాలించడం చేతగాని వారు ఇపుడు ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు. అబద్ధాలు చెప్పడంలో, నటనలో ప్రధాని మోదీకి ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. మహానటుడు మోదీ. దేశ సంపద అంతా దోస్తు ఖాతాలో జమ చేస్తూ విపక్షాలను కొనుగోలు చేస్తున్నాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి. నల్లధం తెస్తానని ఇపుడు తెల్లముఖం వేశాడు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ గల్లంతు చేయాలి. తెలంగాణపై కేంద్రం కక్షగట్టింది. తెలంగాణకు పట్టిన శని బీజేపీ. మోడీ ఈడీలకు భయపడం. ప్రజాక్షేత్రంలో తూల్చుకుందాం. కేసీఆర్‌ను పాడుకుని. మూడోసారి సీఎం చేసుకుందాం’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చదవండి: ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. కవిత సంచలన కామెంట్స్ -
ఈ భాషలన్నీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొట్టిన పిండి!
సాక్షి , కామారెడ్డి: ‘ఆ ఎమ్మెల్యే మరాఠీ మాట్లాడే గ్రామాలకు వెళ్లినప్పుడు కనిపించిన వారినల్లా ‘కసే అహత్’ అంటూ మరాఠీలో వారి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. కన్నడ మాట్లాడే గ్రామాలకు వెళితే ‘నీవు హేగిద్దిరే’ అంటూ కన్నడలో మాట్లాడి వారి కష్టసుఖాలను కనుక్కుంటారు. అలాగే తెలుగు మాట్లాడే గ్రామాలకు వెళితే ‘బాగున్నరా..’ అంటూ తెలుగులో మాట్లాడతారు. ఆయనే బహు భాషల సమ్మేళనమైన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే హన్మంత్ సింధే. ఆయనకు పలు భాషలు వచ్చు. అందుకే నియోజకవర్గంలో ఏ భాషవాళ్లు కలిస్తే వారి భాషలో మాట్లాడతారు. నియోజకవర్గంలో గిరిజనుల జనాభా కూడా ఎక్కువే. లంబాడీ భాషలో కూడా ఆయన అనర్గళంగా మాట్లాడతారు. అలాగే అధికారుల దగ్గరకు వెళ్లినపుడు ఇంగ్లీషు భాషను ఉపయోగిస్తారు. హిందీ మాట్లాడే అవకాశం ఉంటే హిందీలో మాట్లాడతారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో ప్రజలు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడతారు. దీంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా వారితో ఆయా భాషల్లో మాట్లాడాల్సిందే. ఇంజనీరింగ్ విద్యనభ్యసించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధేకు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషలతో పాటు కన్నడ, మరాఠీ భాషలు కూడా వచ్చు. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు ఏ భాష మాట్లాడితే ఎమ్మెల్యే కూడా వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. జుక్కల్ మండలంలోని సోపూర్ గ్రామం దాటితే కర్ణాటక రాష్ట్రం వస్తుంది. దీంతో జుక్కల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు చాలా వరకు కన్నడనే మాట్లాడతారు. అలాగే మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉంటాయి. ఇక్కడ చాలా వరకు మరాఠీ మాట్లాడుతారు. పలు గ్రామాల్లో మరాఠీ మీడియం స్కూళ్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇలా జుక్కల్ నియోజకవర్గం మూడు భాషల సంగమంలా ఉంటుంది. ఎమ్మెల్యే సింధే ఎన్నికల సమయంలో ప్రచారంతో పాటు గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు చేయడానికి వెళ్లినప్పుడు అక్కడి ప్రజలకు అర్థమయ్యేలా కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడుతారు. ప్రతి సభలో ఆయన మూడు భాషలలో మాట్లాడి ఆకట్టుకుంటారు. దీంతో ప్రజలు కూడా ఆయనంటే అభిమానం చూపిస్తారు. ఎమ్మెల్యే వివిధ భాషల్లో మాట్లాడడాన్ని కొత్తవారు ఆసక్తిగా చూస్తుంటారు. చదవండి: నభూతో నకాశీ.. మెప్పించిన చిత్రకళ ‘పల్లాను గెలిపిస్తే సీఎం గ్లాస్లో సోడా పోశాడు’ -
భూములపై హక్కులు కల్పించండి సారూ..
సాక్షి, బిచ్కుంద (కామారెడ్డి): భూములపై హక్కులు కల్పించాలని కోరుతూ మండలంలోని ఎల్లారం గిరిజన రైతులు ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఎదుట మోకరిల్లారు. గోపన్‌పల్లి గ్రామం వద్ద ఉన్న స్టోన్ క్రషర్, డాంబర్ ప్లాంట్లతో ఏర్పడిన కాలుష్యంతో ఆనారోగ్యం బారిన పడుతున్నామని గ్రామస్తులు మంగళవారం గోపన్‌పల్లి శివారులో మొక్కలు నాటడానికి వచ్చిన ఎమ్మెల్యేకు వారు మొర పెట్టుకున్నారు. భూములపై కలెక్టర్‌తో చర్చించానని, ఆందోళన చెందొద్దని సింధే తెలిపారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు కలిసి డాంబర్ ప్లాంట్‌తో పొగ, స్టోన్ క్రషర్‌తో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే 15 మంది క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారని చెప్పారు. ప్లాంట్లను మూసి తమ ప్రాణాలు కాపాడాలని వాపోయారు. -
అట్టడుగు నుంచి అభివృద్ధి వైపు.. హన్మంత్‌సింధే
కర్ణాటక, మహరాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న జుక్కల్ త్రిభాషా పద్ధతులకు నిలయంగా మారింది. సమైఖ్యపాలనలో వెనుకబడి ప్రాంతంగా పేరొందిన జుక్కల్ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం స్వరాష్ట్రంలో అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు కంచుకోటగా నిలిచిన జుక్కల్ నియోజకవర్గం ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం అనంతరం టీఆర్ఎస్ పార్టీ కారు జోరందుకుంది. గతంలో వెనుకబడిన ప్రాంతమిది.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న జుక్కల్ నియోజకవర్గం 1978లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి ఇక్కడి నుంచి ఏపీ అసెంబ్లీకి ఎన్నికైనా అభివృద్ధిని విస్మరించారు. రోడ్లు, రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడంతో విద్య, వైద్య సదుపాయాలు అందని ద్రాక్షగా మారాయి. సాగునీటి సదుపాయం లేక వ్యవసాయం దెబ్బతింది. అంతరాష్ట్ర లెండి ప్రాజెక్టుకు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడంతో పనులు అర్థంతరంగా నిలిచాయి. స్వరాష్ట్రంలో అభివృద్ధి బాట తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన తర్వాత 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా హన్మంత్‌సింధే విజయం సాధించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎం కావడం టీఆర్ఎస్ నుంచి హన్మంత్‌సింధే ఎమ్మెల్యే కావడంతో జుక్కల్ నియోజకవర్గం అభివృద్ధి బాట పట్టింది. నిరక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, రోడ్లు, రవాణా మార్గాలు మెరుగయ్యాయి. నాలుగు నెలల కాలంలో రూ.1,560 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. నియోజకవర్గంలో అభివృద్ధి ఇది.. పిట్లం, బిచ్కుద, పెద్దకొడప్గల్ మండలాల్లోని 50గ్రామాలు, నిజాంసాగర్ మండలంలోని నాన్‌కమాండ్ ఏరియా ప్రాంత ప్రజల చిరకాల కోరికైన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.476.25 కోట్లు మంజూరు చేసింది. డబుల్ లైన్ రోడ్లు లేని జుక్కల్ నియోజకవర్గంలో 14రోడ్లను 165కి.మీ మేర సుందరీకరణకు రూ. 212.08 కోట్లు కేటాయించింది. అలాగే ఆయా మండలాల్లో నూతనంగా 6 వంతెనలకు రూ.52కోట్లు మిషన్ కాకతీయ పథకం కింద 264 చెరువుల పునరుద్ధరణ కోసం రూ.85కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల నిల్వలు గోదాములు 23,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి రూ.14.50కోట్లు జుక్కల్, బిచ్కుంద మండల కేంద్రాల్లో 30 పడకల ఆస్పత్రుల గదుల నిర్మాణానికి రూ.10కోట్లు పంచాయతీరాజ్ బీటీ రోడ్లు 32 గ్రామాలకు 45కి.మీ రూ.52కోట్లు మిషన్ భగీరథ పథకానికి రూ.300 కోట్లు మంజూరు జుక్కల్ జూనియర్ కళాశాలకు రూ.2.25 కోట్లు బిచ్కుంద జూనియర్ కళాశాలకు రూ.1.50 కోట్లు రెసిడెన్షియల్, కళాశాలలు, పాఠశాల అదనపు గదులకు రూ.25 కోట్లు రూ. 45 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం రూ. 40 కోట్లతో కమ్యూనిటీ భవనాలు, అంగన్వాడీ భవనాల నిర్మాణం పెద్దకొడప్గల్లో మండల కేంద్రంగా ఏర్పాటు కొత్తగా 66 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేపట్టాల్సిన పనులు నిజాంసాగర్ ప్రాజెక్ట్‌ను పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దడం, నిజాంసాగర్ మండల కేంద్రంలో జూనియర్ కళాశాల, పిట్లం మండల కేంద్రంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల, పక్కగృహాలు లేనికి వారికి సొంతిళ్ల నిర్మాణం, కౌలాస్ కాలువల ఆధునికీకరణ, ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేయాల్సిన ఉంది. సెగ్మెంట్ గ్రాఫ్ మండలం ఓటర్లు పురుషులు స్త్రీలు ఇతరులు మద్నూర్ 40,254 20,251 19,999 04 జుక్కల్ 31,797 16,117 15,680 00 బిచ్కుంద 35,508 17,527 17,977 04 పెద్దకొడప్గల్ 13,638 6,833 6,804 01 పిట్లం 30,370 14,842 15,524 04 నిజాంసాగర్ 25,309 11,884 13,424 01 ప్రభుత్వ పథకాలే గెలిపిస్తాయి ఇంజినీరింగ్ ఉద్యోగాన్ని వదిలేసి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చి తనను జుక్కల్ నియోజవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. 2004లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయా.2009 ఎన్నికల్లో గెలిచినా కాంగ్రెస్ ప్రభుత్వ కారణంగా అనుకున్నతంత అభివృద్ధి జరగలేదు. రాష్ట్ర సాధన కోసం 2014 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాను. స్వరాష్ట్రంలో జుక్కల్ అభివృద్ధికి సీఎం నిధులు కేటాయించడంతో పురోగతి సాధించాం. ఇప్పటివరకు చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుంది. – హన్మంత్‌సింధే, టీఆర్ఎస్ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే -
నామినేషన్ వేసిన హన్మంత్‌సింధే
సాక్షి,మద్నూర్/నిజాంసాగర్: అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం విడుదలైంది. విడుదలైన మొద టి రోజు అభ్యర్థులేవరు నామినేషన్ దాఖలు చేయలేదు. రెండవ రోజైన మంగళవారం జుక్కల్ అ సెంబ్లీ నియోజికవర్గం జుక్కల్ అ సెంబ్లీ నియోజికవర్గం హన్మంత్‌సింథే నామినేషన్ వేశారు. జుక్కల్ నియోజికవర్గంలో మొదటి రోజు ఎలాంటి నామినేషన్లు దా ఖలు కాలేదు. టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌సింధే ఎ లాంటి హంగు, ఆర్భాటాలు లేకుండ కేవలం నలుగురితో కలిసి వచ్చి నామినేషన్ వేసి వెళ్లారు. సాదాసీదాగా ఆయన నామినేషన్ వేయడం విశేషం. మద్నూర్ మండల కేంద్రంలోని సలాబత్పూర్ హ నుమాన్ ఆలయంలో ఎంపీ బీబీపాటిల్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌తో కలిసి హన్మంత్‌సింధే ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జడ్పీ చైర్మెన్ రాజు, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మెన్ అన్నారం వెంకట్రాంరెడ్డి ఆయన వెంట ఉన్నా రు. నామినేషన్లు వేసేందుకు ఈనెల 14, 18, 19 తేదీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థు లు సి ద్ధమవుతున్నారు. జుక్కల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అ భ్యర్థి హన్మంత్ సింధే రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలు అందజేశారు. సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి: సింధే కేసీఆర్ ప్రవేశ పట్టిన సంక్షేమ పథకాలే గెలుపిస్తాయని టీఆర్ఎస్ అభ్యర్థి హన్మంత్‌సింధే అన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన మాట్లాడుతు టీఆర్ఎస్ చేపడుతున్న అభివృద్ధి పనులు మీ కళ్ల ముందే ఉన్నాయని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
హ్యాట్రిక్ సాధ్యమయ్యేనా..!
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంప్రదాయం కలగలిపి ఉంటుంది. కన్నడ, మరాఠీ, తెలుగు భాష సాంప్రదాయలతో ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకత వేరు. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించలేకపోయారు. గతంలో నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినా, వరుసగా మూడు సార్లు గెలవలేదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో హన్మంత్ సింధే గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తిరిగి ఎన్నికయితే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టిస్తారు. ఆయన హ్యాట్రిక్ సాధింస్తారో లేదో తేలాలంటే డిసెంబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. 14 సార్లు ఎన్నికలు ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జుక్కల్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లయినా అభ్యర్థులు ఎవ్వరూ హ్యాట్రిక్ సాధించలేరు. స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు, కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు, టీఆర్ఎస్ అభ్యర్థి ఒక్కసారి విజయం సాధించారు. కానీ ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించలేరు. 1967, 1972 సంవత్సరంలో సామెల్ విఠల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం 1978, 1983 వరుసగా రెండు సార్లు, 1989, 2004 సంవత్సరాల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 1985, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున బేగరి పండరి రెండు సార్లు గెలుపొందారు. 1999 సంవత్సరంలో టీడీపీ తరపున కుమారి అరుణతార విజయం సాధించారు. అలాగే 2009 సంవత్సరంలో టీడీపీ, 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ తరపున పోటీ చేసిన హన్మంత్‌సింధే వరుసగా రెండు సార్లు చొప్పున గెలుపొందారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న సింధేకు హ్యాట్రిక్ చాన్స్ ఉంది. కానీ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉంది. నాలుగోసారి బరిలోకి సింధే ప్రజాసేవ కోసం ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి హన్మంత్ సింధే రాజకీయాల్లోకి వచ్చారు. నీటిపారుదలశాఖలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన హన్మంత్‌సింధే 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి జుక్కల్ అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేరాఫ్‌గా నిలిచిన నేత సౌదాగర్ గంగారాం మూడుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంత్ సింధేను కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం ఓడించారు. అప్పటి ఓటమితో గుణపాఠం నేర్చుకున్న సింధే జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. దాంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయిపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా హన్మంత్‌సింధే మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు. -
‘సింధే’శారు
సాక్షి, పిట్లం(జుక్కల్): ఎన్నికల ప్రచారంలో భాగంగా జుక్కల్ తాజామాజీ ఎమ్మెల్యే హన్మంత్‌సింధే మంగళవారం పిట్లం మండలం అల్లాపూర్‌కు వెళ్లారు. గ్రామానికి వెళ్లిని సింధే గ్రామస్తులు కార్యకర్తలు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. బ్యాండు మేళాల నృత్యాలు చేస్తూ గ్రామంలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హన్మంత్‌సింధే గ్రామస్తులతో కలిసి నృత్యం చేసి అందరిని అలరించారు. -
నేడు కారెక్కనున్న సింధే
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీకి చెందిన జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ లో చేరనున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ లో చేరుతారు. ఇందుకోసం నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ చేస్తున్నారు. నిజాంసాగర్, బి చ్కుంద, జుక్కల్, మద్నూర్, పిట్లం మండలాలకు చెందిన మూడు వేల మంది కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు 300 వాహనాలను ఏర్పాటు చేశారు. శనివారం ఎమ్మెల్యే సింధేతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కొందరు అన్ని మండలాలలోని గ్రామాలవారీగా ఉన్న శ్రేణులతో ఫోన్లో సంప్రదింపులు జరిపారు. కార్యకర్తలు, నాయకులు తరలిరావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట టీఆర్ఎస్లో చేరేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నా, కొందరు వెనుకంజ వేస్తున్నారని సమాచారం. కాగా, తాము వంద వాహనాలలో హైదరాబాద్‌కు తరలివెళ్తున్నామని నిజాంసాగర్ టీడీపీ నాయకులు దుర్గారెడ్డి, రాజు, రమేశ్, గౌడ్ తెలిపారు. శనివారం మండల కేంద్రంలో వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే సిం ధేతో పాటు మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని వీడుతున్నామన్నారు. టీఆర్ఎస్లో చేరేందుకు సుమారు వెయ్యి మంది నాయకులు, కార్యకర్తలతో వెళ్తున్నామని చెప్పారు.