జుక్కల్ నియోజకవర్గం
సాక్షి,నిజాంసాగర్(జుక్కల్): కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దు కూడలిగా ఉన్న జుక్కల్ నియోజకవర్గంలో మూడు రాష్ట్రాల సంప్రదాయం కలగలిపి ఉంటుంది. కన్నడ, మరాఠీ, తెలుగు భాష సాంప్రదాయలతో ఈ ప్రాంత ప్రజల ప్రత్యేకత వేరు. ఈ నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పటికీ ఏ ఒక్కరూ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించలేకపోయారు. గతంలో నాలుగుసార్లు కాంగ్రెస్, నాలుగు సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించినా, వరుసగా మూడు సార్లు గెలవలేదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో హన్మంత్ సింధే గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తిరిగి ఎన్నికయితే హ్యాట్రిక్ సాధించి చరిత్ర సృష్టిస్తారు. ఆయన హ్యాట్రిక్ సాధింస్తారో లేదో తేలాలంటే డిసెంబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
14 సార్లు ఎన్నికలు
ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన జుక్కల్ నియోజకవర్గానికి 1952 నుంచి 2014 వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇన్నేళ్లయినా అభ్యర్థులు ఎవ్వరూ హ్యాట్రిక్ సాధించలేరు. స్వతంత్ర అభ్యర్థులు నాలుగుసార్లు, కాంగ్రెస్ అభ్యర్థులు ఐదు సార్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నాలుగుసార్లు, టీఆర్‌ఎస్ అభ్యర్థి ఒక్కసారి విజయం సాధించారు. కానీ ఆయా పార్టీల తరపున అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు హ్యాట్రిక్ సాధించలేరు. 1967, 1972 సంవత్సరంలో సామెల్ విఠల్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థిగా సౌదాగర్ గంగారాం 1978, 1983 వరుసగా రెండు సార్లు, 1989, 2004 సంవత్సరాల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. 1985, 1994 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ తరపున బేగరి పండరి రెండు సార్లు గెలుపొందారు. 1999 సంవత్సరంలో టీడీపీ తరపున కుమారి అరుణతార విజయం సాధించారు. అలాగే 2009 సంవత్సరంలో టీడీపీ, 2014 సంవత్సరంలో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేసిన హన్మంత్‌సింధే వరుసగా రెండు సార్లు చొప్పున గెలుపొందారు. ఈసారి జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున పోటీ చేస్తున్న సింధేకు హ్యాట్రిక్ చాన్స్ ఉంది. కానీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య అసెంబ్లీ ఎన్నికల పోరు పోటాపోటీగా ఉంది.
నాలుగోసారి బరిలోకి సింధే
ప్రజాసేవ కోసం ఇంజినీరింగ్ ఉద్యోగానికి రాజీనామా చేసి హన్మంత్ సింధే రాజకీయాల్లోకి వచ్చారు. నీటిపారుదలశాఖలో ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చిన హన్మంత్‌సింధే 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి జుక్కల్ అసెంబ్లీకి పోటీ చేశారు. అప్పటికే నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు కేరాఫ్‌గా నిలిచిన నేత సౌదాగర్ గంగారాం మూడుసార్లు జుక్కల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2004 సంవత్సరం ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి హన్మంత్ సింధేను కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ గంగారాం ఓడించారు. అప్పటి ఓటమితో గుణపాఠం నేర్చుకున్న సింధే జుక్కల్ నియోజకవర్గ ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేశారు. దాంతో 2009 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున రెండో సారి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి సౌదాగర్ సావిత్రి బాయిపై విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా హన్మంత్‌సింధే మూడోసారి ఎన్నికల బరిలో నిలిచి గెలుపొందారు. ప్రస్తుతం గెలుపొంది హ్యాట్రిక్ సాధించాలని నాలుగోసారి ఎన్నికల బరిలో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment